breaking news
private airlines
-
విమాన చార్జీలను నియంత్రిస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: పండుగ సీజన్లు, సెలవులు, రద్దీ సమయాలను ఆసరాగా చేసుకొని ప్రైవేటు విమానయాన సంస్థలు ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్న చార్జీల దోపిడీకి త్వరలో చెక్ పడనుంది. ప్రయాణ చార్జీలను నియంత్రించేందుకు ఉద్దేశించిన కొత్త నిబంధనల రూపకల్పన తుది దశకు చేరుకుంది. వీటికి ఇప్పటికే పాలనాపరమైన ఆమోదం లభించిందని, రెండు వారాల్లో అధికారికంగా నోటిఫికేషన్ ద్వారా వెలువరిస్తామని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ నిబంధనల కాపీని తదుపరి విచారణ తేదీ అయిన నవంబర్ 16 నాటికి తమ ముందు ఉంచాలని అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ధర్మాసనం ముందు కేంద్రం నివేదన.. ప్రైవేటు విమానయాన సంస్థలు అల్గారిథం ఆధారిత డైనమిక్ ప్రైసింగ్ విధానంతో విమాన చార్జీలను విపరీతంగా పెంచేస్తూ ప్రయాణికులను దోచుకుంటున్నాయని ఆరోపిస్తూ ఎస్.లక్ష్మినారాయణన్ వేసిన పిల్‌పై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ఆర్.మహదేవన్, జస్టిస్ అపరేష్ సింగ్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. చార్జీల నియంత్రణ నిబంధనలు ఖరారయ్యాయని విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. ఈ నిబంధనలు ప్రచురించేందుకు పాలనాపరమైన ఆమోదం కూడా పూర్తయిందని వెల్లడించారు. ఈ వాదనలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం తదుపరి విచారణను నవంబర్ 16కు వాయిదా వేస్తూ, అప్పటికల్లా ప్రచురితమైన ఆ కొత్త నిబంధనలను తమ ముందు ఉంచాలని ఆదేశించింది. పండుగ వేళ ఆగని దోపిడీ ప్రభుత్వం నిబంధనల రూపకల్పనలో చేస్తున్న జాప్యాన్ని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది రవీంద్ర శ్రీవాస్తవ, అడ్వకేట్ ఆన్ రికార్డ్ చారు మాథుర్ తీవ్రంగా తప్పుపట్టారు. దీపావళి పండుగ సమీపిస్తున్న వేళ విమాన చార్జీలు మళ్లీ ఆకాశాన్ని అంటున్నాయని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. టికెట్ల ధరల ఆకస్మిక, ఊహించని పెంపుతో పాటు, ఉచిత చెక్–ఇన్ బ్యాగేజ్ పరిమితిని 25 కిలోల నుంచి 15 కిలోలకు తగ్గించడం లాంటి అంశాలను వారు ప్రస్తావించారు. ప్రయాణికులపై మోపుతున్న ఈ అదనపు భారాన్ని నివారించి, పారదర్శకమైన విధానం అమలు చేసేలా రెగ్యులేటరీ సంస్థలు తక్షణమే జోక్యం చేసుకునేలా ఆదేశాలివ్వాలని కోరారు.గతంలో సీల్డ్ కవర్ తిరస్కరణ మహా కుంభమేళా, ఇతర పండుగల సమయంలో ప్రైవేట్ సంస్థలు విమాన చార్జీలను అమాంతం పెంచేయడంపై గత విచారణల సమయంలో సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాల మేరకు ఆగస్టు 17న కేంద్రం కొత్త నిబంధనలకు సంబంధించిన ముసాయిదాను సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకు సమర్పించింది. అయితే ఆ ముసాయిదాను పరిశీలించిన న్యాయస్థానం దాన్ని తిరిగి ప్రభుత్వానికే అప్పగించింది. ఆ సమయంలో నిబంధనలను పూర్తిగా ఖరారు చేసేందుకు కేంద్రం మూడు వారాల గడువు కోరింది. తాజాగా రాబోయే కొత్త నిబంధనలు.. విమాన చార్జీల ఇష్టారాజ్య పెంపు, సర్జ్ ప్రైసింగ్, అదనపు బ్యాగేజీ చార్జీల వసూళ్లు తదితర అంశాలకు అడ్డుకట్ట వేసేలా ఉంటాయని భావిస్తున్నారు. -
విమాన చార్జీల అడ్డ్డగోలు పెంపు
న్యూఢిల్లీ: దేశంలో ప్రైవేట్ విమానయాన సంస్థలు ఆకస్మికంగా ప్రయాణ ఛార్జీలను, ఇతర రుసుములను పెంచకుండా నిబంధనలు పాటించేలా చూడాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసు జారీ చేసింది. సామాజిక కార్యకర్త ఎస్.లక్ష్మీనారాయణన్ వేసిన పిటిషన్‌పై సోమవారం జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎకానమీ తరగతి ప్రయాణికులకు 25 కిలోల వరకు లగేజీ ఉచిత సౌకర్యం ఉండగా, దానిని ప్రైవేట్ విమానయాన సంస్థలు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా దీనిని 15 కిలోలకు తగ్గించాయని పేర్కొన్నారు.అదేవిధంగా, విమాన ప్రయాణ చార్జీలు, అనుబంధ ఫీజులను నియంత్రించే వ్యవస్థంటూ ఏదీ లేకుండా పోయిందన్నారు. ఇదే అదనుగా విమాన యాన సంస్థలు ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచుతు న్నాయని, ముఖ్యంగా పండగలు, అననుకూల వాతావరణ పరిస్థితుల్లో మరీ హద్దుమీరు తున్నాయన్నారు. పౌర విమానయాన రంగంలో ప్రయాణికులకు భద్రతతోపాటు పారదర్శకత ఉండేలా సమర్థమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. స్పందించిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి, డీజీసీఏకి, ఎయిర్‌పోర్టు నియంత్రణ ప్రాథికార సంస్థకు నోటీసులు జారీ చేసి..తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. -
ప్రైవేటు విమానాల్లో కూడా..
శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ మీద నిషేధాన్ని ఎయిరిండియా ఎత్తేయడంతో.. ప్రైవేటు విమానయాన సంస్థలు సైతం అదే బాటలో నడిచాయి. కావాలనుకుంటే తమ విమానాల్లో కూడా గైక్వాడ్ ప్రయాణం చేయొచ్చని తెలిపాయి. ఎంపీ చేసిన ప్రకటనతో సంతృప్తి చెందిన తర్వాత ఎయిర్ ఇండియా సంస్థ ఆయనను అనుమతించాలని నిర్ణయించడంతో, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్‌లైన్స్‌లో సభ్యత్వం ఉన్న విమానయాన సంస్థలు అన్నీ గైక్వాడ్‌ను తమ విమానాల్లో అనుమతించాలని నిర్ణయించినట్లు ఎఫ్ఐఏ డైరెక్టర్ ఉజ్వల్ డే తెలిపారు. అయితే, ఇదే సందర్భంలో తమ సిబ్బంది, ఆస్తులకు తగిన రక్షణ ఇవ్వాలని, వాళ్లు ప్రతిరోజూ ఎంతగానో కష్టపడుతున్నందున ఆ కష్టానికి తగిన గౌరవం ఇవ్వాలని.. ఆ మేరకు హామీ వచ్చిన తర్వాతే ఆయనకు విమాన ప్రయాణం చేసే అవకాశం ఇస్తున్నామని డే చెప్పారు. ఇండిగో, స్పైస్ జెట్, గోఎయిర్, టాటా గ్రూపు ఎయిర్‌లైన్స్, విస్తారా, ఎయిర్ఏషియా ఇండియా తదితర సంస్థలకు ఎఫ్ఐఏలో సభ్యత్వం ఉంది. ఇవన్నీ కూడా మార్చి 24వ తేదీ నుంచి గైక్వాడ్‌ను తమ విమానాల్లో ఎక్కించుకునేది లేదంటూ నిషేధం విధించాయి. ఢిల్లీ విమానాశ్రయంలో దాదాపు 60 ఏళ్ల వయసున్న ఎయిరిండియా అధికారి ఒకరిని గైక్వాడ్ చెప్పుతో కొట్టి విమానం మెట్ల మీద నుంచి కిందకు తోసేందుకు ప్రయత్పినంచడంతో విమానయాన సంస్థలన్నీ ఆయనను నిషేధించాయి. ఆ తర్వాతి నుంచి ఎయిరిండియా సహా పలు సంస్థల విమానాలు ఎక్కడానికి గైక్వాడ్పలు రకాలుగా ప్రయత్నించారు గానీ, ప్రతిసారీ ఆయన టికెట్లు రద్దవుతూనే వచ్చాయి. రెండు వారాల పాటు నిషేధం విధించిన తర్వాత ప్రభుత్వ సూచన మేరకు ఆ నిషేధాన్ని ఎత్తేశాయి. రవీంద్ర గైక్వాడ్ క్షమాపణలు తెలిపారని, ఆయన ఇక మీదట సత్ప్రవర్తన కలిగి ఉంటానని హామీ కూడా ఇచ్చారని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా సిబ్బందితోను, ఇతర ప్రయాణికులతోను అగౌరవంగా ప్రవర్తించే వ్యక్తులతో కూడిన ఒక ‘నో ఫ్లై జాబితా’ను సిద్ధం చేయాలని విమానయాన మంత్రిత్వశాఖ భావిస్తోంది. ఈ మేరకు వచ్చేవారం ఒక ముసాయిదా సిద్ధం చేసి ప్రజల నుంచి కూడా దానిపై స్పందనలు తీసుకుంటారు.


