కేంద్రం స్పందన కోరిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: దేశంలో ప్రైవేట్ విమానయాన సంస్థలు ఆకస్మికంగా ప్రయాణ ఛార్జీలను, ఇతర రుసుములను పెంచకుండా నిబంధనలు పాటించేలా చూడాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసు జారీ చేసింది. సామాజిక కార్యకర్త ఎస్.లక్ష్మీనారాయణన్ వేసిన పిటిషన్‌పై సోమవారం జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎకానమీ తరగతి ప్రయాణికులకు 25 కిలోల వరకు లగేజీ ఉచిత సౌకర్యం ఉండగా, దానిని ప్రైవేట్ విమానయాన సంస్థలు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా దీనిని 15 కిలోలకు తగ్గించాయని పేర్కొన్నారు.
అదేవిధంగా, విమాన ప్రయాణ చార్జీలు, అనుబంధ ఫీజులను నియంత్రించే వ్యవస్థంటూ ఏదీ లేకుండా పోయిందన్నారు. ఇదే అదనుగా విమాన యాన సంస్థలు ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచుతు న్నాయని, ముఖ్యంగా పండగలు, అననుకూల వాతావరణ పరిస్థితుల్లో మరీ హద్దుమీరు తున్నాయన్నారు. పౌర విమానయాన రంగంలో ప్రయాణికులకు భద్రతతోపాటు పారదర్శకత ఉండేలా సమర్థమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. స్పందించిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి, డీజీసీఏకి, ఎయిర్‌పోర్టు నియంత్రణ ప్రాథికార సంస్థకు నోటీసులు జారీ చేసి..తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.


