ఉన్నావ్: ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వుపై సుప్రీంకోర్టు స్టే విధించడంతో ఉన్నావ్ కేసు బాధితురాలు సోమవారం సంతృప్తి వ్యక్తంచేశారు. సెంగార్‌ను ఉరితీసే దాకా విశ్రమించే ప్రసక్తే లేదని బాధితురాలు తేల్చిచెప్పారు. సుప్రీంకోర్టు నుంచి న్యాయం జరిగినట్లు భావిస్తున్నానని చెప్పారు. తనపై అత్యాచారం జరిగినప్పటి నుంచి న్యాయం కోసం గొంతు వినిపిస్తున్నానని పేర్కొన్నారు. ఏ కోర్టుపైనా తాను ఆరోపణలు చేయడం లేదని, అన్ని కోర్టులపై సంపూర్ణ విశ్వాసం ఉందని తెలిపారు. న్యాయం జరిగేదాకా పోరాడుతూనే ఉంటానని స్పష్టంచేశారు. సెంగార్‌ను ఉరి తీస్తేనే పూర్తిగా న్యాయం జరిగినట్లు అవుతుందన్నారు.
తమకు ఇప్పటికీ బెదిరింపులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. న్యాయ వ్యవస్థపై నమ్మకం బలపడిందని బాధితురాలి సోదరి చెప్పారు. సెంగార్ ఒక క్రూర జంతువు అని మండిపడ్డారు. తొలుత తన సోదరిని, తర్వాత తమ కుటుంబాన్ని నాశనం చేశాడని ధ్వజమెత్తారు. అతడికి ఇచ్చిన బెయిల్‌ను సుప్రీంకోర్టు నిలిపివేయడం సంతోషం కలిగిస్తోందన్నారు. ఈ కేసులో పోరాటం ఆపబోమని తేల్చిచెప్పారు. మరోవైపు బాధితురాలి తల్లి సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలియజేశారు. తన బిడ్డపై అత్యాచారం చేసి, తన భర్తను చంపిన నేరగాడికి మరణ శిక్ష పడాల్సిందేనని అన్నారు. సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలపై సామాజిక కార్యకర్త యోగితా స్పందించారు. ఇది కేవలం ఉన్నావ్ బాధితురాలి పోరాటం కాదని.. మహిళలందరి పోరాటమని ఉద్ఘాటించారు. ఇది చాలా భిన్నమైన కేసు కాబట్టి హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధిస్తున్నట్లు సుప్రీంకోర్టు చెప్పిందని అన్నారు.


