న్యూఢిల్లీ: పశ్చిమ ఆసియాలో రగులుతున్న యుద్ధ జ్వాలల నడుమ భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం మరింతగా ముదురుతుండటంతో కీలక చమురు రవాణా మార్గాలను కాపాడుకునేందుకు భారత నౌకాదళం రంగంలోకి దిగింది. గల్ఫ్ ఆఫ్ ఒమన్‌కు మరిన్ని యుద్ధనౌకలను తరలిస్తోంది.
ఏడుకు చేరిన యుద్ధ నౌకలు
పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల వల్ల ప్రపంచ దేశాలకు 20 శాతం ముడి చమురు సరఫరా చేసే హార్మూజ్ జలసంధి ప్రస్తుతం మూతపడింది. ఈ క్రమంలో భారత చమురు నౌకలకు ఎటువంటి ముప్పు వాటిల్లకుండా సురక్షితంగా స్వదేశానికి చేర్చేందుకు నౌకాదళం తన యుద్ధ నౌకల మోహరింపును మరింతగా పెంచుతోంది. ప్రస్తుతం అక్కడ మూడు యుద్ధనౌకలు ఉండగా, తాజాగా చేపట్టిన అదనపు మోహరింపుతో ఈ సంఖ్య ఏడుకు చేరనుంది.
నౌకాదళం అభయం
షిప్పింగ్ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం జలసంధికి పశ్చిమ దిశలో సుమారు 22 భారతీయ నౌకలు చిక్కుకుపోయాయి. అయితే భారత నౌకాదళం పహారా నడుమ ఇప్పటికే కొన్ని నౌకలు క్షేమంగా చేరుకున్నాయి. గత వారం ‘శివాలిక్’, ‘నందా దేవి’ అనే రెండు ఎల్‌పీజీ క్యారియర్లు 92,712 మెట్రిక్ టన్నుల గ్యాస్‌తో భారత తీరానికి చేరుకున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని ఫుజైరా పోర్ట్ నుండి బయలుదేరిన ఒక చమురు ట్యాంకర్‌ను కూడా భారత యుద్ధనౌక సురక్షితంగా ఎస్కార్ట్ చేసింది.
ఏమిటీ ‘ఆపరేషన్ సంకల్ప్’?
భారత నౌకాదళం 2019 నుండి ‘ఆపరేషన్ సంకల్ప్’ పేరుతో గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో తన ఉనికిని చాటుతోంది. సముద్ర మార్గంలో భారత వాణిజ్య నౌకలకు రక్షణ కల్పించడమే ఈ ఆపరేషన్ ప్రధాన ఉద్దేశ్యం. ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైనప్పటి నుండి నౌకాదళం తన పహారాను మరింత కఠినతరం చేసింది. దీనికితోడు 2008 నుండి గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌లో కొనసాగుతున్న సముద్రపు దొంగల వ్యతిరేక గస్తీ కూడా నిరంతరాయంగా కొనసాగుతోంది. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో భారత ఇంధన భద్రతకు ఎటువంటి అడ్డంకులు కలగకుండా, నౌకాదళం గల్ఫ్ ప్రాంతంలో నిరంతర నిఘా ఉంచుతోంది.
ఇది కూడా చదవండి: 80 వేల టన్నుల చమురుతో భారత్‌కు ‘జగ్ లాడ్కీ’


