హైదరాబాద్: జవహర్ నగర్ డంపింగ్ యార్డు కాలుష్య నియంత్రణకు, దాని సమస్యల నుంచి శాశ్వత పరిష్కారం కోసం ఎంపీ ఈటల రాజేందర్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మేధావులు, పర్యావరణ వేత్తలు, డంపింగ్ యార్డు బాధితులు ఇందులో పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ‘‘జవహర్ నగర్ లో ప్రాణం పోయినా పర్లేదు అని జీవిస్తున్నారు. కోర్టులు ఇచ్చిన తీర్పులు కూడా అమలు చేయడం లేదు. కంచె చేను మేసినట్టు పాలకులు వ్యవహరిస్తున్నారు. ప్రజలకు చట్టాల మీద నమ్మకం పోతుంది. జవహర్ నగర్ లో మొదట కదిలించిన సంఘటన.. కుక్కలు ఒక బాబును పీక్కొని తిన్నాయి.
రాంకీ సీఎస్‌ఆర్ డబ్బులు ఇక్కడ తాగునీరు, రోడ్లు ప్రజలకు ఖర్చు చేయకుండా వేరే రాష్ట్రాల్లో ఖర్చు పెడుతున్నారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే వారికి ఏం శిక్ష విధించాలి? సీఎం రేవంత్ ను మొదటి సారి కలిసింది జవహర్ నగర్ ప్రజలకోసం. దీనిని పరిష‍్కరించాలని కోరితే.. మీరే మీటింగ్ పెట్టండి అని పెట్టించారు. కానీ చిత్తశుద్ధి లేదు. నాలుగు నెలలు దాటింది కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది.
ఇంకో దగ్గర చెత్త వేయడానికి ప్రజలు ఒప్పుకోరు కాబట్టి జీరో పొల్యూషన్ టెక్నాలజీతో చెత్త డంపింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. మహిళలకు గర్భస్రావాలు అవుతున్నాయి. జవహర్ నగర్ చుట్టుపక్కల నరక కూపంగా మారింది. 30 కిలోమీటర్ల రేడియస్ లో కాలుష్యం ఇబ్బంది ఉంది. ఈ ఏరియా పిల్లలను స్కిన్ ఇన్ఫెక్షన్ ఉందని స్కూల్స్ కూడా చేర్చుకోవడం లేదు.
డంప్ యార్డు సమస్య గురించి పార్లమెంట్లో మాట్లాడాను. చెత్తను ఎలక్ట్రిసిటీ జనరేషన్, బయోగ్యాస్, ఆర్గానిక్ మెన్యూర్ గా చేయవచ్చు. 27 నుంచి పాదయాత్ర మొదలు పెడుతున్నాను. నేను రాజీపడే ప్రసక్తి లేదు. బాధితులు ఇంటికి ఒకరు వస్తారు అని భావించి పాదయాత్ర మొదలు పెడుతున్నా. తప్పకుండా ప్రభుత్వం దిగివస్తుంది అని భావిస్తున్నా. కేంద్రం నుంచి నిధులు తెప్పించే బాధ్యత కూడా మేమే తీసుకుంటాం. రేవంత్ రెడ్డి దీనిమీద రాజకీయం చేయవద్దు’’ అని తెలిపారు.


