కఠ్మాండు: నేపాల్ పార్లమెంట్ ఎన్నికలకు రంగం సిద్ధమయ్యింది. గురువారం జరిగే ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశంలో మూడేళ్ల క్రితమే పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. రాజకీయ అనిశి్చతి, జెన్ జీ యువత పోరాటం వల్ల ప్రభుత్వం గత ఏడాది కూలిపోయింది. సుశీల కర్కీ నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నూతన ప్రభుత్వ ఏర్పాటు కోసం మళ్లీ పార్లమెంట్ ఎన్నికలు నిర్వహిస్తామని ఆమె ప్రకటించారు. నేపాల్ ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం దేశంలో 1.90 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 2022 నవంబర్‌లో జరిగిన పార్లమెంల్ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం 10 లక్షల మంది కొత్తగా ఓటర్లుగా నమోదయ్యారు. వీరంతా చాలావరకు యువతే కావడం విశేషం. నేపాల్‌లో 18 ఏళ్ల వయసు రాగానే ఓటు వేసే హక్కు లభిస్తుంది. యువతను ఆకట్టుకోవడమే లక్ష్యంగా రాజకీయ పారీ్టలు ప్రచారం హోరెత్తిస్తున్నాయి. అవినీతిని అంతం చేస్తామని, సుపరిపాలన అందిస్తామని హామీ ఇస్తున్నాయి. ఈ ఎన్నికల్లో యువతే నిర్ణయాత్మక పాత్ర పోషించబోతున్నారు.
రాజకీయ అస్థిరతకు మారుపేరు
నేపాల్ పార్లమెంట్‌లో మొత్తం 275 స్థానాలున్నాయి. దిగువ సభ అయిన ‘ప్రతినిధుల సభ’లో 165 స్థానాలుండగా, వీరిని ఎన్నికల ద్వారా ఓటర్లు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. మిగతా 110 మంది ఎంపీలను రాజకీయ పార్టీలు ఎన్నికల్లో తమకు లభించిన ఓట్ల శాతం ఆధారంగా నామినేట్ చేస్తాయి. నేపాల్ పార్లమెంట్‌లో ఏకైక పార్టీ అధికారం చెలాయించిన సందర్భాలు అరుదే. ఎక్కువగా కూటమి ప్రభుత్వాలే ఏర్పాటయ్యాయి. రెండు లేదా మూడు పారీ్టలు చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం పరిపాటిగా మారింది. రాజకీయ అస్థిరతకు మారుపేరు నేపాల్. గత రెండు దశాబ్దాల్లో 15 ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
బాలేంద్ర షా పారీ్టకి విజయావకాశాలు
నేపాల్‌లో ప్రధానంగా నేపాలీ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్‌దే ఆధిపత్యం. ఆ రెండు పార్టీలు కూటమిగా ఏర్పడిన సందర్భాలున్నాయి. ప్రజాగ్రహం వల్ల గత ఏడాది పతనమైన ప్రభుత్వం ఈ రెండు పారీ్టల కలయికతో ఏర్పడినదే. 2022లో స్థాపించిన నేషనల్ ఇండిపెండెంట్ పార్టీకి ఈసారి విజయావకాశాలు అధికంగా ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆ పార్టీ ప్రచార సభలకు జనం పోటెత్తారు. ఖాట్మాండు మాజీ మేయర్, నేషనల్ ఇండిపెండెంట్ పార్టీ ముఖ్యనేత బాలేంద్ర షా ఆ పార్టీ ప్రధానమంత్రి అభ్యరి్థగా తెరపైకి వచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో నేషనల్ ఇండిపెండెంట్ పార్టీ విజయం సాధిస్తే బాలేంద్ర షా ప్రధానమంత్రి కావడం తథ్యమని చెబుతున్నారు.


