కొత్త డీజీపీగా సీవీ ఆనంద్‌కు చాన్స్‌ ! | CV Anand has a chance to become the new DGP | Sakshi
Sakshi News home page

కొత్త డీజీపీగా సీవీ ఆనంద్‌కు చాన్స్‌ !

Mar 12 2026 4:14 AM | Updated on Mar 12 2026 4:14 AM

CV Anand has a chance to become the new DGP

ఢిల్లీలో ఎంపిక కమిటీ భేటీ.. హాజరైన సీఎస్‌ రామకృష్ణారావు 

యూపీఎస్సీకి నలుగురుసీనియర్‌ ఐపీఎస్‌ల పేర్లు 

జాబితాలో సీవీ ఆనంద్, ఆప్టే, శిఖా గోయల్, సౌమ్య మిశ్రా 

ముందువరుసలో సీవీ ఆనంద్‌.. శిఖాగోయల్‌ కూడా ప్రయత్నాలు  

సుప్రీంకోర్టు ఆదేశాలతో వేగవంతమైన ఎంపిక ప్రక్రియ 

సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్‌: తదుపరి డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌గా సీవీ ఆనంద్‌ నియామకం కానున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఆరు వారాల్లోగా రాష్ట్రానికి పూర్తిస్థాయి డీజీపీ నియామకాన్ని పూర్తి చేయాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ఢిల్లీలో కీలక ఘట్టం చోటుచేసుకుంది. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) ఆధ్వర్యంలో జరిగిన ఉన్నతస్థాయి ఎంపిక కమిటీ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) రామకృష్ణారావు హాజరై, నలుగురు సీనియర్‌ ఐపీఎస్‌లతో కూడిన జాబితాను కమిటీకి అందజేసినట్టు తెలిసింది.  

ఆ ముగ్గురు ఎవరు?... 
ఢిల్లీ షాజహాన్‌ రోడ్‌లోని యూపీఎస్సీ భవన్‌ వేదికగా దాదాపు గంటపాటు ఈ సమావేశం సాగింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన జాబితాలో 1992 బ్యాచ్‌కు చెందిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి సీవీ ఆనంద్‌తోపాటు, 1994 బ్యాచ్‌కు చెందిన వినాయక్‌ ప్రభాకర్‌ ఆప్టే, శిఖా గోయల్, సౌమ్య మిశ్రాల పేర్లు ఉన్నాయి. ఈ భేటీలో ఆయా అధికారుల సర్వీస్‌ రికార్డులు, మెరిట్, ఇతర కీలక అంశాలపై సీఎస్‌తో కలిసి కమిటీ సభ్యులు సుదీర్ఘంగా చర్చించారు. నిబంధనల ప్రకారం.. ప్రభుత్వం పంపిన నలుగురి జాబితా నుంచి ఒకరిని పక్కనపెట్టి, ముగ్గురితో కూడిన తుది ప్యానెల్‌ను ఎంపిక కమిటీ తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది. 

ఆ ముగ్గురిలో ఒకరిని ప్రభుత్వం పూర్తిస్థాయి డీజీపీగా ఎంపిక చేయాల్సి ఉంటుంది. యూపీఎస్సీ పంపించే జాబితాలో నుంచి సీవీ ఆనంద్‌ వైపు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మొగ్గు చూపించే అవకాశమున్నట్టు తెలిసింది. జితేందర్‌ ఉద్యోగ విరమణ చేసినప్పుడు కూడా సీవీ ఆనంద్‌ డీజీపీ పోస్టు కోసం ప్రయత్నించినా... అప్పట్లో శివధర్‌రెడ్డికి ఇచ్చిన మాట మేరకు సీఎం రేవంత్‌రెడ్డి ఆయనకు అవకాశం కల్పించిన విషయం విదితమే. 

తీవ్ర పోటీ.. 
కొత్త డీజీపీ పోస్టు కోసం సీనియర్‌ అధికారుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. సీనియారిటీ ప్రకారం చూసుకుంటే జాబితాలో సీవీ ఆనంద్‌ పేరు ముందు వరుసలో ఉంది. డీజీపీ పదవిని దక్కించుకునేందుకు శిఖా గోయల్‌ సైతం గట్టిగానే ఆసక్తి చూపుతున్నట్టు పోలీస్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. డీజీపీ జితేందర్‌ ఉద్యోగ విరమణ చేసిన సమయంలోనే ఆమె ఈ పోస్టు కోసం తనవంతు ప్రయత్నాలు చేశారన్న వార్తలు వెలువడ్డాయి. 

అయితే.. యూపీఎస్సీ ఎంపిక కమిటీ ఢిల్లీ నుంచి పంపే ‘ముగ్గురు’అధికారు ల తుది జాబితా రాష్ట్రానికి చేరిన తర్వా త ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తుది నిర్ణ యం తీసుకుంటారు. దీంతో త్వరలోనే రాష్ట్ర కొత్త పోలీస్‌ బాస్‌ ఎవరన్నదానిపై అధికారికంగా సస్పెన్స్‌ వీడనుంది.   

Advertisement
 
Advertisement
Advertisement