బోర విరుచుకున్న బోర్లు! | Illegal Borewells in Hyderabad | Sakshi
Sakshi News home page

బోర విరుచుకున్న బోర్లు!

Oct 26 2026 3:59 AM | Updated on Oct 26 2026 5:03 AM

Illegal Borewells in Hyderabad

ఆదివారం ఉదయం ఫతుల్లాగూడలోని మూసీ తీరంలో గల అక్రమ బోరు నుంచి నీటిని నింపుకున్న ఈ ట్యాంకర్‌.. అక్కడి నుంచి ఉప్పల్‌ పారిశ్రామిక ప్రాంతంలోని ఓ కంపెనీకి చేరుకుని నీరు అన్‌లోడ్‌ చేస్తున్న దృశ్యం

రాజధానిలో అడుగడుగునా అక్రమ బోర్ల దందాలు 

భూగర్భ జలాలు తోడి ట్యాంకర్ల ద్వారా విక్రయాలు

ఎలాంటి అనుమతులు, పన్ను చెల్లింపులు లేకుండానే... 

వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్న నీటి వ్యాపారులు 

మూసీ తీరం నుంచి తీసిన నీరు హోటళ్లు, అపార్ట్‌మెంట్లు, హాస్టళ్లకు.. 

ఏళ్లుగా చోద్యం చూస్తున్నసంబంధిత యంత్రాంగాలు 

నానాటికీ లోతుకు వెళ్లిపోతున్న భూగర్భ జలమట్టాలు గ్రౌండ్‌ వాటర్‌ రిపోర్ట్‌

శ్రీరంగం కామేష్ 
హైదరాబాద్‌లోని బోరబండలో సున్నం చెరువు చుట్టూ ఉన్న పలువురు తమ బెడ్రూములు... వంట గదులు... ఇతర ఇంటి గదులు... మెట్ల కింద... ఇలా ఎవరూ ఊహించని చోట్ల అక్రమంగా బోర్లు వేసి మాదాపూర్‌లోని అనేక ప్రాంతాలకు ఆ నీటిని విక్రయిస్తున్న వైనాన్ని హైడ్రా శనివారం చేపట్టిన ఆపరేషన్‌ బట్టబయలు చేసింది. కేవలం ఈ ఒక్క ప్రాంతంలోనే కాదు రాజధానిలోని అనేక చోట్ల అక్రమ బోర్లతో నీటి దందా యథేచ్ఛగా సాగుతోంది. ఈ అక్రమార్కులు ఏళ్లుగా నీటిని తోడేస్తూ భూగర్భ జలాలు మరింత కిందికి వెళ్లిపోవడానికి కారణమవుతున్నారు. ఇలా వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నా సంబంధిత విభాగాలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి.  

పట్టుమని పది సంస్థలూ లేవు... 
భూగర్భ జలాల లభ్యతపై ఆ ప్రాంత అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వీటి వినియోగంపై అనేక ఆంక్షలున్నాయి. కనీసం గృహావసరాల కోసం బోరు వేయాలన్నా కచ్చితంగా స్థానిక తహసీల్దార్‌ నుంచి అనుమతి తీసుకోవాల్సిందే. ఇలా వేసిన బోరు నీటిని కేవలం గృహ, వ్యక్తిగత అవసరాలకు మాత్రమే వినియోగించాలి. కనీసం ఒక్క ట్యాంకర్‌ కూడా విక్రయించడానికి ఆస్కారం లేదు. 

ప్లాంట్‌ ఏర్పాటు చేసి, అనుమతి పొందితే శుద్ధి చేసిన తాగు నీరు విక్రయించవచ్చు. ట్యాంకర్ల ద్వారా నీటిని అమ్మాలంటే కచి్చతంగా భూగర్భ జల శాఖ వద్ద అనుమతి తీసుకోవాలి. ప్రస్తుతం ఇలా అనుమతి తీసుకున్న వ్యక్తులు, సంస్థలు రాజధాని వ్యాప్తంగా కనీసం పది కూడా లేవు. భూగర్భ జలాలు  పరిమితంగా ఉన్న చోట ఇలా బోర్ల ద్వారా విక్రయానికి అనుమతి అసలే లభించదు. ప్రస్తుతం నగరంలో మాత్రం ఎలాంటి అనుమతులు లేకుండా వేల అడుగుల లోతుకు బోర్లు వేసి నీటిని విక్రయిస్తున్న వాళ్లు వందల సంఖ్యలో ఉన్నారు.  

పగటి కంటే రాత్రివేళ ఎక్కువగా... 
సాధారణ రోజుల్లో ఈ అక్రమ నీటి దందా పగటి వేళలో కంటే రాత్రి పూటనే ఎక్కువగా జరుగుతుంది. వేసవి వచి్చందంటే చాలు అక్రమార్కులు ట్యాంకర్ల ద్వారా 24 గంటలూ నీటిని తరలిస్తూనే ఉంటారు. భారీఎత్తున బోర్లు వేసిన ఈ అక్రమార్కులు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలిగినప్పుడు వినియోగించడానికి ప్రత్యేకంగా జనరేటర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. జీఎస్టీ సహా ఏ విభాగానికీ ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించకుండా రూ.లక్షల్లో వ్యాపారం చేస్తున్నారు. ఒక్కో ట్యాంకర్‌ను దాని పరిమాణాన్ని బట్టి సాధారణ రోజుల్లో రూ.1,000 నుంచి రూ.3,000 వరకు విక్రయిస్తుండగా, వేసవిలో ఇది రూ.5 వేల నుంచి రూ.10 వేలకు చేరుతుంది. ఇలా రోజుకు కొన్ని వందల ట్యాంకర్ల నీటిని ప్రముఖ హోటళ్లు, లాడ్జీలు, అపార్ట్‌మెంట్స్, హాస్టళ్లకు అమ్మేస్తున్నారు.  

ట్యాంకర్ల పరిస్థితీ ఫిట్‌‘లెస్‌’గానే... 
ఈ నీటిని తరలించడానికి వినియోగించే ట్యాంకర్లు సైతం ఫిట్‌నెస్‌కు ఆమడదూరంలో ఉంటున్నాయి. పాలు, పెట్రోలియం ఉత్పత్తులు, రసాయనాలు తరలించడానికి వినియోగించి, అప్పటికే శిథిలావస్థకు చేరిన ట్యాంకర్లను తక్కువ రేటుకు ఖరీదు చేసి వీటి కోసం వాడుతున్నారు. ఇవి రోడ్లపై ప్రయాణించినంత సేపూ కొన్ని లీటర్ల నీరు వృథాగా కారిపోతుంటుంది. అనేక సందర్భాల్లో ఈ ట్యాంకర్లు ప్రమాదాలకూ కారణమయ్యాయి. తెలంగాణ వాటర్, ల్యాండ్‌ అండ్‌ ట్రీస్‌ యాక్ట్‌ (వాల్టా)–2002లో భూగర్భ జలాల సంరక్షణకు సంబంధించిన నిబంధనలు ఉన్నాయి. ప్రజల తాగునీటి వనరులకు నష్టం కలిగించేలా నీటిని తోడితే, వాణిజ్య అవసరాల కోసం నీటి వెలికితీతను నిషేధించే చర్యలు తీసుకోవచ్చు. నివాస ప్రాంతాలు, రీచార్జ్‌ జోన్లలో నీటి వనరులు దెబ్బతినే పరిస్థితుల్లో విక్రయాల కోసం నీటిని తోడటంపై ఆంక్షలు విధించవచ్చు.  

పాల ఉత్పత్తులకూ... 
ఈ అక్రమ నీటి వ్యాపారం వెనుక ఆరోగ్యానికి చేటు కలిగించే కోణమూ ఉంది. ట్యాంకర్లలో నీటిని నింపే బోర్లలో కొన్ని మూసీ తీరంలో ఉన్నాయి. ఫలితంగా ఈ నీళ్లల్లో మూసీలోని రసాయన వ్యర్థాల ఆనవాళ్లూ ఉంటున్నాయి. ఈ నీటిని కొంటున్న హోటళ్లు, లాడ్జీల నిర్వాహకులు విషయం తెలిసినా వినియోగించేస్తున్నారు. ఫతుల్లాగూడలో ఏళ్లుగా సాగుతున్న రెండు అక్రమ బోర్లు మూసీ నదికి కేవలం 200 మీటర్ల దూరంలో ఉంటాయి. వీటిలో నుంచి నీటిని ట్యాంకర్ల ద్వారా ఉప్పల్‌ ఇండ్రస్టియల్‌ ఏరియాలో ఉన్న ప్రముఖ పాల ఉత్పత్తుల తయారీ కంపెనీకి తరలిస్తున్నారు. కేవలం ఈ ఒక్క సంస్థే కాదు... నగరంతోపాటు చుట్టుపక్కల ఉన్న అనేక పాల, ఆహార ఉత్పత్తుల్ని తయారు చేసే సంస్థలకూ మూసీ తీరంతోపాటు ఇతర చోట్ల ఉన్న అక్రమ బోర్ల నుంచే నీరు అందుతోంది. 
 
పట్టించుకోని యంత్రాంగం 
అక్రమ నీటి దందాలను అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు దీనివైపు కన్నెత్తి కూడా చూడట్లేదు. ఫలితంగా రాజధానిలోని అనేక ప్రాంతాల్లో భూగర్భ జాలాలు అడుగంటిపోతున్నాయి. ట్యాంకర్‌ డ్రైవర్ల నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్‌ కారణంగా వాహనచోదకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తోంది. ఇవి తిరిగే మార్గాల్లో రహదారులు సైతం ఛిద్రం అవుతున్నాయి. ఈ అక్రమ నీటి వ్యాపారంపై రెవెన్యూ సహా ఇతర విభాగాలు అప్పుడప్పుడు నామ్‌కేవాస్తేగా చర్యలు చేపడుతుంటాయి. అయినా మళ్లీ కొన్ని రోజులకే ఆ అక్రమ బోర్లు మళ్లీ యథావిధిగా పనిచేస్తున్నా అధికారుల కంటికి మాత్రం కనిపించట్లేదు. ఇకనైనా జలమండలి, రెవెన్యూ అధికారులు స్పందించి అక్రమ నీటి వ్యాపారాన్ని అడ్డుకోవాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పర్యావరణవేత్తలు కోరుతున్నారు. ‘అనుమతులు లేకుండా బోర్లు వేయడం నేరం. ట్యాంకర్ల ద్వారా అక్రమంగా నీటి వ్యాపారం చేస్తున్న వారిపై చర్యలు ఉంటాయి. అలాంటి బోర్లు, వాహనాలు సీజ్‌ చేస్తాం’అని రెవెన్యూ అధికారులు చెప్తున్నారు.  

అక్రమ నీటి దందాలకు మచ్చుతునకలు 
⇒ బాపూఘాట్‌ నుంచి నాగోల్‌ వరకు మూసీ తీరం వెంట అనేక చోట్ల అక్రమ నీటి వ్యాపారం జరుగుతోంది.  
⇒ అంబర్‌పేట శ్మశాన వాటికకు కూతవేటు దూరంలోనూ బోర్ల ద్వారా నీటిని తోడేసి విక్రయిస్తున్నారు. 
⇒ న్యూ మార్కెట్‌ మెట్రోస్టేషన్‌ సమీపంలో ఏకంగా ఓ భవనం లోపల నుంచే ట్యాంకర్లలోకి నీళ్లు నింపుతూ ఉంటారు.  
⇒ ఛే నంబర్‌ ఫ్లైఓవర్‌ మార్గంలో సర్వీసింగ్‌ సెంటర్లు, మరమ్మతుల దుకాణాల ముసుగులో నీటి దందా. 
⇒ శ్రీనగర్‌ కాలనీలోని అనేక ప్రాంతాల్లో ప్రహరీగోడలు, భారీ గేట్ల మధ్య జోరుగా ఈ అక్రమ నీటి వ్యాపారం జరుగుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement