300 కేజీల కుళ్లిపోయిన మాంసం స్వాధీనం | Police Seize 300 Kg of Rotten Meat in Hyderabad | Sakshi
Sakshi News home page

300 కేజీల కుళ్లిపోయిన మాంసం స్వాధీనం

Mar 11 2026 7:34 PM | Updated on Mar 11 2026 7:47 PM

 Police Seize 300 Kg of Rotten Meat in Hyderabad

హైదరాబాద్‌: అపరిశుభ్రమైన మాంసాన్ని అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ సొమ్ము చేసుకుంటున్నారు కొందరు వ్యాపారులు. హైదరాబాద్‌లోని మంగళ్‌హాట్ పోలీసులు, గోల్కొండ జోన్ టాస్క్ ఫోర్స్, జీహెచ్‌ఎంసీ అధికారులు సంయుక్తంగా మంగళ్‌హాట్ పరిధిలో ఆకస్మిక దాడులు చేయడంతో ఇటువంటి మరో ఘటన బయటపడింది. 

తాజా మాంసం అని నమ్మిస్తూ నిల్వ ఉంచిన కుళ్లిన మాంసాన్ని విక్రయిస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున‍్నారు. మంగళ్‌హాట్ లోని చిస్తీ చమన్ దర్గా సమీపంలో ‘ఏ టూ జెడ్‌ షీప్‌ అండ్‌ గోట్‌ ఆఫ్ఫాల్’ పేరుతో మాంసం వ్యాపారం నిర్వహిస్తున్న మహమ్మద్ అఫ్రోజ్ (41) అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

నిందితుడు గతంలో కూడా ఇటువంటి నేరానికి పాల్పడగా, అప్పట్లో జీహెచ్‌ఎంసీ అధికారులు అతడికి జరిమానా విధించారు. మళ్లీ అలాంటి పనులే చేస్తున్నాడు. అతడి షాపులో నుంచి పోలీసులు సుమారు 300 కిలోల కుళ్లిపోయిన గొర్రె, మేక మాంసం స్వాధీనం చేసుకున్నారు. అఫ్రోజ్‌ అధిక లాభాల కోసం కర్ణాటక, ఢిల్లీ, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల నుంచి తక్కువ ధరకే మాంసాన్ని సేకరించేవాడు.

అలా సేకరించిన మాంసాన్ని డీప్ ఫ్రీజర్లలో నిల్వ ఉన్న నీటితో నింపిన ప్లాస్టిక్ టబ్బులలో రోజుల తరబడి ఉంచేవాడు. మాంసం కుళ్లిపోకుండా, దుర్వాసన రాకుండా ఉండేందుకు ఇలా నిల్వ చేస్తూ, వినియోగదారులకు అది తాజా మాంసమని నమ్మించి విక్రయించేవాడు. అతి షాపులో ఉన్న 300 కేజీల కుళ్లిన మాంసాన్ని స్వాధీనం చేసుకుని పోలీసులు పారేశారు.

అపరిశుభ్రమైన ప్రాంతాల నుంచి మాంసం, ఆహార పదార్థాలను కొనుగోలు చేయవద్దని పౌరులకు అధికారులు విజ్ఞప్తి చేశారు. అక్రమ నిల్వలు, కార్యకలాపాలు ప్రజల దృష్టికి వస్తే వెంటనే పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement