ఐసీసీ అండర్-19 వరల్డ్‌కప్-2026 ఫైనల్లో సత్తా చాటి మరోసారి ప్రశంసలు అందుకుంటున్నాడు వైభవ్ సూర్యవంశీ. ఇంగ్లండ్‌తో టైటిల్ పోరులో ఈ పద్నాలుగేళ్ల బాలుడు కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు సాధించాడు. తద్వారా భారత్ ఆరోసారి ప్రపంచకప్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
ఈ నేపథ్యంలో ఈ భారత యువ క్రికెట్ తరంగాన్ని ఏకంగా దిగ్గజ గ్యారీ సోబర్స్‌తో పోల్చాడు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మార్క్ బుచర్. ఇక ఈ మెగా టోర్నీ తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)తో వైభవ్ సూర్యవంశీ బిజీ కానున్నాడు. అయితే, అంతకంటే ముందే మరో దేశీ టీ20 లీగ్‌లో అతడు భాగం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
IPL కంటే ముందే ఆ టీ20 లీగ్‌లో
క్రిక్‌బజ్ కథనం ప్రకారం.. దేశీ కార్పొరేట్ టీ20 ఈవెంట్ డీవై పాటిల్ టీ20 టోర్నమెంట్లో వైభవ్ పాల్గొననున్నట్లు అతడి సన్నిహితులు తెలిపారు. ఇందుకు సంబంధించి నిర్వాహకులతో చర్చలు తుదిదశకు చేరినట్లు సమాచారం. కాగా ఈ కాంపిటిషన్ ఫిబ్రవరి 23న మొదలుకానుంది.
హార్దిక్ పాండ్యా సైతం
దేశీ ఆటగాళ్లతో పాటు అంతర్జాతీయ క్రికెటర్లు కూడా డీవై పాటిల్ టీ20 టోర్నమెంట్లో ఆడతారు. ఐపీఎల్ కంటే ముందే పొట్టి క్రికెట్ వైబ్ ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా క్యాష్ రిచ్ లీగ్ కంటే ముందు ఈ టోర్నీలో ఆడటం యువ ఆటగాళ్ల ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు తోడ్పడుతుంది.
నవీ ముంబై వేదికగా జరిగే గతేడాది ఈ టోర్నీలో హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా వంటి స్టార్ ప్లేయర్లు ఆడారు. శివం దూబే, నేహాల్ వధేరా, దీపక్ చహర్ తదితరులు కూడా భాగమయ్యారు.
పైసా వసూల్ ప్రదర్శన
కాగా దేశీ క్రికెట్‌లో సత్తా చాటి ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాజస్తాన్ రాయల్స్ దృష్టిని ఆకర్షించాడు వైభవ్ సూర్యవంశీ. ఈ చిచ్చరపిడుగు కోసం రాయల్స్ ఏకంగా 1.10 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అందుకు తగినట్లుగానే ఈ బిహారీ పిల్లాడు పైసా వసూల్ ప్రదర్శన ఇచ్చాడు. సంజూ శాంసన్ గైర్హాజరీలో యశస్వి జైస్వాల్‌కు జోడీగా ఓపెనర్‌గా వచ్చి.. తానేంటో నిరూపించుకున్నాడు.
గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో కేవలం 38 బంతుల్లోనే 101 పరుగులు చేయడంతో వైభవ్ పేరు ఒక్కసారిగా మారుమ్రోగిపోయింది. ఆ తర్వాత భారత్ అండర్-19 జట్టు తరఫున ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలలో అదరగొట్టి యూత్ వన్డే, యూత్ టెస్టుల్లో ధనాధన్ శతకాలతో ఆకట్టుకున్నాడు వైభవ్. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2026 సన్నాహకాల్లో భాగంగా ఫిబ్రవరి 21 వరకు ట్రెయినింగ్ సెషన్‌లో వైభవ్ పాల్గొనున్నాడు.
చదవండి: ENG vs WI: నేపాల్ మీదైనా గెలిచాం.. సంతోషం: హ్యారీ బ్రూక్


