ప్రభుత్వాలను మెరుగ్గా పనిచేయించే గొప్ప సాధనం.. నిరసనలు | Protests great mechanism for governments to perform better | Sakshi
Sakshi News home page

ప్రభుత్వాలను మెరుగ్గా పనిచేయించే గొప్ప సాధనం.. నిరసనలు

Oct 25 2026 6:32 AM | Updated on Oct 25 2026 6:32 AM

Protests great mechanism for governments to perform better

వాతావరణ ఉద్యమకారుడు సోనమ్‌ వాంగ్‌చుక్‌ వ్యాఖ్య

ముంబై: ప్రభుత్వాలు మెరుగైన సేవ లందించాలంటే ప్రజలు ఆందోళనలు చేయకతప్పదని వాతావరణ ఉద్యమ కారుడు, విద్యావేత్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ అన్నారు. ప్రభుత్వాలను మంచిగా పని చేయించే గొప్ప సాధనం ఆందోళనలే నని ఆయన అన్నారు. సానుకూల దృక్పథంతో చూస్తే, నిరసనలు ఒక ఫీడ్‌ బ్యాక్‌ వంటివి, ఒక విలువైన సలహా వంటివి అని ఆయన తెలిపారు. ప్రజలను ఉద్యమాలు చేయకుండా తీవ్ర నిర్బంధాలు, ఆంక్షలు కొనసాగించిన ఫలితంగా పొరుగునున్న బంగ్లాదేశ్, శ్రీలంక దేశాల్లో ఏం జరిగిందో మనందరికీ తెలిసిందేనన్నారు. 

ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ నిరసనలు తెలిపే ప్రజలకు ఎటువంటి ఆటంకాలు లేవని, ముఖ్యంగా పార్లమెంట్‌ ఎదుట నిరసన తెలపడం ఓ హక్కని ఆయన అన్నారు. ఉదాహరణకు యూకే, నార్వే, స్వీడన్‌లలో పార్లమెంట్‌ ఎదుట ఆందోళన తెలపడం ఓ హక్కుగా ఉందని చెప్పారు. శనివారం ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో వాంగ్‌చుక్‌ ప్రసంగించారు. ‘మనం దేశంలో మాత్రం పరిస్థితులు వేరుగా ఉన్నాయి. పార్లమెంట్‌ ఎదుట కూడా కాదు, కనీసం జంతర్‌మంతర్‌ వద్ద నిరసన తెలుపుదామన్నా అనుమతివ్వడం లేదు’అని ఆయన వ్యాఖ్యానించారు.

ఉత్సవాలకే అనుమతులు
వాస్తవానికి నిరసనలు తెలపడానికి అధికారుల నుంచి ఎటువంటి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. నగరంలో జరిగే ఉత్సవాలు వంటి ఇతర కార్యక్రమాలను పర్యవేక్షించడానికి మాత్రమే అనుమతులు ఉండాలి’ అని వాంగ్‌చుక్‌ అన్నా రు. నిరసన రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన హక్కు కాబట్టి, రహదారులపై శాంతియుత నిరసన తెలపడమే సరైన మార్గమని వాంగ్‌చుక్‌ స్పష్టం చేశారు. నిరసనకారుల అరెస్టులపై ఆయన.. ‘సందేశం ఇచ్చిన వారిని చంపకండి, సందేశాన్ని స్వీకరించండి’అని ఆయన వ్యాఖ్యానించారు. ‘చేయకూడని పనులు చేస్తే, ప్రజలు మీకు వ్యతిరేకంగా మారుతారు. దీనివల్ల నష్టం. ఏది సరైనదో అది మాత్రమే చేయండి’అని వాంగ్‌చుక్‌ ప్రభుత్వానికి హితవు పలికారు.

సరిహద్దుల భద్రతపై దృష్టి పెట్టాలి
దేశ భద్రతపై కేంద్ర ప్రభుత్వం మరింతగా దృష్టి సారించాలన్నారు. ‘సరిహద్దుల్లో ఉండాల్సిన పారామిలటరీ బలగాలు అంతర్గత భద్రతకు ఉపయోగించడం మంచిది కాదు. ఇదే అదనుగా లద్దాఖ్‌లో చైనా అంగుళంఅంగుళం చొప్పున ముందుకు చొచ్చుకువస్తోంది. అంతర్గత విధుల నుంచి తిరిగి సరిహద్దుల్లోకి తరలించే సరికే చైనా మిలటరీ తిష్టవేసుకుని ఉంటోంది. వారిని వెనక్కి తరమడం చాలా కష్టం. అందుకే, పారా మిలటరీ జవాన్లను సరిహద్దుల్లోనే మోహరించి ఉంచాలి’అని ఆయన సూచించారు. అదేవిధంగా, పారా మిలటరీ బలగాలను హోం శాఖకు బదులుగా రక్షణ శాఖ నియంత్రణలోనే ఉంచడం మంచిదని చెప్పారు. ప్రజల నిరసనలు, పౌరులే హోం శాఖ లక్ష్యమైతే, సరిహద్దుల పూర్తి బాధ్యతను రక్షణ శాఖకు అప్పగించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement