పార్టీ మారలేదు | Disqualification petitions filed by BRS dismissed | Sakshi
Sakshi News home page

పార్టీ మారలేదు

Mar 12 2026 2:45 AM | Updated on Mar 12 2026 5:34 AM

Disqualification petitions filed by BRS dismissed

దానం, కడియంకు అనర్హత వర్తించదన్న స్పీకర్‌ ట్రిబ్యునల్‌ 

బీఆర్‌ఎస్‌ దాఖలు చేసిన అనర్హత పిటిషన్లు డిస్మిస్‌

గతంలోనే 8 మందిపై అనర్హత పిటిషన్లు కొట్టివేత 

స్పీకర్‌ నిర్ణయంపై బీఆర్‌ఎస్‌ అసంతృప్తి 

తీర్పు కాపీ అందిన తర్వాత తదుపరి కార్యాచరణ ఉంటుందన్న కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరారని పేర్కొంటూ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్లను శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ కొట్టేశారు. ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, బీజేపీ శాసనసభా పక్షం నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అనర్హత పిటిషన్లు దాఖలు చేశారు. మరో ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. వీటిపై ఇటీవల విచారణ పూర్తి చేసిన స్పీకర్‌ బుధవారం ఉదయం 10 గంటలకు తన తుది తీర్పును ప్రకటించారు. 

వాస్తవానికి తమ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన మొత్తం 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ పలువురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పిటిషన్లు దాఖలు చేశారు. అయితే 8 మంది ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లను గతంలోనే డిస్మిస్‌ చేసిన స్పీకర్‌ తాజాగా.. దానం, కడియంకు సంబంధించి తీర్పు వెలువరించారు. వారు పార్టీ మారలేదని స్పష్టం చేశారు. కాగా స్పీకర్‌ నిర్ణయంతో దానం, కడియంపై కచ్చితంగా అనర్హత వేటు పడుతుందని భావించిన బీఆర్‌ఎస్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. స్పీకర్‌ ట్రిబ్యునల్‌ నుంచి తీర్పు కాపీ అందిన తర్వాత తమ తదుపరి కార్యాచరణ ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు. 

అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి.. 
రాష్ట్రంలో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ 39 స్థానాలకే పరిమితమైంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడింది. అయితే 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు 10 మంది కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్లు ఆరోపణలు వచ్చాయి.టి.ప్రకాశ్‌గౌడ్‌ (రాజేంద్రనగర్‌), పోచారం శ్రీనివాస్‌రెడ్డి (బాన్సువాడ), దానం నాగేందర్‌ (ఖైరతాబాద్‌), కాలే యాదయ్య (చేవెళ్ల), డాక్టర్‌ ఎం.సంజయ్‌కుమార్‌ (జగిత్యాల), కడియం శ్రీహరి (స్టేషన్‌ ఘన్‌పూర్‌), తెల్లం వెంకట్‌రావు (భద్రాచలం), బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి (గద్వాల), అరెకపూడి గాంధీ (శేరిలింగంపల్లి), గూడెం మహీపాల్‌ రెడ్డి (పటాన్‌చెరు) వీరిలో ఉన్నారు. 

అయితే దానం నాగేందర్‌ 2024 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మరోవైపు స్టేషన్‌ ఘనపూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కావ్యకు బీఆర్‌ఎస్‌ వరంగల్‌ ఎంపీ టికెట్‌ ఇవ్వగా ఆమె చివరి నిమిషంలో కాంగ్రెస్‌లో చేరి ఎంపీగా గెలుపొందారు. ఈ ఎన్నికల్లో కడియం కావ్య తరఫున కడియం శ్రీహరి ప్రచారం చేసినట్లు బీఆర్‌ఎస్‌ ఆరోపించింది. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారంటూ భారత రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్‌ (ఫిరాయింపుల నిరోధక చట్టం)లోని పేరా 2(1) ప్రకారం వారిని అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ 2024 జూలైలో శాసనసభ స్పీకర్‌ వద్ద వేర్వేరుగా అనర్హత పిటిషన్లు దాఖలు చేసింది. 

కోర్టుల్లో బీఆర్‌ఎస్‌ సుదీర్ఘ న్యాయపోరాటం 
తాము దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో స్పీకర్‌ ఆలస్యం చేస్తున్నారని పేర్కొంటూ బీఆర్‌ఎస్‌ 2024 డిసెంబర్‌లో హైకోర్టును ఆశ్రయించింది. దీంతో నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని సింగిల్‌ బెంచ్‌ స్పీకర్‌ను ఆదేశించింది. అయితే స్పీకర్‌కు కాల పరిమితి విధించడం తగదంటూ ఆ ఉత్తర్వులను హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ రద్దు చేసింది. డివిజన్‌ బెంచ్‌ ఆదేశాలను సవాలు చేస్తూ బీఆర్‌ఎస్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 

డివిజన్‌ బెంచ్‌ తీర్పును రద్దు చేసిన సుప్రీంకోర్టు.. 3 నెలల్లో అన్ని పిటిషన్లు పరిష్కరించాలని ఆదేశించింది దీంతో 2025 ఆగస్టులో 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసిన స్పీకర్‌ దశల వారీగా విచారణ జరిపారు. అయితే నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలనే ఆదేశాలను స్పీకర్‌ పాటించక పోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.. 2025 నవంబర్‌ 17న ఆయనకు కోర్టు ధిక్కరణ నోటీసు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పదింటిలో ఏడు పిటిషన్లు డిస్మిస్‌ చేసినట్లు 2026 జనవరి 16న సుప్రీంకోర్టుకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌పై దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసిన స్పీకర్‌.. తాజాగా కడియం, దానంలకు అనర్హత వర్తించదని పేర్కొంటూ పిటిషన్లు డిస్మిస్‌ చేశారు.   

Advertisement
 
Advertisement
Advertisement