సమ్మెలో కదంతొక్కిన 30 కోట్ల మంది కార్మికులు
కార్మిక సంఘాల ఐక్య వేదిక ప్రకటన
న్యూఢిల్లీ: కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా కార్మికసంఘాలు గురువారం సమ్మె చేపట్టాయి. కార్మికులు, రైతులు, పలు రంగాల శ్రామికు లు కలిపి దేశవ్యాప్తంగా మొత్తంగా 30 కోట్ల మంది సమ్మెలో పాల్గొన్నారని కార్మిక సంఘాలు ప్రకటించాయి. అయితే సమ్మె ప్రభా వం దేశవ్యాప్తంగా పాక్షికంగానే కన్పించింది.
దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ప్రజా రవాణా, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాల రోజువారీ కార్యకలాపాలు యతాథతంగా కొనసాగాయి. కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే వేలాది మంది కార్మికుల భారీ నిరసన ప్రదర్శనలతో జనజీవనం కాస్తంత స్తంభించింది. ఒడిశా, కేరళ, తమిళనాడు, గోవా, జార్ఖండ్, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, హరియాణా, పంజాబ్ రాష్ట్రాల్లో సమ్మె ప్రభావం అత్యధికంగా కన్పించింది. చాలా రాష్టాల్లో కార్మిక సంఘాలు ఆయా పని ప్రాంతాలు, ఫ్యాక్టరీలు, కర్మాగారాల ప్రధాన ద్వారాల వద్ద ధర్నాకు దిగి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించాయి.
అత్యంత వివాదాస్పద నాలుగు లేబర్ కోడ్‌లను ఉపసంహరించుకోవాలని కార్మికసంఘాలు డిమాండ్‌చేశాయి. ముసాయిదా విత్తన బిల్లు, విద్యుత్ సవరణ బిల్లు, సస్టేనబుల్ హార్నెసింగ్, అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్‌ఫార్మింగ్ ఇండియా(శాంతి) చట్టాలను ఉపసంహరించుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్‌చేశాయి. వీబీ జీ రాంజీ చట్టాన్ని పక్కనబెట్టి వెంటనే పాత ఎంజీనరేగా చట్టాన్ని యథాతథంగా పునరుద్ధరించాలని కోరాయి. సమ్మె కు సంఘీభావంగా పెద్ద సంఖ్యలో కార్మికులు, ఉద్యోగులు తమ కార్యాలయాలు, కర్మాగారాలకు ఆలస్యంగా హాజరయ్యారు.
దేశవ్యాప్తంగా 600కుపైగా జిల్లాల్లో సమ్మె విజయవంతమైందని కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు, అసోసియేషన్లతోపాటు సంయుక్త కిసాన్ మోర్చాలు, వ్యవసాయ కార్మికుల సంఘాల సంయుక్త వేదిక గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్‌ఎంఎస్, సీఐటీయూ, ఏఐయూటీయూసీ, ఎస్ ఈడబ్ల్యూఏ, ఏఐసీసీటీయూ, ఎల్‌పీఎఫ్, యూటీయూసీ సంఘాలు ఈ సంయుక్త ఫో రమ్‌లో భాగస్వాములుగా ఉన్నాయి. ఢిల్లీ లో అన్ని పారిశ్రామిక వాడల నుంచి పలు కార్మిక సంఘాల కార్యకర్తలు నిరసన ప్రదర్శనలను చేపట్టారు.
జంతర్‌మంతర్ వద్ద సమావేశం నిర్వహించి కార్మిక వ్యతిరేక విధానాలను కార్మిక ముఖ్యనేతలు తూర్పారబట్టారు. తమ రాష్ట్రంలో బ్యాంకింగ్, బీ మా, బొగ్గు రంగంలో కార్యకలాపాలు పూర్తి గా స్తంభించిపోయాయని జార్ఖండ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీఓఐ) ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర డెప్యూటీ జనరల్ సెక్రటరీ ఉమేశ్ దాస్ ప్రకటించారు. కేరళలో కేఎస్‌ఆర్‌టీసీ బస్సులు డిపోలకు పరిమితమయ్యాయి. ప్రైవేట్ బస్సులూ రోడ్డెక్కకపోవడంతో జనం తీవ్ర అవస్థలు పడ్డారు. బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్‌లో మాత్రం జనజీవనానికి ఎలాంటా ఆటంకం కలగలేదు.


