గర్భం దాల్చిన విద్యార్థిని
రాజీకి రావాలని బాలిక కుటుంబంపై ఒత్తిడి
పోలీసుల్ని ఆశ్రయించిన బాలిక తల్లిదండ్రులు
ఈ విషయం తెలిసి పరారైన నిందితుడు
గోప్యంగా ఉంచిన నల్లపాడు పోలీసులు
గుంటూరు రూరల్: పదో తరగతి విద్యార్థినిపై కన్నేసిన జనసేన కార్యకర్త తన పశువాంఛ తీర్చుకున్నాడు. పెళ్లయి ఇద్దరు పిల్లలున్నా.. బాలికను గర్భవతిని చేశాడు. ఈ ఘటన నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆ వివరాలు వెల్లడించకుండా పోలీసులు గోప్యత పాటిస్తున్నారు. నిందితుడు జనసేన కార్యకర్త కావటం, అధికార పార్టీ నాయకులు చేసే అక్రమ మైనింగ్ కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న కారణంగా పోలీసులు గోప్యత పాటిస్తున్నట్టు తెలిసింది.
తనపై పోలీసులకు ఫిర్యాదు అందిందన్న సమాచారం తెలుసుకున్న జనసేన కార్యకర్త పరారైనట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే.. మండలంలోని ఓబులునాయుడు పాలెం గ్రామానికి చెందిన మాదల నాగరాజు(35)కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎన్నికల సమయంలో జనసేనలో చురుగ్గా పనిచేసిన అతడు చంద్రబాబు అధికారం చేపట్టిన తరువాత అక్రమ మైనింగ్ కార్యకలాపాల్లో కీలకంగా పనిచేస్తున్నాడు.
కాగా.. డంపింగ్ యార్డు సమీపంలోని ఓ కాలనీకి చెందిన ఒక మహిళతో నాగరాజుకు పరిచయం ఏర్పడింది. వారి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. మహిళ ఇంటి పరిసరాల్లో మైనార్టీ వర్గానికి చెందిన పదో తరగతి బాలికపై నాగరాజు కన్నుపడింది. అతడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మహిళ సైతం నాగరాజు ఇచ్చే డబ్బుకు ఆశపడి చిన్నారిని సమిధగా మార్చి అతడి కామవాంఛ తీర్చేందుకు సహకరించింది.
ఈ నేపథ్యంలో బాలిక అనారోగ్యంగా కనిపించటంతో తల్లిదండ్రులు బాలికను నిలదీశారు. దీంతో అసలు విషయం బయటపడింది. బాలిక తల్లిదండ్రులకు వాస్తవం తెలిసిపోవడంతో నాగరాజు అధికార పార్టీకి చెందిన వ్యక్తులతో కలిసి రాజీ ప్రయత్నాలు చేసినట్టు సమాచారం. బాలిక తల్లిదండ్రులు నల్లపాడు పోలీసులను ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు.
నిందితుడిని అరెస్ట్ చేయకపోవడంతో అతడు పరారైనట్టు తెలిసింది. బాలికను నాగరాజుతో చనువుగా ఉండేందుకు కృషిచేసిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. నిందితుడికి అధికార పార్టీ పెద్దల అండ ఉండటంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేయడం లేదని తెలిసింది.


