T20 WC 2026: ధోని ప్రపంచ రికార్డు బద్దలు | T20 WC: Quinton de Kock Creates History breaks MS Dhoni World Record | Sakshi
Sakshi News home page

T20 WC 2026: ధోని ప్రపంచ రికార్డు బద్దలు

Feb 15 2026 10:04 AM | Updated on Feb 15 2026 11:40 AM

T20 WC: Quinton de Kock Creates History breaks MS Dhoni World Record

సౌతాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ క్వింటన్‌ డికాక్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 ప్రపంచకప్‌ టోర్నమెంట్లో ఇంత వరకు ఏ ఆటగాడికీ సాధ్యం కాని ఘనత సాధించాడు. ఈ క్రమంలో భారత దిగ్గజ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని పేరిట ఉన్న ప్రపంచ రికార్డును ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ బద్దలు కొట్టాడు.

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో భాగంగా శనివారం నాటి మ్యాచ్‌లో సౌతాఫ్రికా న్యూజిలాండ్‌తో తలపడింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్‌ గెలిచిన సఫారీ జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 175 పరుగులు సాధించింది.

యాన్సెన్‌ నాలుగు వికెట్లతో చెలరేగగా.. 
ప్రొటిస్‌ బౌలర్లలో మార్కో యాన్సెన్‌ (Marco Jansen) నాలుగు వికెట్లతో చెలరేగగా.. ఎంగిడి, కేశవ్‌ మహరాజ్‌, బాష్‌ తలా ఒక వికెట్‌ దక్కించుకున్నారు. మరోవైపు.. వికెట్‌ కీపర్‌ క్వింటన్‌ డికాక్‌ (Quinton de Kock) కివీస్‌ ఓపెనర్‌ టిమ్‌ సీఫర్ట్‌ (13) ఇచ్చిన క్యాచ్‌ను అందుకున్నాడు.

ధోని వరల్డ్‌ రికార్డు బద్దలు
ఈ క్రమంలో టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీలో అత్యధిక డిస్మిసల్స్‌లో భాగమైన వికెట్‌ కీపర్‌గా డికాక్‌ చరిత్రకెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు ధోని పేరిట ఉండేది. టీ20 ప్రపంచకప్‌ ఈవెంట్లో ధోని 32 ఇన్నింగ్స్‌లో 32 డిస్మిసల్స్‌లో భాగం కాగా.. డికాక్‌ 30 ఇన్నింగ్స్‌లోనే 33 సార్లు ప్రత్యర్థి బ్యాటర్‌ అవుట్‌ కావడంలో తన వంతు పాత్ర పోషించాడు.

ఇదిలా ఉంటే.. కివీస్‌ విధించిన నామమాత్రపు లక్ష్యంతో ఛేదనకు దిగిన సౌతాఫ్రికా 17.1 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి 178 పరుగులు సాధించింది. తద్వారా న్యూజిలాండ్‌పై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

 కెప్టెన్‌, ఓపెనింగ్‌ బ్యాటర్‌ ఐడెన్‌ మార్క్రమ్‌ మెరుపు, అజేయ అర్ధ శతకం (44 బంతుల్లో 86)తో రాణించి గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఇక మరో ఓపెనర్‌ డికాక్‌ మాత్రం (14 బంతుల్లో 20) నిరాశపరిచాడు.

టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో అత్యధిక డిస్మిసల్స్‌లో భాగమైన వికెట్‌ కీపర్లు
👉క్వింటన్‌ డికాక్‌ (సౌతాఫ్రికా)- 33 డిస్మిసల్స్‌
👉ఎంఎస్‌ ధోని (ఇండియా)- 32 డిస్మిసల్స్‌
👉కమ్రాన్‌ అక్మల్‌ (పాకిస్తాన్‌)- 30 డిస్మిసల్స్‌
👉దినేశ్‌ రామ్‌దిన్‌ (వెస్టిండీస్‌)- 27 డిస్మిసల్స్‌.

చదవండి: IND vs PAK: అతడి ఆటకు మేము లొంగిపోము: సూర్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement