వాడుతున్న ఫోన్ నుంచి వినియోగిస్తున్న మరుగుదొడ్డి వరకూ వివరాల సేకరణ
జనాభా గణనలో సేకరించాల్సిన 33 ప్రశ్నలను విడుదల చేసిన కేంద్రం
2027 జనగణనకు రూట్ మ్యాప్ సిద్ధం
సాక్షి, అమరావతి: జనగణనకు కేంద్రం సన్నద్ధమవుతోంది. ఈ సారి కుటుంబ వివరాలతో పాటు నివాసం, జీవన స్థితిగతులు, కులం వంటి సమగ్ర వివరాలు సేకరించనున్నారు. 2027లో ప్రారంభం కానున్న జనాభా లెక్కల్లో ఎన్యూమరేటర్ సేకరించాల్సిన 33 అంశాలను కేంద్రం తాజాగా విడుదల చేసింది.
2011లో దేశ జనాభా గణన చేపట్టారు. 2021లో ప్రారంభం కావాల్సిన జనాభా లెక్కలు కరోనా వంటి కారణాలతో వాయిదా పడ్డాయి. ఎట్టకేలకు 2027లో జనగణన చేపట్టడానికి కేంద్రం సిద్ధమైంది. ఈ సారి ప్రతీ ఇంటికి 20 నిమిషాల నుంచి అరగంటకు పైగా సమయం వెచ్చించాల్సి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
సెల్ ఫోన్ టు మరుగుదొడ్డి వరకూ..
ఈ సారి సర్వేలో ప్రతి కుటుంబం పూర్తి వివరాలు సేకరించనున్నారు. వాడుతున్న సెల్ ఫోన్ నుంచి మరుగుదొడ్డి .. నివసిస్తున్న ఇల్లు, ఇంట్లో సౌకర్యాలు, వాహనాలు వంటి సమస్త వివరాలు సేకరిస్తారు. ఆఖరికి ఇంటి గోడ దేనితో నిరి్మంచారు, పైకప్పు ఏంటి... ఫ్లోరింగ్ ఏ విధంగా ఉంది, ఎన్ని ల్యాప్‌ట్యాప్‌లు.. ఎన్ని స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి.. ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా, ఎలాంటి మరుగుదొడ్లు వినియోగిస్తున్నారో కూడా సేకరించనున్నారు.
కులం, ఆదాయ మార్గాలు, ఎంతమంది నివసిస్తున్నారు..సొంతిల్లా.. అద్దె ఇల్లా వంటి 33 రకాల వివరాలు సేకరిస్తారు. ఈ వివరాలన్నీ కేవలం జనాభా లెక్కల కోసమేనని కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది.


