డమాస్కస్: అల్-ఖైదా అనుబంధ నేతపై అమెరికా తన భీకర పంజా పంజా విసిరింది. ఇటీవల ఇద్దరు అమెరికన్ సైనికులు, ఒక పౌరుని మృతికి కారణమైన ఐసిస్ (ఐఎస్‌ఐఎస్)ఉగ్రవాదులతో సంబంధం ఉన్న అల్-ఖైదా నేతను లక్ష్యంగా చేసుకుని అమెరికా బలగాలు విరుచుకుపడ్డాయి. శుక్రవారం సిరియాలో జరిపిన ఈ మెరుపు దాడిలో ఆ ఉగ్ర నేత హతమైనట్లు అధికారులు ధృవీకరించారు.
ఈ ఆపరేషన్‌పై యూఎస్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) కీలక వివరాలను వెల్లడించింది. జనవరి 16న జరిపిన ఈ దాడిలో ‘బిలాల్ హసన్ అల్-జాసిమ్’ అనే కీలక ఉగ్రవాద నేత హతమయ్యాడు. ఇతను ఉగ్ర దాడులకు కుట్రలు పన్నడంలో ఆరితేరినవాడని, 2025, డిసెంబర్ 13న సిరియాలోని పల్మైరాలో సార్జెంట్ ఎడ్గార్ బ్రియాన్ టోర్రెస్ టోవర్, సార్జెంట్ విలియం నథానియల్ హోవార్డ్, ఇంటర్‌ప్రెటర్ అయద్ మన్సూర్ సకత్‌లను బలిగొన్న ఐసిస్ ఉగ్రవాదితో ఇతనికి ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని సెంట్రల్ కమాండ్ పేర్కొంది.
తమ పౌరుల మరణానికి కారణమైన వారిని వదిలిపెట్టేది లేదని అమెరికా సెంట్-కామ్ కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ పేర్కొన్నారు. అమెరికన్ పౌరులు లేదా సైనికులపై దాడులకు ప్లాన్ చేసే వారికి, దాడులు చేసే వారికి ప్రపంచంలో ఎక్కడా సురక్షిత స్థానం ఉండదని, వారిని ఎక్కడున్నా వేటాడుతామని ఆయన హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు చేపట్టిన ‘ఆపరేషన్ హాక్ ఐ స్ట్రైక్’లో భాగంగానే ఈ తాజా దాడి జరిగింది. బషర్ అసద్ పాలన ముగిసిన అనంతరం తిరిగి పుంజుకోవడానికి ప్రయత్నిస్తున్న ఐసిస్ మూకలను అణచివేయడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ కొనసాగుతోంది.
జార్డాన్, సిరియా తదితర భాగస్వామ్య దేశాల సహకారంతో అమెరికా ఇప్పటివరకు 100కు పైగా ఐసిస్ మౌలిక సదుపాయాలు, ఆయుధ కేంద్రాలపై 200కు పైగా ఖచ్చితమైన దాడులు నిర్వహించింది. గత ఏడాది కాలంలో సిరియా వ్యాప్తంగా 300 మందికి పైగా ఐసిస్ కార్యకర్తలను బంధించామని, ప్రాంతీయ భద్రతకు ముప్పుగా ఉన్న 20 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చామని సెంట్-కామ్ వెల్లడించింది.
ఇది కూడా చదవండి: మిషన్ డాల్ఫిన్: నదీ గర్భంలో భారీ ‘ఆపరేషన్’


