విధ్వంసకర ఆట తీరుతో క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న నయా సంచలనం వైభవ్ సూర్యవంశీ. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)తో సత్తా చాటి వెలుగులోకి వచ్చిన ఈ బిహారీ పిల్లాడు.. భారత్ తరఫునా అదరగొడుతున్నాడు. పద్నాలుగేళ్ల వయసులోనే అండర్-19 స్థాయిలో అదరగొడుతున్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. వరల్డ్‌కప్ ఫైనల్లోనూ దుమ్ములేపాడు.
జింబాబ్వే వేదికగా ఇంగ్లండ్‌పై భారీ శతకం (80 బంతుల్లో 175) బాదిన వైభవ్ సూర్యవంశీ.. భారత్ ఆరోసారి వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడటంలో కీలక పాత్ర పోషించాడు. అంతకుముందు భారత్ అండర్-19 జట్టు తరఫున ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా గడ్డ మీద ఈ చిచ్చరపిడుగు సత్తా చాటాడు.
అంతేకాదు.. దక్షిణాఫ్రికాలో ఏకంగా కెప్టెన్‌గా వ్యవహరించిన వైభవ్.. యూత్ వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేయడం విశేషం. ఇలా టీనేజ్‌లోనే క్రికెట్ ప్రపంచంలో తనదైన ముద్ర వేస్తున్న ఈ పద్నాలుగేళ్ల పిల్లాడు.. ఆటతో బిజీగా ఉన్న కారణంగా చదువు విషయంలో ఏడాది వెనుకపడనున్నాడు.
బిహార్‌లోని తేజ్‌పూర్‌కు చెందిన వైభవ్ సూర్యవంశీ.. అక్కడి మాడెస్టీ స్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో ఫిబ్రవరి 17- మార్చి 11 మధ్య జరగాల్సిన సీబీఎస్‌ఈ క్లాస్ 10 బోర్డు ఎగ్జామ్‌కు వైభవ్ సూర్యవంశీ హాజరు కావాల్సి ఉంది. తొలుత వైభవ్ పరీక్షలు రాస్తాడని వార్తలు వచ్చాయి.
అయితే, తాజా సమాచారం ప్రకారం వైభవ్ సూర్యవంశీ ఈ ఏడాది పరీక్షలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని మాడెస్టీ స్కూల్ డైరెక్టర్ ఆదర్శ్ కుమార పింటూ నిర్ధారించారు. వైభవ్‌కు అడ్మిట్ కార్డు కూడా జారీ చేశామని.. అయితే, ఆఖరి నిమిషంలో అతడు మనసు మార్చుకున్నట్లు వెల్లడించారు.
వైభవ్ సూర్యవంశీ తండ్రి సంజీవ్ సూర్యవంశీ ఈ మేరకు తమ నిర్ణయాన్ని తెలిపినట్లు పింటూ పేర్కొన్నారు. కాగా వరుస సిరీస్‌లు, వరల్డ్‌కప్ టోర్నీతో బిజీగా గడిపిన వైభవ్.. ప్రస్తుతం రాజస్తాన్ రాయల్స్ క్యాంపుతో ఐపీఎల్‌కు సన్నద్ధమయ్యే పనిలో ఉన్నాడు.
దీంతో పరీక్షలకు సరిగ్గా ప్రిపేర్ కాలేకపోయాడని.. అందుకే ఈసారి పరీక్షలు రాయొద్దని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆటతో పాటు వైభవ్ చదువును కూడా బ్యాలెన్స్ చేస్తే బాగుండనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
దిగ్గజాల క్వాలిఫికేషన్ తెలుసా?
ఇక వైభవ్ పరీక్షలు స్కిప్ చేసిన నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజాల విద్యార్హతల అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. క్రికెట్ దేవుడిగా పేరొందిన సచిన్ టెండుల్కర్ పదో తరగతిలో ఫెయిల్ అయ్యాడు. ఈ ముంబైకర్ ఆట మీద మాత్రమే దృష్టి పెట్టి అంతర్జాతీయ క్రికెట్‌లో వంద శతకాలు సాధించిన ఏకైక క్రికెటర్‌గా ప్రసిద్ధికెక్కాడు.
మరోవైపు.. టీమిండియాకు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని.. ఇంటర్ చదివాడు. రైల్వేలో ఉద్యోగం చేస్తూ టీమిండియాలోకి వచ్చి జట్టు గతినే మార్చివేశాడు ఈ జార్ఖండ్ డైనమైట్.
ఇక ఢిల్లీకి చెందిన రన్‌మెషీన్ విరాట్ కోహ్లి కూడా పన్నెండో తరగతి వరకే చదివాడు. అదే విధంగా.. భారత్‌కు రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన సారథి, ముంబైకర్ రోహిత్ శర్మ సైతం ఇంటర్‌తోనే ఆపివేసినట్లు తెలుస్తోంది.
చదవండి: IND vs PAK: అతడి ఆటకు మేము లొంగిపోము: సూర్య


