విమాన చార్జీలను నియంత్రిస్తాం | Centre to publish new aviation rules curbing volatile airfares | Sakshi
Sakshi News home page

విమాన చార్జీలను నియంత్రిస్తాం

Oct 17 2026 6:10 AM | Updated on Oct 17 2026 6:34 AM

Centre to publish new aviation rules curbing volatile airfares

రెండు వారాల్లోగా నిబంధనలను వెల్లడిస్తాం 

సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం 

నవంబర్‌ 16కల్లా అందించాలన్న అత్యున్నత న్యాయస్థానం

సాక్షి, న్యూఢిల్లీ: పండుగ సీజన్లు, సెలవులు, రద్దీ సమయాలను ఆసరాగా చేసుకొని ప్రైవేటు విమానయాన సంస్థలు ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్న చార్జీల దోపిడీకి త్వరలో చెక్‌ పడనుంది. ప్రయాణ చార్జీలను నియంత్రించేందుకు ఉద్దేశించిన కొత్త నిబంధనల రూపకల్పన తుది దశకు చేరుకుంది. వీటికి ఇప్పటికే పాలనాపరమైన ఆమోదం లభించిందని, రెండు వారాల్లో అధికారికంగా నోటిఫికేషన్‌ ద్వారా వెలువరిస్తామని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ నిబంధనల కాపీని తదుపరి విచారణ తేదీ అయిన నవంబర్‌ 16 నాటికి తమ ముందు ఉంచాలని అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

ధర్మాసనం ముందు కేంద్రం నివేదన..  
ప్రైవేటు విమానయాన సంస్థలు అల్గారిథం ఆధారిత డైనమిక్‌ ప్రైసింగ్‌ విధానంతో విమాన చార్జీలను విపరీతంగా పెంచేస్తూ ప్రయాణికులను దోచుకుంటున్నాయని ఆరోపిస్తూ ఎస్‌.లక్ష్మినారాయణన్‌ వేసిన పిల్‌పై జస్టిస్‌ విక్రమ్‌ నాథ్, జస్టిస్‌ ఆర్‌.మహదేవన్, జస్టిస్‌ అపరేష్‌ సింగ్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. చార్జీల నియంత్రణ నిబంధనలు ఖరారయ్యాయని విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా తెలిపారు. ఈ నిబంధనలు ప్రచురించేందుకు పాలనాపరమైన ఆమోదం కూడా పూర్తయిందని వెల్లడించారు. ఈ వాదనలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం తదుపరి విచారణను నవంబర్‌ 16కు వాయిదా వేస్తూ, అప్పటికల్లా ప్రచురితమైన ఆ కొత్త నిబంధనలను తమ ముందు ఉంచాలని ఆదేశించింది. 

పండుగ వేళ ఆగని దోపిడీ 
ప్రభుత్వం నిబంధనల రూపకల్పనలో చేస్తున్న జాప్యాన్ని పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది రవీంద్ర శ్రీవాస్తవ, అడ్వకేట్‌ ఆన్‌ రికార్డ్‌ చారు మాథుర్‌ తీవ్రంగా తప్పుపట్టారు. దీపావళి పండుగ సమీపిస్తున్న వేళ విమాన చార్జీలు మళ్లీ ఆకాశాన్ని అంటున్నాయని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. టికెట్ల ధరల ఆకస్మిక, ఊహించని పెంపుతో పాటు, ఉచిత చెక్‌–ఇన్‌ బ్యాగేజ్‌ పరిమితిని 25 కిలోల నుంచి 15 కిలోలకు తగ్గించడం లాంటి అంశాలను వారు ప్రస్తావించారు. ప్రయాణికులపై మోపుతున్న ఈ అదనపు భారాన్ని నివారించి, పారదర్శకమైన విధానం అమలు చేసేలా రెగ్యులేటరీ సంస్థలు తక్షణమే జోక్యం చేసుకునేలా ఆదేశాలివ్వాలని కోరారు.

గతంలో సీల్డ్‌ కవర్‌ తిరస్కరణ 
మహా కుంభమేళా, ఇతర పండుగల సమయంలో ప్రైవేట్‌ సంస్థలు విమాన చార్జీలను అమాంతం పెంచేయడంపై గత విచారణల సమయంలో సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాల మేరకు ఆగస్టు 17న కేంద్రం కొత్త నిబంధనలకు సంబంధించిన ముసాయిదాను సీల్డ్‌ కవర్‌లో సుప్రీంకోర్టుకు సమర్పించింది. అయితే ఆ ముసాయిదాను పరిశీలించిన న్యాయస్థానం దాన్ని తిరిగి ప్రభుత్వానికే అప్పగించింది. ఆ సమయంలో నిబంధనలను పూర్తిగా ఖరారు చేసేందుకు కేంద్రం మూడు వారాల గడువు కోరింది. తాజాగా రాబోయే కొత్త నిబంధనలు.. విమాన చార్జీల ఇష్టారాజ్య పెంపు, సర్జ్‌ ప్రైసింగ్, అదనపు బ్యాగేజీ చార్జీల వసూళ్లు తదితర అంశాలకు అడ్డుకట్ట వేసేలా ఉంటాయని భావిస్తున్నారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement