కేంద్రం గజిట్‌ను నోటిఫై చేసిన రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: వేసవి సెలవుల్లో రాష్ట్రంలో జనగణన నిర్వహించే అవకాశం ఉంది. జనగణన–2027 కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్యకాలంలో.. రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన 30 రోజులపాటు ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. ఇంటింటి సర్వేకి సరిగ్గా 15 రోజుల ముందు స్వీయ నమోదు (సెల్ఫ్ ఎన్యూమరేషన్) ఆప్షన్‌ను వినియోగించుకునే అవకాశాన్ని ప్రజలకు కల్పించనున్నారు.
దేశ వ్యాప్తంగా జనగణన–2027 నిర్వహించేందుకు కేంద్ర హోంశాఖ గత జనవరి 7న జారీ చేసిన గజిట్ నోటిఫికేషన్‌ను రాష్ట్రంలో మళ్లీ నోటిఫై చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్– సెపె్టంబర్ మధ్యలో ఇంటింటి సర్వే జరిగే 30 రోజులను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసి కేంద్రానికి తెలియజేయనుంది. విద్యార్థులకు పరీక్షలు ముగిసిన తర్వాత వేసవి సెలవుల్లో రాష్ట్రంలో ఇంటింటి సర్వే నిర్వహించే అవకాశం ఉంది. ఏప్రిల్ లేదా మే నెలల్లో నిర్వహించనున్నారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది.


