దేశంలోని పలు జీవనదుల గర్భంలో దాగిన రహస్యాలను వెలికితీసేందుకు కేంద్రం భారీ ఆపరేషన్‌కు శ్రీకారం చుట్టింది. గంగమ్మ ఒడిలో ఆటలాడే డాల్ఫిన్ల సంఖ్యను కచ్చితంగా తేల్చేందుకు.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, హైటెక్ బోట్లతో పరిశోధక బృందాలు రంగంలోకి దిగాయి. కేవలం డాల్ఫిన్ల గణాంకాలే కాదు, నదీ పర్యావరణ వ్యవస్థ భవితవ్యాన్ని నిర్ణయించే ఈ ప్రతిష్టాత్మక ‘మిషన్ డాల్ఫిన్ 2.0’ అసలు లక్ష్యం ఏమిటంటే...
పర్యావరణ వ్యవస్థపై దృష్టి
డాల్ఫిన్ల సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా నీటి అడుగున శబ్దాలను సైతం పసిగట్టి, డాల్ఫిన్ల లెక్కలు వెలికి తీసేందుకు రెండో విడత దేశవ్యాప్త సర్వేను ప్రారంభించింది. ఇటు బిజినోర్ నుంచి అటు సుందర్బన్స్ వరకు సాగే ఈ భారీ అన్వేషణలో బయటపడనున్న వాస్తవాలపై ఎంతో ఆసక్తి నెలకొంది. గంగా, సింధు, బ్రహ్మపుత్ర తదితర ప్రధాన నదులలో డాల్ఫిన్ల జాడ కోసం పరిశోధకులు వేట మొదలుపెట్టారు. కేవలం డాల్ఫిన్ల గణాంకాలకే పరిమితం కాకుండా, నదీ పర్యావరణ వ్యవస్థను కాపాడటమే లక్ష్యంగా ఈ సర్వే మొదలైంది.
నీటి అడుగున వినిపించే శబ్ధాలతో..
ఈసారి సర్వే కేవలం పైకి కనిపించే డాల్ఫిన్లను లెక్కించడం మాత్రమే కాదు. 26 మంది నిపుణులైన పరిశోధకుల బృందం మూడు పడవల్లో నదీ జలాల్లోకి ప్రవేశించింది. వీరు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా నీటి అడుగున శబ్దాలను పసిగట్టే ‘హైడ్రోఫోన్స్’ (Hydrophones) ద్వారా డాల్ఫిన్ల కదలికలను రికార్డు చేస్తున్నారు. డాల్ఫిన్లు చేసే శబ్దాల ఆధారంగా వాటి ఉనికిని, సంఖ్యను అంచనా వేయడం ఈ సర్వే ప్రత్యేకత.
బిజినోర్ టూ గంగా సాగర్
ఈ బృహత్తర కార్యక్రమాన్ని రెండు దశల్లో నిర్వహిస్తున్నారు. మొదటి దశలో గంగా నది ప్రధాన ప్రవాహమైన ఉత్తరప్రదేశ్‌లోని బిజినోర్ నుంచి పశ్చిమ బెంగాల్‌లోని గంగా సాగర్ వరకు జల్లెడ పట్టనున్నారు. అలాగే సింధు నది పరీవాహక ప్రాంతాల్లోనూ సర్వే కొనసాగనున్నది. దేశంలోని అతి పొడవైన నదీ తీరాల్లో సాగే ఈ అన్వేషణ డాల్ఫిన్ల ఆవాసాలపై స్పష్టమైన వివరాలను అందించనుంది.
కొత్తగా ‘ఇరావాడి’ జాడ కోసం..
రెండో దశ సర్వేలో బ్రహ్మపుత్ర నది, గంగా ఉపనదులు, సుందర్బన్స్, ఒడిశా ప్రాంతాలను కవర్ చేయనున్నారు. ఇక్కడ గమనించదగిన విషయం ఏమిటంటే, ఈసారి కేవలం గంగా, సింధు నదులలోని డాల్ఫిన్లనే కాకుండా.. అరుదైన ‘ఇరావాడి డాల్ఫిన్ల’ (Irrawaddy dolphins) లెక్కలను వెలికి తీయడానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. సుందర్బన్స్, ఒడిశా ప్రాంతాల్లో వీటి సంరక్షణకు చేపట్టాల్సిన చర్యలకు ఈ డేటా కీలకం కానుంది.
దేశంలో ఎన్ని డాల్ఫిన్లు..
గతంలో అంటే 2021-2023 మధ్య జరిగిన తొలి సర్వేలో వెల్లడైన డాల్ఫిన్ల గణాంకాలను పరిశీలిస్తే భారతదేశంలో దాదాపు 6,327 నదీ డాల్ఫిన్లు ఉన్నట్లు తేలింది. వీటిలో గంగా, యమున, చంబల్, ఘాఘ్రా, కోసి, బ్రహ్మపుత్ర నదుల్లో గంగా డాల్ఫిన్లు అధికంగా ఉన్నాయి. బియాస్ నదిలో సింధు డాల్ఫిన్లు తక్కువ సంఖ్యాలో ఉన్నాయి. దేశం మొత్తం మీద ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలే డాల్ఫిన్లకు ప్రధాన ఆవాసాలుగా ఉన్నట్లు గత రికార్డులు చెబుతున్నాయి.
రంగంలోకి వైల్డ్ లైఫ్ నిపుణులు
ఈసారి చేపట్టిన భారీ ఆపరేషన్‌ను డెహ్రాడూన్‌లోని వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ)సమన్వయం చేస్తోంది. ఈ సంస్థకు అండగా ఆయా రాష్ట్రాల అటవీ శాఖలు, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇండియా, వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా తదితర స్వచ్ఛంద సంస్థలు నిలిచాయి. సర్వేను పకడ్బందీగా నిర్వహించేందుకు అటవీ శాఖ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌లోని బిజినోర్‌లో 13 జిల్లాల సిబ్బందికి వర్క్‌షాప్ నిర్వహించారు.
అభయారణ్యంలో నౌకల గండం
ఇదిలా ఉండగా బీహార్‌లోని విక్రమశిల గంగా డాల్ఫిన్ అభయారణ్యం పరిధిలో జల రవాణా వ్యవహారం ఆందోళన కలిగిస్తోంది. నేషనల్ వాటర్ వేస్-1లో భాగంగా సుల్తాన్‌గంజ్-కహల్‌గావ్ మార్గంలో నౌకల రాకపోకల కోసం పూడికతీత (Dredging) పనులకు జాతీయ వన్యప్రాణి బోర్డు ఆమోదం తెలిపింది. అయితే ఈ ప్రాంతం అంతరించిపోతున్న షెడ్యూల్-1 జాతి డాల్ఫిన్లకు అత్యంత కీలకమైన ఆవాసం కావడం గమనార్హం.
డాల్ఫిన్ల రక్షణే ధ్యేయంగా..
అభివృద్ధి పనుల కారణంగా మూగజీవాలకు ముప్పు వాటిల్లకూడదని వన్యప్రాణి బోర్డు కఠిన ఆంక్షలు విధించింది. పూడికతీత ఎక్కడ, ఎలా, ఎంత లోతు వరకు చేయాలనే దానిపై స్పష్టమైన మ్యాప్, ప్లాన్‌ను ముందుగానే బీహార్ అటవీ శాఖకు సమర్పించాలని ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీని ఆదేశించింది. డాల్ఫిన్ల ఆవాసాలకు భంగం కలగకుండానే ఈ పనులు జరగాలని స్పష్టం చేసింది. ఈ సర్వే ద్వారా లభించే శాస్త్రీయ డేటా భవిష్యత్తులో డాల్ఫిన్ల సంరక్షణ విధానాలకు ఉపయుక్తం కానుంది.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్ ఘోర పరాభవం వెనుక..


