సాక్షి, హైదరాబాద్: సినిమా స్టోరీని తలపించేలా పోలీస్ ఆఫీసర్ అవతారమెత్తి గన్‌లతో కిడ్నాప్‌లు, దౌర్జన్యాలకు పాల్పడుతున్న మోస్ట్ వాంటెడ్, డేంజరస్ క్రిమినల్‌పై సైబరాబాద్ కమిషనర్ ఎం రమేష్ ఉక్కుపాదం మోపారు. ఐదు రకాల దొంగ పేర్లతో చెలామణి అవుతూ పదేపదే నేరాలకు పాల్పడుతున్న నాగారాజు రఘు వర్మ (29)పై శనివారం పీడీ చట్టాన్ని ప్రయోగించారు. ఇతనిని గూండాగా ప్రకటిస్తూ.. చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు.
డ్రైవర్ నుంచి.. క్రైమ్ సామ్రాజ్యానికి..
ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలానికి చెందిన నాగరాజు రఘు వర్మ కొన్నేళ్ల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్‌కు వలస వచ్చాడు. తొలుత డ్రైవర్‌గా జీవితాన్ని ప్రారంభించిన ఇతగాడు.. విలాసవంతమైన జీవితాన్ని గడపాలనే కోరికతో నేరాల బాట పట్టాడు. ఈక్రమంలోనే ఖాకీ అవతారమెత్తిన నాగరాజు. తానొక పెద్ద పోలీస్ అధికారిని అంటూ అమాయక బాధితులకు ఎర వేయడం మొదలుపెట్టాడు. బాధితులను టార్గెట్ చేసి, వారిపై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని నమ్మించేవాడు. ‘మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయి’ అని భయభ్రాంతులకు గురిచేసేవాడు. ఆ తర్వాత కేసుల నుంచి కాపాడతామంటూ నమ్మించి డబ్బు వసూలు చేసేవాడు. అంతటితో ఆగకుండా బాధితులను ఏకంగా కిడ్నాప్ చేసి, తుపాకులు చూపించి వారి వద్ద ఉన్న నగదును దోచుకునేవాడు. 2017 నుంచి 2026 మధ్య కాలంలో14 రకాల కేసులలో ప్రధాన నిందితుడు.
జైలు నుంచి రాగానే మళ్లీ పంజా..
సాధారణంగా పీడీ చట్టం పడితే నేరస్థుల్లో భయం వస్తుంది. కానీ ఈ ఇతను మాత్రం జైలు నుంచి విడుదలైన ప్రతిసారీ పాత నేరాలనే మరింత స్పీడ్‌గా రిపీట్ చేసేవాడు. జైలు నుంచి బయటకు రాగానే పోలీస్ అధికారిగా నటిస్తూ కిడ్నాప్, దోపిడీలకు సంబంధించిన మరో నాలుగు కొత్త కేసులకు తెరలేపాడు. దీంతో రంగంలోకి దిగిన జగద్గిరిగుట్ట పోలీసులు అత్యంత చాకచక్యంగా ప్లాన్ వేసి ఇతని ఆట కట్టించి, కటకటాల వెనక్కి నెట్టారు. గతంలో రెండుసార్లు (2021, 2024) పీడీ చట్టం విధించినా బుద్ధి మార్చుకోకుండా, సమాజంలో పదేపదే భయాందోళనలు సృష్టిస్తున్న నాగరాజు రఘు వర్మపై సైబరాబాద్ కమిషనర్ మరోసారి పీడీ యాక్ట్ ఉత్తర్వులు జారీ చేశారు.


