వందేళ్లకుపైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ ఇటీవలి కాలంలో జరిగిన ఎన్నికల్లో వరుస ఓటములను చవిచూస్తోంది. దీనికి నాయకత్వ లేమి ప్రధాన కారణమని కొందరు అంటుండగా, పార్టీలో ఐక్యత లోపించిందని మరికొందరు చెబుతారు. ఇప్పుడు మరోమారు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే అత్యంత దారుణమైన పనితీరును కనబరిచింది. మొత్తం 227 సీట్లకు గాను కేవలం 22 సీట్లకే పరిమితమయ్యింది. దీంతో పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం అలుముకుంది.
సరైన వ్యూహం లేకుండా..
బీఎంసీ ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎటువంటి భారీ ర్యాలీలు, రోడ్‌షోలు గానీ, ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు గానీ నిర్వహించలేదు. కనీస ప్రణాళిక, సరైన వ్యూహం లేకుండానే బరిలోకి దిగినట్లు స్పష్టంగా కనిపించింది. 1885లో ఇదే నగరంలో పుట్టి, దేశాన్ని దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ, నేడు తన ఉనికిని కోల్పోయే పరిస్థితిని ఎదుర్కొంటోంది. ముంబై కాంగ్రెస్ అధ్యక్షురాలు వర్షా గైక్వాడ్ ఈ పరాజయానికి బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆమె నాయకత్వ సామర్థ్యంపై పలు ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి.
అంతకంతకూ దిగజారుతూ..
గత మూడు పర్యాయాల బీఎంసీ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే, ముంబైలో పార్టీ గ్రాఫ్ క్రమంగా పడిపోతూ వస్తోంది. 2007లో 71 సీట్లు గెలుచుకున్న పార్టీ, 2012 నాటికి 51కి, 2017లో 31కి పడిపోయింది. ఒకప్పుడు 26 శాతానికి పైగా ఉన్న ఓటు బ్యాంకు, నేడు సింగిల్ డిజిట్‌కు పడిపోయే ప్రమాదం ఉంది. ఉత్తరాది ఓటర్లు, దక్షిణాది వారు, గుజరాత్, జైన్, మార్వాడీ వర్గాల మద్దతును తిరిగి పొందడంలో పార్టీ నాయకత్వం పూర్తిగా విఫలమైందని పార్టీ సీనియర్ నేతలే అంటున్నారు.
పొత్తుల గందరగోళం
ముస్లిం, దళిత ఓట్లను ఏకం చేయాలనే లక్ష్యంతో ప్రకాష్ అంబేడ్కర్ నేతృత్వంలోని వంచిత్ బహుజన్ అఘాడి (వీబీఏ), రాష్ట్రీయ సమాజ్ పక్ష (ఆర్‌ఎస్‌పీ)తదితర పార్టీలతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. అయితే ఈ కూటమి క్షేత్రస్థాయిలో కూడా సరైన ఫలితాలను ఇవ్వలేకపోయింది. ప్రచారంలో మిత్రపక్షాలను కలుపుకుపోవడంలో కాంగ్రెస్ విఫలమైందనే విమర్శలు వినిపించాయి. కేవలం తమ అభ్యర్థులకే ఓట్లు అడగడంపై వీబీఏ నాయకత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. మరోవైపు వర్షా గైక్వాడ్ కేవలం అమీన్ పటేల్, అస్లాం షేక్ వంటి ఇద్దరు ముగ్గురు నేతల మాటలకే ప్రాధాన్యతనిచ్చారని, ఇతర సీనియర్లను, క్షేత్రస్థాయి కార్యకర్తలను విస్మరించారని పార్టీలోని ఒక వర్గం ఆరోపిస్తూవస్తోంది. సమిష్టి నిర్ణయాలు లేకపోవడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
టికెట్ల పంపిణీలో పక్షపాతం
టికెట్ల కేటాయింపు వ్యవహారం పార్టీలో తీవ్ర అసంతృప్తిని రగిలించింది. కష్టకాలంలో పార్టీని నమ్ముకున్న నిజమైన కార్యకర్తలను పక్కనపెట్టి, ముఖ్య నేతల కుటుంబ సభ్యులకే టికెట్లు కట్టబెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఉదాహరణకు.. అంధేరీలో సీనియర్ నేత అస్లాం షేక్ తన కుమారుడు, సోదరి, అల్లుడికి టికెట్లు ఇప్పించుకున్నారు. ఇందుకోసం ఆయన గతంలో గెలిచిన మాజీ కార్పొరేటర్లను కూడా పక్కనపెట్టడంతో, వారు శివసేన (యూబీటీ) గూటికి చేరి, కాంగ్రెస్‌పైనే పోటీకి దిగారు. అలాగే వర్షా గైక్వాడ్ తన అనుచరుల కుటుంబాలకు టికెట్లు ఇవ్వడంతో మాజీ ఎమ్మెల్యే అశోక్ జాదవ్ తదితరులు తమ వారసులకు టికెట్ దక్కలేదన్న కోపంతో పార్టీని వీడారు. ఇలాంటి స్వయంకృతాపరాధాలు, అవకాశవాద రాజకీయాలే ముంబైలో కాంగ్రెస్ పతనానికి ప్రధాన కారణాలుగా నిలిచాయని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: పుడుతూనే మధుమేహం..


