యుద్ధం ఎఫెక్ట్‌: హైదరాబాద్ బంకుల్లో ‘నో స్టాక్‌’ బోర్డులు | Global Tensions Disrupt Oil Supply, Hyderabad Residents Struggle With Shortages, More Details Inside | Sakshi
Sakshi News home page

యుద్ధం ఎఫెక్ట్‌: హైదరాబాద్ బంకుల్లో ‘నో స్టాక్‌’ బోర్డులు

Mar 12 2026 7:45 AM | Updated on Mar 12 2026 11:01 AM

fuel crisis petrol cng shortage city

నిలిచిపోయిన పెట్రో సరఫరా  

 నగరంలో చమురు కష్టాలు 

బంకుల్లో నో స్టాక్‌ బోర్డులు 

వంట గదికి గ్యాస్‌ సెగలు 

మూతపడుతున్న హోటళ్లు

సాక్షి, హైదరాబాద్‌: అక్కడెక్కడో పశ్చిమాసియాలో యుద్ధం ఇక్కడి జన జీవన ఛిన్నాభిన్నం చేస్తోంది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో చమురు సరఫరా గొలుసు తెగిపోవడంతో మహా నగరంలో పెట్రోల్, సీఎన్‌జీ, వంటగ్యాస్‌ కొరత తీవ్రరూపం దాల్చింది. ఇంధన సెగలు సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి నిన్నటి వరకు సాఫీగా సాగిన నగర జీవనం.. ఇప్పుడు బంకుల ముందు పడిగాపులతో నరకప్రాయంగా మారింది. 

కిలోమీటర్ల మేర క్యూలైన్లు 
చమురు కంపెనీల నుంచి డీలర్లకు స్టాక్‌ సరఫరా గణనీయంగా తగ్గడంతో నగరంలోని మెజారిటీ పెట్రోల్‌ బంకుల్లో ‘నో స్టాక్‌’ బోర్డులను దర్శనమిస్తున్నాయి. తెరిచి ఉన్న కొన్ని బంకుల వద్ద కిలోమీటర్ల మేర ఆటోలు, కార్లు క్యూ కడుతున్నాయి. గంటల తరబడి వేచి చూసినా ఇంధనం దొరుకుతుందన్న గ్యారంటీ లేకపోవడంతో వాహనదారులు విలవిలలాడుతున్నారు.  గ్యాస్‌ ఆటోలు కలిగిన డ్రైవర్లు ఎల్‌పీజీ, సీఎన్‌జీ నింపుకొనేందుకు రాత్రింబవళ్లూ ఆయా బంకుల వద్ద గంటలతరబడి వేచి ఉన్నారు. ముఖ్యంగా సీఎన్‌జీపై ఆధారపడే ఆటో డ్రైవర్ల పరిస్థితి దయనీయంగా మారింది. 

వాణిజ్య గ్యాస్‌కు ‘గండం’.. 
ఇంధన కొరత కేవలం వాహనాలకే పరిమితం కాకుండా వంటగది వరకు పాకింది. వంట–గ్యాస్‌ కష్టాలు తీవ్రంగా మారాయి. కర్రీ పాయింట్లు, హోటళ్లు, చిన్న చిన్న టిఫిన్‌ బండ్లపై ఎఫెక్ట్‌ బాగా కని్పస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న గ్యాస్‌ నిల్వలను కేవలం గహ అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ మళ్లించడంతో, వాణిజ్య  గ్యాస్‌ సిలిండర్ల సరఫరా నిలిచిపోయింది.  గ్యాస్‌ కొరతతో నగరం పొడవునా చిన్న, మధ్యతరహా హోటళ్లు మూతపడుతున్నాయి. గ్యాస్‌ పొదుపు చర్యల్లో భాగంగా హాస్టల్‌ నిర్వాహకులు మెనూలో కోత విధిస్తున్నారు. వంటల సంఖ్యను తగ్గించడంతో విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

చేతులెత్తేస్తున్న డీలర్లు 
ముందస్తు సమాచారం లేకుండానే చమురు సంస్థల్లో లోడింగ్‌ పాయింట్ల వద్ద స్టాక్‌ నిలిపివేయడంతో సరఫరా లేక డీలర్లు చేతులెత్తేస్తున్నారు. ఇలాగే కొనసాగితే రవాణా రంగం పూర్తిగా కుప్పకూలే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 

 

Advertisement
 
Advertisement
Advertisement