IND vs PAK: ‘​వర్షం పడాలని కోరుకుంటున్నా’ | I Want Rain: Ahead Of IND vs PAK T20 WC Clash Ex Star Bizarre Remark | Sakshi
Sakshi News home page

IND vs PAK: ‘​వర్షం పడాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’

Feb 15 2026 10:46 AM | Updated on Feb 15 2026 11:52 AM

I Want Rain: Ahead Of IND vs PAK T20 WC Clash Ex Star Bizarre Remark

క్రికెట్‌ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చేసింది. దాయాదులు భారత్‌- పాకిస్తాన్‌ పోరుకు సమయం ఆసన్నమైంది. చిరకాల ప్రత్యర్థుల మధ్య ఆదివారం (ఫిబ్రవరి 15) మ్యాచ్‌ జరుగనుంది. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా.. వరుణుడి భయం అభిమానులను వేధిస్తోంది.

వాన పడొద్దు దేవుడా!
కాగా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో గ్రూప్‌-ఎలో ఉన్న భారత్‌- పాక్‌ మధ్య మ్యాచ్‌కు శ్రీలంకలోని కొలంబోలో గల ఆర్‌. ప్రేమదాస స్టేడియం వేదిక. భారత కాలమానం ప్రకారం రాత్రి ఏడు గంటలకు మ్యాచ్‌ ఆరంభం కావాల్సి ఉంది. 

అయితే, ఆదివారం కొలంబోలో వాన పడే అవకాశాలు 93 శాతం ఉన్నట్లు ఆక్యూవెదర్‌ పేర్కొంది. సాయంత్రానికి వర్షం ముప్పు తగ్గినా అవుట్‌ ఫీల్డ్‌ తడిగా ఉంటే మ్యాచ్‌ సజావుగా సాగే అవకాశాలు సన్నగిల్లుతాయి.

ఈ నేపథ్యంలో క్రికెట్‌ అభిమానులంతా వర్షం ప్రభావం ఈ మ్యాచ్‌ పడకుండా చూడాలంటూ దేవుడిని వేడుకుంటున్నారు. క్రేజీ మ్యాచ్‌ కోసం తామంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నామని.. తమ ఆశలపై నీళ్లు చల్లవద్దని వరుణుడిని ప్రార్థిస్తున్నారు. ఇలాంటి తరుణంలో పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ బసిత్‌ అలీ (Basit Ali) వింత వ్యాఖ్యలు చేశాడు.

వర్షం పడాలని దేవుడిని ప్రార్థిస్తున్నా
ఓ స్పోర్ట్స్‌ షోలో మాట్లాడుతూ.. "ఆ సర్వాంతర్యామి (దేవుడు) నా ప్రార్థన విని వర్షం పడేలా చేయాలి’’ అని బసిత్‌ అలీ వ్యాఖ్యానించాడు. ఇందుకు హోస్ట్‌.. "మీరు మ్యాచ్‌ మొత్తం చూడాలని అనుకోవడం లేదా?" అని అడుగగా.. "నేను వర్షం పడాలని కోరుకుంటున్నాను (I Want Rain)" అని పునరుద్ఘాటించాడు.

అదే జరిగితే మ్యాచ్‌ రద్దు
కాగా వరల్డ్‌కప్‌ గ్రూప్‌ దశ మ్యాచ్‌లకు రిజర్వ్‌ డే ఉండదు. ఫలితం కోసం ఇరుజట్లు కనీసం ఐదు ఓవర్లు ఆడాల్సి ఉంటుంది. అదీ కుదరని పక్షంలో మ్యాచ్‌ రద్దైనట్లు అంపైర్లు ప్రకటిస్తారు. ఇరుజట్లకు చెరో పాయింట్‌ కేటాయిస్తారు.

ప్రస్తుతం టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీలో భారత్‌.. అమెరికా, నమీబియాలపై గెలిచి నాలుగు పాయింట్లు సాధించగా.. పాకిస్తాన్‌ సైతం నెదర్లాండ్స్‌, అమెరికా జట్లను ఓడించి నాలుగు పాయింట్లతో ఉంది. అయితే, నెట్‌రన్‌రేటు పరంగా టీమిండియా (+3.050) పాకిస్తాన్‌ (+0.932) అత్యంత మెరుగ్గా ఉండి అగ్రస్థానాన్ని ఆక్రమించింది.

ఇదేం కోరిక?
ఒకవేళ దాయాదుల పోరు వర్షం వల్ల రద్దు అయిపోతే.. భారత్‌- పాక్‌ ఐదు పాయింట్లతో సూపర్‌-8 దశకు దాదాపుగా అర్హత సాధించినట్లే. గ్రూప్‌ దశలో అమెరికా, నెదర్లాండ్స్‌లకు చెరో మ్యాచ్‌ మిగిలి ఉండగా.. నమీబియా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అయితే, నెదర్లాండ్స్‌ (-1.352), నమీబియా (-2.884) నెట్‌రన్‌రేటు మైనస్‌లలో ఉండటం గమనార్హం.

ఇక గత వరల్డ్‌కప్‌ ఎడిషన్‌లో అనూహ్య రీతిలో పాకిస్తాన్‌ను ఓడించి టీమిండియాతో పాటు అమెరికా సూపర్‌-8కు చేరిన విషయం తెలిసిందే. దీంతో పాక్‌ టోర్నీ నుంచి అవమాన భారంతో నిష్క్రమించింది. 

ఇక ఇప్పుడు భారత్‌ చేతిలో పాక్‌ గనుక భారీ తేడాతో ఓడితే మళ్లీ అమెరికాతో ప్రమాదం పొంచి ఉండవచ్చు. ఈ నేపథ్యంలోనే భారత్‌- పాక్‌ మ్యాచ్‌ వాన వల్ల చెడిపోవాలని బసిత్‌ అలీ కోరుకుంటున్నాడని నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.

చదవండి: IND vs PAK: పాక్‌తో భారత్‌ మ్యాచ్‌.. మధ్యాహ్నమే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement