T20 WC 2026: విండీస్‌ మరోసారి.. తొలి జట్టు..! | T20 WC 2026: West indies beat nepal by 9 wickets | Sakshi
Sakshi News home page

T20 WC 2026: విండీస్‌ మరోసారి.. తొలి జట్టు..!

Feb 15 2026 2:34 PM | Updated on Feb 15 2026 3:31 PM

T20 WC 2026: West indies beat nepal by 9 wickets

రెండు సార్లు టీ20 ప్రపంచ ఛాంపియన్‌ వెస్టిండీస్‌ మూడో టైటిల్‌ దిశగా తొలి అడుగు వేసింది. 2026 ఎడిషన్‌లో ఆ జట్టు సూపర్‌-8కు అర్హత సాధించింది. ప్రస్తుత ఎడిషన్‌లో సూపర్‌-8 బెర్త్‌ ఖరారు చేసుకున్న తొలి జట్టు వెస్టిండీసే. నేపాల్‌పై విజయం సాధించడంతో విండీస్‌ సూపర్‌-8 బెర్త్‌ ఖరారైంది.

ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఇవాళ (ఫిబ్రవరి 15) జరిగిన మ్యాచ్‌లో విండీస్‌ 9 వికెట్ల తేడాతో పసికూనను చిత్తు చేసింది. తొలుత బౌలింగ్‌లో నేపాల్‌ను 133 పరుగులకే (8 వికెట్ల నష్టానికి) కట్టడి చేసిన కరీబియన్‌ జట్టు.. ఆ తర్వాత స్వల్ప లక్ష్యాన్ని 15.2 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది.

ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ జేసన్‌ హోల్డర్‌ బౌలింగ్‌లో (4-0-27-4) ఇరగదీసి నేపాల్‌ను దెబ్బేశాడు. మాథ్యూ ఫోర్డ్‌ (4-1-10-1) పొదుపుగా బౌలింగ్‌ చేసి నేపాల్‌ను కట్టడి చేశాడు. అకీల్‌ హోసేన్‌, షమార్‌ జోసఫ్‌, రోస్టన్‌ ఛేజ్‌ కూడా తలో వికెట్‌ తీసి నేపాల్‌ను ఇబ్బంది పెట్టారు. 

నేపాల్‌ ఇన్నింగ్స్‌లో దీపేంద్ర సింగ్‌ ఎయిరీ (58) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ఆఖర్లో సోమ్‌పాల్‌ కామీ (26 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడటంతో నేపాల్‌ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది.

అనంతరం​ స్వల్ప లక్ష్యాన్ని విండీస్‌ బ్యాటర్లు సునాయాసంగా ఛేదించారు. కెప్టెన్‌ షాయ్‌ హోప్‌ (61) అజేయమైన అర్ద సెంచరీతో విండీస్‌ను విజయతీరాలకు చేర్చాడు. హోప్‌కు హెట్‌మైర్‌ (46 నాటౌట్‌), బ్రాండన్‌ కింగ్‌ (22) సహకరించారు. ఈ ఓటమితో నేపాల్‌ ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించింది. 

మెగా టోర్నీలో ఈ జట్టు ఆడిన 3 మ్యాచ్‌ల్లో పరాజయంపాలైంది. అయితే తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను మాత్రం ఓడించినంత పని చేసింది. ఇదొక్కటే ఈ ఎడిషన్‌లో నేపాల్‌కు ఊరట కలిగించే విషయం. ఫిబ్రవరి 17న ఈ జట్టు తమ చివరి గ్రూప్‌ మ్యాచ్‌ (స్కాట్లాండ్‌) ఆడనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement