ప్రభుత్వమిచ్చే పరిహారం కాదు: సుప్రీం
న్యూఢిల్లీ: ఓ జవానుకు అందజేయాల్సిన వైకల్య పింఛనును ప్రభుత్వం నిలిపివేయడంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. వైకల్య (డిజెబిలిటీ పెన్షన్) పింఛను ప్రభుత్వం దయాదాక్షిణ్యాలపై ఆధారపడింది కాదని స్పష్టం చేసింది. అది రాజ్యాంగబద్ధమైన హక్కని ప్రకటించింది. పింఛను అందజేయడంలో వివక్ష చూపడం లేదా తగ్గించడం వంటి చర్యలు సరికాదని తలంటింది.
ఓ మాజీ సైనికోద్యోగికి వైకల్య పింఛను అందించాల్సిందేనంటూ సాయుధ బలగాల ట్రిబ్యునల్ ఇచి్చన ఆదేశాలను సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాధేల ధర్మాసనం గురువారం కొట్టివేసింది. వైకల్య పింఛను ప్రభుత్వమిచ్చే దానం కాదు, అది దేశ సేవలో చేసిన త్యాగానికి దక్కిన గుర్తింపని తెలిపింది. ‘పింఛను ప్రభుత్వం ఇచ్చే పారితోషికం కూడా కాదు. గత సేవలకు ప్రతిఫలంగా చెల్లించే వాయిదా వేసిన వేతనం.
నిర్ణీత నిబంధనలు పూర్తి చేసిన తర్వాత, అది ఒక స్థిరమైన, చట్టపరంగా అమలు చేయదగిన హక్కుగా మారుతుంది. పింఛను ప్రయోజనాలు ఆస్తి హక్కు వంటివి. చట్టపరమైన అధికారం లేకుండా వీటిని ఆపేయడం, తగ్గించడం, రద్దు చేయడం సాధ్యం కాదు’అని ధర్మాసనం పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ఒక ఆదర్శవంతమైన యజమానిగా ఉండాలని, దేశం కోసం పనిచేసిన వారికి ప్రయోజనాలు అందించే విషయంలో నిష్పక్షపాతంతో, సమానత్వంతో వ్యవహరించాలని ఉద్బోధించింది.
ఒక ప్రయోజనాన్ని విధానం ద్వారా గుర్తించి, న్యాయస్థానం ధ్రువీకరించినప్పుడు, అమలు విషయంలో వివక్ష చూపరాదని పేర్కొంది. న్యాయపరమైన తీర్పులు, ప్రభుత్వ నిర్ణయాల ద్వారా మాజీ సైనికులకు చెందాల్సిన పింఛనును నిరాకరించడమంటే ఆస్తిని లాక్కోవడమే అవుతుందని తెలిపింది. ఇది రాజ్యాంగంలోని ఆరి్టకల్ 300ఏని ఉల్లంఘించడమేనని ధర్మాసనం స్పష్టం చేసింది. వైకల్య పింఛను హక్కు చాలా విలువైంది, ఒకసారి అది అర్హమైనదిగా తేలితే, బకాయిలు సహా చెల్లించాల్సిందేనని ఆదేశించింది.


