తాచుపాముతో కౌన్సిల్‌ సమావేశానికి.. | Councillor Brings Cobra to Council Meeting To Protest Snake Infestation In Nidadavolu | Sakshi
Sakshi News home page

తాచుపాముతో కౌన్సిల్‌ సమావేశానికి..

Feb 28 2026 4:29 AM | Updated on Feb 28 2026 1:12 PM

Nidadavolu Municipal Councilor innovative protest

నిడదవోలు మున్సిపల్‌ కౌన్సిలర్‌ వినూత్న నిరసన 

నిడదవోలు: విష సర్పాల సంచారం ఎక్కువగా ఉన్నా మున్సిపల్‌ అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఓ కౌన్సిలర్‌ కౌన్సిల్‌ సమావేశానికి తాచుపామును తీసుకువచ్చి నిరసన తెలిపిన ఉదంతమిది. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మున్సిపల్‌ కౌన్సిల్‌ సాధారణ, అత్యవసర సమావేశాలను చైర్మన్‌ భూపతి ఆదినారాయణ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. 20వ వార్డుకు చెందిన వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌ దాకే అనిల్‌ కుమార్‌ ఏకంగా తాచుపాముతో సమావేశానికి వచ్చారు. 

తన పరిధిలోని ఎంవీ నగర్‌ మదర్‌ థెరిస్సా మున్సిపల్‌ ఎలిమెంటరీ పాఠశాల, పాత కమిటీ భవనాల ప్రాంతాల్లో విష సర్పాల సంచారం ఎక్కువగా ఉందని చెప్పారు. కౌన్సిల్‌ సమావేశాల్లో ఎన్నిసార్లు ఈ అంశాన్ని ప్రస్తావించినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం పాఠశాల సమీపంలో సంచరిస్తున్న తాచుపామును పట్టించి, ఓ తెల్లని డబ్బా­లో పెట్టి, ఆ డబ్బాను సంచిలో పెట్టుకు­ని కౌన్సిల్‌ సమావేశానికి హాజరయ్యారు. 

పామును అధికారులను చూపించి, వినూత్నంగా నిరసన తెలిపేందుకు ప్రయత్నించారు. చైర్మన్‌ ఆదినారాయణకు ఈ విషయం తెలిసింది. సమావేశంలో ఓ కౌన్సిలర్‌ పాములు తీసుకువచ్చినట్లు సమాచారం వచి్చందని, దానిని వెంటనే బయటకు తీసుకువెళ్లాలని ఆదేశించారు. దీంతో, కౌన్సిలర్‌ అనిల్‌ కుమార్‌ తాచుపాము ఉన్న సంచీని బయట పెట్టారు. సమావేశం ముగిసిన తర్వాత మున్సిపల్‌ కార్యాలయం బయట తాను తీసుకువచి్చన పామును విలేకరులకు చూపిస్తూ నిరసన తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement