420 హామీలిచ్చి ప్రజలకు ముఖం చాటేస్తున్నారు: కేటీఆర్
రేవంత్‌రెడ్డి పాలనలో వరుస స్కామ్‌లు
ప్రశ్నిస్తే తిట్లు, అక్రమ కేసులతో బెదిరింపులు
తెలంగాణలో కాంగ్రెస్‌ను ఎదుర్కొనే దమ్ము బీజేపీకి లేదు
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల మధ్య విభజనలు సృష్టిస్తుంటే, తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ప్రజలను దోచుకుంటోందని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు ఇచి్చన హామీలను విస్మరించారని, రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, కుంభకోణాలపై స్పందించకుండా మౌనం వహిస్తున్నారని దుయ్యబట్టారు.
సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో తెలంగాణ రాహుల్ గాంధీకి ఏటీఎంగా మారిందని, రేవంత్ ఆయనకు ఏటీఎం కార్డులా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన మైనారిటీ సీనియర్ నాయకుడు జిబ్రాన్ షరీఫ్ ఆదివారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
వెయ్యి రోజులైనా అమలుకాలేదు...
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని, 13 డిక్లరేషన్లను నెరవేరుస్తామని, మొత్తం 420 హామీలను అమలు చేస్తామని రాహుల్ గాంధీ ప్రజలకు మాట ఇచ్చారని కేటీఆర్ గుర్తుచేశారు. అయితే వెయ్యి రోజులు గడుస్తున్నా ఆ హామీల అమలు కాలేదన్నారు. తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనపై ఉందన్నారు. మైనారిటీ సంక్షేమానికి రూ.4,000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు అశోక్‌నగర్‌లో టీ స్టాల్ వద్ద కూర్చొని నిరుద్యోగ యువతకు హామీలు ఇచి్చన రాహుల్ ఇప్పుడు వారి సమస్యలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
వరుసగా స్కామ్‌లు
రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో ఒక్కొక్కటిగా వివాదాలు, అవినీతి ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయని కేటీఆర్ అన్నారు. రూ.200 కోట్ల విలువ ఉంటుందని చెబుతున్న ఐదెకరాల భూమిని కేవలం రూ.7 కోట్లకే తన తమ్ముడికి బహుమతిగా ఇచ్చారని ఆరోపించారు. సీఎం చిన్న తమ్ముడి విద్యార్హతలు, ఏరోస్పేస్ రంగంలో ఆయన వ్యాపార కార్యకలాపాలపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు. అమెరికాలో నివసిస్తున్న మరో తమ్ముడికి సంబంధించినదిగా పేర్కొంటున్న రూ.1,000 కోట్ల డీల్‌పై సమగ్ర వివరాలు వెల్లడించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
సమస్యలను ప్రస్తావిస్తే అక్రమ కేసుల బెదిరింపులతోపాటు తిట్లతో రేవంత్ రెడ్డి బదులిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ పాలనలోనూ ఇలాంటి ధోరణులే కొనసాగుతున్నాయన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే ప్రతిపక్ష నాయకులపై ఈడీ, సీబీఐ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలను ప్రయోగించడం, అరెస్టులతో భయపెట్టడం ప్రజాస్వామ్యానికి మంచిదికాదని కేటీఆర్ చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను ఎదుర్కొనే దమ్ము బీజేపీకి లేదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని, 2028లో బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. కాగా, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు భార్గవ్ దేశ్‌పాండే కేటీఆర్ నివాసంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. చేరికల కార్యక్రమాల్లో మాజీ మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, అనిల్ జాదవ్ తదితరులు పాల్గొన్నారు.


