పాకిస్తాన్ ఆఫ్ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్ గురించి టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడు వైవిధ్యమైన బౌలర్ అన్న మాట వాస్తవమేనని.. అయితే, తాము మాత్రం అతడి ఆటకు లొంగమని పేర్కొన్నాడు.
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్తాన్ ఆదివారం ముఖాముఖి తలపడనున్న విషయం తెలిసిందే. శ్రీలంకలోని కొలంబోలో గల ఆర్.ప్రేమదాస స్టేడియం ఇందుకు వేదిక.
అపుడే చూస్తారు
ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) పలు విషయాలపై స్పందించాడు. ముఖ్యంగా పాక్ ఆటగాళ్లతో ఈసారి కరచాలనం చేస్తారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘మేం చక్కటి క్రికెట్ ఆడేందుకే ఇక్కడికి వచ్చాం. అది మాత్రమే అత్యంత ముఖ్యం. మిగతావన్నీ అనవసర విషయాలు.
షేక్ హ్యాండ్ ఇచ్చే విషయంపై ఇప్పుడే ఏమీ చెప్పను. మ్యాచ్ ప్రారంభమైనప్పుడే మీరు చూస్తారు’’ అని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు.
సున్నా నుంచి మొదలు
ఇక టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో పాక్‌పై 7-1తో భారత్ ఆధిపత్యం కొనసాగిస్తున్న అంశం ప్రస్తావనకు రాగా.. ‘‘పాక్‌పై పాత రికార్డు ఇక్కడ పనికి రాదు. మళ్లీ సున్నా నుంచి స్కోరు మొదలు పెట్టాల్సిందే’’ అని సూర్య నిజాయితీగా సమాధానం ఇచ్చాడు.
అదే విధంగా ఉస్మాన్ తారిఖ్ (Usman Tariq)నైపుణ్యాల గురించి విలేకరులు ప్రస్తావించగా.. ‘‘పరీక్షలో సెలబస్ నుంచి కాకుండా ఇతర అంశాల గురించి ప్రశ్నలు వచ్చినంత మాత్రాన దానిని వదిలివేయలేము కదా!..
అతడి ఆటకు మేము లొంగిపోము
అతడొక వైవిధ్యమైన బౌలర్. అయినంత మాత్రాన మేము అతడి ఆట ముందు లొంగిపోము. అతడి బౌలింగ్‌లో ఆడేందుకు మా వాళ్లు ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు’’ అని సూర్య పేర్కొన్నాడు.
చకింగ్ ఆరోపణలు
కాగా తన వైవిధ్యమైన బౌలింగ్ శైలితో పాక్ ఆఫ్‌స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్ వార్తల్లో నిలుస్తున్నాడు. ‘చకింగ్ (సందేహాస్పద బౌలింగ్)’ చేస్తున్నాడంటూ ఆరోపణలు వినిపించినా...రెండు సార్లు అతడి యాక్షన్‌కు ఐసీసీ అనుమతి ఇచ్చింది. కాబట్టి నిబంధనల ప్రకారం తప్పు లేకపోవచ్చు. ఈ విషయం గురించి పలువురు మాజీ అంపైర్లు కూడా ఇదే చెప్పారు.
అయితే బంతి విసిరే ముందు అతను కాస్త ఆగినట్లుగా ఉంటూ (పాజ్) వేయడం చర్చకు దారి తీసింది. ఇది బ్యాటర్‌ను గందరగోళంలో పడేయవచ్చని... బ్యాటర్ కూడా కాస్త జరిగి షాట్ ఆడటమే దీనికి ఉపాయమని అశ్విన్ విశ్లేషించాడు.
అంత సీన్ లేదు
అయితే తారిఖ్ యాక్షన్ ఎలా ఉన్నా... అతడు సాధారణ ఆఫ్‌స్పిన్నర్ మాత్రమేనని మాజీ కెప్టెన్ గంగూలీ అభిప్రాయ పడ్డాడు. భారత బ్యాటర్లు అతడి బౌలింగ్‌లో చెలరేగుతారని ధీమా వ్యక్తం చేశాడు.
చదవండి: T20 WC 2026: పాక్‌తో మ్యాచ్.. భారత తుది జట్టు ఇదే! వారిద్దరిపై వేటు


