అభివృద్ధి పథంలో రాష్ట్రం | NITI Aayog releases economic and health index | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పథంలో రాష్ట్రం

Mar 12 2026 3:52 AM | Updated on Mar 12 2026 3:52 AM

NITI Aayog releases economic and health index

2023–24లో అభివృద్ధి వ్యయాల్లో పెరుగుదల 

సామాజిక, ఆర్థిక సేవలకు పెరిగిన కేటాయింపులు 

మౌలిక సదుపాయాల నిర్మాణం, సంక్షేమ కార్యక్రమాలపై రాష్ట్రం దృష్టి 

ఆర్థిక, ఆరోగ్య సూచిక విడుదల చేసిన నీతి ఆయోగ్‌  

సాక్షి, హైదరాబాద్‌:  2023–24 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి వ్యయాల పెరుగుదలతో ముందుకు సాగినట్లు ఆర్థిక ఆరోగ్య సూచిక (ఫిస్కల్‌ హెల్త్‌ ఇండెక్స్‌) నివేదిక వెల్లడించింది. సామాజిక సేవలు, ఆర్థిక సేవలకు కేటాయింపులు పెరగడం, ముఖ్యంగా మూలధన వ్యయాలు గణనీయంగా పెరగడం ద్వారా మౌలిక సదుపాయాల నిర్మాణం, సంక్షేమ కార్యక్రమాలపై రాష్ట్రం దృష్టి కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. నీతి అయోగ్‌ విడుదల చేసిన ఈ నివేదికలో రాష్ట్ర ఆదాయాల్లో సొంత పన్ను ఆదాయాలే ప్రధాన భాగాన్ని కలిగి ఉండగా, పన్నేతర ఆదాయాలు కూడా వేగంగా పెరుగుతున్నట్లు తేలింది. 

అయితే కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ల వాటా క్రమంగా తగ్గుతున్నట్లు నివేదిక వెల్లడించింది. ఆర్థిక సూచికల పరంగా చూస్తే రాష్ట్రం స్వల్ప రెవెన్యూ మిగులు కొనసాగిస్తూ, దవ్య్ర లోటును చట్టపరమైన పరిమితులలోనే ఉంచినట్లు తెలిపింది. అయితే అభివృద్ధి అవసరాల కారణంగా అప్పులు క్రమంగా పెరిగాయని, ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం సూచించిన పరిమితిని స్వల్పంగా అధిగమించినట్లు పేర్కొంది. 

అభివృద్ధి వ్యయాల్లో భారీ పెరుగుదల 
2019–20 నుంచి 2023–24 మధ్య రాష్ట్ర అభివృద్ధి రెవెన్యూ వ్యయాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. సంక్షేమం, మానవ వనరుల అభివృద్ధికి సంబంధించి సామాజిక సేవలపై వ్యయం మొత్తం రెవెన్యూ వ్యయంలో సుమారు 38–39 శాతం స్థాయిలో కొనసాగుతోంది. ఇక ఆర్థిక సేవలపై వ్యయం ఈ కాలంలో వేగంగా పెరిగి 22 శాతం నుంచి 35 శాతానికి పెరిగింది. ఇది మౌలిక సదుపాయాల అభివృద్ధి, వృద్ధి లక్ష్యాలపై ప్రభుత్వ దృష్టిని ప్రతిబింబిస్తోంది. 

అభివృద్ధి మూలధన వ్యయం 2019–20లో రూ.16,860 కోట్లు ఉండగా 2023–24 నాటికి రూ.43,918 కోట్లకు పెరిగింది. అంటే 160 శాతానికి పైగా వృద్ధి నమోదైంది. రాష్ట్ర మొత్తం రెవెన్యూ ఆదాయం 2019–20లో రూ.1,02,543 కోట్లు ఉండగా 2023–24 నాటికి రూ.1,69,293 కోట్లకు పెరిగింది. ఇది రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)లో సుమారు 11–12 శాతం స్థాయిలో కొనసాగుతోంది. రాష్ట్ర మొత్తం ఆదాయంలో సొంత పన్ను ఆదాయాలే సుమారు 80 శాతం వరకు ఉన్నాయి. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ల వాటా సుమారు 6 శాతం మాత్రమే ఉండగా ఇది క్రమంగా తగ్గుతున్నట్లు నివేదిక తెలిపింది.  

ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి మించి అప్పులు  
ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం రాష్ట్ర అప్పులు జీఎస్‌డీపీలో 33.10 శాతం లోపు ఉండాలి. అయితే 2023–24లో రాష్ట్ర మొత్తం అప్పులు, ఇతర రుణ బాధ్యతలు రూ.5,17,659 కోట్లుగా తేలాయి. అంటే ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి మించి జీఎస్‌డీపీలో 34.47 శాతంగా నమోదయ్యాయి. గత ఐదేళ్లుగా రాష్ట్రం అప్పులు క్రమంగా పెరుగుతున్నాయి. అభివృద్ధి కార్యక్రమాల కోసం రాష్ట్రం మార్కెట్‌ నుంచి రూ.49,618 కోట్ల రుణాలు సమీకరించినట్లు నివేదిక పేర్కొంది.   

Advertisement
 
Advertisement
Advertisement