సముద్రంలో శత్రువులను వేటాడే 'హంటర్‌' | INS Anjadip inducted into Eastern Navy Dolphin Hunter | Sakshi
Sakshi News home page

సముద్రంలో శత్రువులను వేటాడే 'హంటర్‌'

Feb 28 2026 4:33 AM | Updated on Feb 28 2026 4:33 AM

INS Anjadip inducted into Eastern Navy Dolphin Hunter

తూర్పు నౌకాదళంలోకి ఐఎన్‌ఎస్‌ అంజాదీప్‌.. ‘డాల్ఫిన్‌ హంటర్‌’

తక్కువ లోతుగల తీరప్రాంతాల్లోనూ సంచరిస్తుంది

అత్యాధునిక సోనార్‌ వ్యవస్థలతో శత్రు నౌకలు జలాంతర్గాముల పనిపడుతుంది

3,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని విచ్ఛిన్నం చేసేస్తుంది

తక్కువ లోతు ఉండే తీర ప్రాంతాల్లో కూడా కాపు కాచి.. అత్యాధునిక సోనార్‌ వ్యవస్థలతో శత్రుదేశాల నౌకలు, జలాంతర్గాముల కదలికలను నిరంతరం పసిగట్టడంతో పాటు ఏకంగా 3,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని సైతం ఛేదించగల యద్ధ నౌక ‘డాల్ఫిన్‌ హంటర్‌’... ఐఎన్‌ఎస్‌ అంజాదీప్‌ భారత నావికాదళంలో భాగమయ్యింది. విశాఖ కేంద్రంగా ఉన్న తూర్పు నావికాదళంలో సేవలందించే ఈ యాంటీ సబ్‌మెరైన్‌వార్‌ ఫేర్‌ షాలో వాటర్‌ క్రాఫ్ట్‌ను కోల్‌కతాకు చెందిన జీఆర్‌ఎస్‌ఈ, ఎల్‌అండ్‌ టీ సంస్థలు నిర్మించాయి. 

దీనికి కర్ణాటక కార్వార్‌ తీరంలో ఉన్న అంజాదీప్‌ ద్వీపం పేరు పెట్టారు. ఈ హంటర్‌ గరిష్టంగా 25 నాట్స్‌ వేగంతో దూసుకెళ్తుంది. ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా నిర్మించిన ఈ నౌకను శుక్రవారం చెన్నై పోర్టులో భారత నావికా దళాధిపతి దినేష్‌ కె. త్రిపాఠి ఆధ్వర్యంలో జాతికి అంకితం చేశారు. – సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం

అత్యాధునిక సోనార్‌ వ్యవస్థ.. 
అంజాదీప్‌ హైస్పీడ్‌ వాటర్‌ జెట్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్‌ ద్వారా గంటకు 46.3 కిలోమీటర్లు (25 నాట్స్‌) వేగంతో కదులుతుంది. ఇందులో ఏర్పాటు చేసిన అత్యాధునిక సోనార్‌ వ్యవస్థతో తీరప్రాంతాల్లో శత్రువుకు చెందిన నౌకలు, జలాంతర్గాములను  వెంటనే గుర్తించడంతో పాటు వాటి కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. 77 మీటర్ల పొడవు, 10.5 మీటర్ల వెడల్పు, 1,400 టన్నుల బరువు ఉండే అర్నాలా శ్రేణికి చెందిన ఈ యుద్ధ నౌక.. సముద్రంలో శత్రువు కంటపడకుండా సంచరిస్తుంది. 

ప్రధానంగా తీర ప్రాంతాల్లో శత్రు జలాంతర్గాములను (సబ్‌మరైన్లు) గుర్తించి, ఎదుర్కొనేందుకు దీనిని రూపొందించారు. ఇది సముద్రంలో దాగి ఉన్న శత్రు సబ్‌మెరైన్లను గుర్తించి నిర్వీర్యం చేయగలదు. అందుకే దీనిని ‘డాల్ఫిన్‌ హంటర్‌’ అని పిలుస్తారు. ఏకంగా 3,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని సైతం వేగంగా విచి్ఛన్నం చేసే సామర్థ్యం దీని సొంతం. తక్కువ బరువు ఉన్న టార్పెడోలతో పాటు యాంటీ సబ్‌మెరైన్‌ రాకెట్లను దీని ద్వారా ప్రయోగించే వీలుంది.

శత్రువు దృష్టిలో పడకుండా లక్ష్యాన్ని ఛేదించడం దీని ప్రత్యేకత. 7 మంది నేవీ అధికారులతో పాటు 50 మంది సెయిలర్స్‌ ఇందులో ప్రయాణించే వీలుంది. ఇప్పటికే భారత నావికాదళంలో ఉన్న ఐఎన్‌ఎస్‌ అరిహంత్, ఐఎన్‌ఎస్‌ అరిఘాత్‌లకు ఐఎన్‌ఎన్‌ అంజాదీప్‌ తోడవడంతో సముద్రతీర ప్రాంతం మరింత శత్రు దుర్భేద్యంగా తయారుకానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement