పాలు కల్తీ జరిగినట్టు భావిస్తున్న కూలెంట్
కల్తీ పాల ఘటనపై నిజాల నిర్ధారణ ఇప్పటికీ ప్రశ్నార్థకమే
కాలయాపనతో కేసును నీరుగార్చేలా చంద్రబాబు సర్కారు తీరు
ఘటనకు కారణాలేమిటో నిగ్గు తేల్చాలంటున్న పాలవ్యాపారి తల్లి
మరేదో జరిగిందంటూ అనుమానాలు.. విషమంగానే బాధితుల ఆరోగ్యం
15 మందికి ఇంకా కొనసాగుతున్న చికిత్స
8 మందికి వెంటిలేటర్, డయాలసిస్ చేస్తున్న వైద్యులు
కల్తీ పాల ఫ్రీజర్ మంగళగిరిలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలింపు
సాక్షి, రాజమహేంద్రవరం: కల్తీ పాల బాధితులు నరకయాతన అనుభవిస్తుండగా.. చంద్రబాబు సర్కారు కాలయాపనతో కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. తాజాగా పాల వ్యాపారి గణేష్ తల్లి కల్తీకి కూలెంట్ కారణం కాదని వాదిస్తున్నారు. అందులోని పాలను తాము కూడా తాగామని, వాటితోనే మజ్జిగ చేసి ఓ ఆలయానికి సైతం పంపించినట్టు చెబుతున్నారు.
అవే పాలు తాగిన తమకు ఏమీ కాలేదని, రాజమహేంద్రవరంలో అస్వస్థతకు గురయ్యారంటే.. దీనివెనుక ఏదో కుట్ర దాగుందని ఆరోపిస్తున్నారు. సమగ్ర విచారణ జరిపి కల్తీ పాలకు కారణమేమిటనేది నిగ్గు తేల్చాలని కోరుతున్నారు. ఆమె వ్యాఖ్యలు ఇప్పటికే కొన్ని ప్రచార మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఆ వ్యాఖ్యలతో ఆత్మరక్షణలో పడిన అధికారులు, ప్రజాప్రతినిధులు రక్షణ చర్యలకు ఉపక్రమించినట్టు తెలిసింది.
బాధితుల శరీరంలో యూరియా అవశేషాలు
కాగా.. కల్తీ పాల ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాధితుల శరీరంలో యూరియా అవశేషాలు ఉన్నాయనే అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది. రాజమహేంద్రవరంలో కల్తీ పాలకు కోరుకొండ మండలం నరసాపురంలోని వరలక్ష్మి డెయిరీలో ఫ్రీజర్ (కూలెంట్) కారణమని అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. కూలెంట్ పాడై అందులోని ఇథలీన్ గ్లైకాల్ పాలల్లో కలవడంతో కిడ్నీ సమస్యలు తలెత్తినట్టు భావిస్తున్నామని అధికారులు చెబుతున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే ఆ డెయిరీలో తనిఖీలు చేపట్టిన ఫోరెన్సిక్ బృందం పాల సేకరణ కేంద్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. పాలు, వెనిగర్, కొన్ని ఖాళీ సీసాలు, పౌడర్ సేకరించారు. కూలెంట్‌ను నిశితంగా తనిఖీ చేశారు. అయితే, కల్తీ పాల బాధితుల శరీరంలో యూరియా అవశేషాలు ఉండటం, వైఎస్సార్‌సీపీ శ్రేణులు సైతం కూలెంట్ లీకేజీపై అనుమానాలు వ్యక్తం చేయడంతో ఫోరెన్సిక్ సిబ్బంది ఇప్పటికే తనిఖీ చేసిన కూలెంట్‌ను మరోసారి పరిశీలించేందుకు మంగళగిరి తీసుకెళ్లారు.
అక్కడి ఫోరెన్సిక్ లేబొరేటరీలో మరోసారి పరీక్షించనున్నట్టు తెలిసింది. అనంతరం ఓ నిర్ధారణకు రానున్నట్టు సమాచారం. తర్వాత అయినా స్పష్టమైన ప్రకటన చేస్తారా.. ల్యాబ్ రిపోర్టుల మాదిరిగా ఈ అంశంలోనూ వాయిదాల పద్ధతి అవలంభిస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
విషమంగానే బాధితుల ఆరోగ్యం
కల్తీ పాలు తాగి కిడ్నీ సమస్యలతో రాజమహేంద్రవరంలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్యం రోజురోజుకూ విషమంగా మారుతోంది. కల్తీ పాలకు 21 మంది ప్రభావితం కాగా.. ఇప్పటికే ఆరుగురు మరణించారు. 15 మంది వివిధ ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 8 మందిని వెంటిలేటర్‌పై ఉంచి డయాలసిస్ చేస్తున్నారు. మరో ఆరుగురికి డయాలసిస్ చేస్తుండగా.. ఒకరికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.
ఇంకా అందని ల్యాబ్ రిపోర్టులు
బాధితుల నుంచి సేకరించిన రక్త నమూనాల ల్యాబ్ రిపోర్టులు శుక్రవారం నాటికి కూడా రాలేదు. తొలుత పుణే నుంచి రావాల్సి ఉందని అధికారులు వెల్లడించగా.. తాజాగా తిరుపతి పంపించినట్టు చెబుతున్నారు. రెండు రోజులవుతున్నా ఇంకా రాకపోవడంపై బాధితుల్లో ఆందోళన నెలకొంది.
కల్తీపాలు తాగి చనిపోయిన వారి పోస్టుమార్టం నివేదికలు సైతం అందలేదు. పోస్టుమార్టం శాంపిల్స్‌ను విజయవాడలోని రీజినల్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. అవి ఎప్పుడు వస్తాయో అంతు చిక్కని ప్రశ్నగా మారింది. కాలయాపన చేసి కేసును నీరుగార్చేందుకే ప్రభుత్వం ఇలా చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


