అండర్ 19 వరల్డ్‌కప్ 2026 ఫైనల్లో చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగి, భారత్‌ను ఆరోసారి జగజ్జేతగా నిలిపిన విషయం విధితమే. హరారే వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో వైభవ్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. 80 బంతుల్లో 15 ఫోర్లు, 15 సిక్సర్ల సాయంతో 175 పరుగులు చేశాడు. ఈ మహా విధ్వంసం కారణంగా వైభవ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. టోర్నీ మొత్తంలో ఇదే తరహా ఫామ్‌ను (439 పరుగులు, ఓ వికెట్) కొనసాగించినందుకు ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు కూడా వైభవ్‌కే దక్కింది.
ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. అదేంటంటే.. భారత్ అండర్ 19 ప్రపంచకప్ గెలిచిన గత ఐదు సందర్భాల్లో ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్స్‌గా నిలిచిన ఏ ఒక్క ఆటగాడు కెరీర్‌లో పెద్దగా ఎదగలేకపోయాడు. తూతూమంత్రంగా కొద్ది రోజులు లైమ్‌లైట్‌లో ఉన్నా, ఆతర్వాత శాశ్వతంగా కనుమరుగైపోయారు. దీంతో భారత ఆటగాళ్లకు ఫైనల్స్ కలిరాదనే భావన కలుగుతోంది.
తాజాగా వైభవ్ సూర్యవంశీ అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలవడంతో, ఇతనికి కూడా గత ఐదు వరల్డ్‌కప్ ఫైనల్స్ హీరోలకు పట్టిన గతే పడుతుందా అని అభిమానులు చర్చించుకుంటున్నారు. వైభవ్ దూకుడు చూసి కొందరు అలాగే జరుగుతుందని అంటుంటే.. మరికొందరేమో వైభవ్ టీమిండియా తరఫున అద్భుతమైన కెరీర్‌ను కొనసాగిస్తాడని అభిప్రాయపడుతున్నారు.
ఇంతకీ గతంలో భారత్ అండర్ 19 వరల్డకప్‌లు గెలిచిన సందర్భాల్లో ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్స్ ఎవరని అనుకుంటున్నారా..? అయితే ఇది చూడండి.
భారత్ తొలిసారి ప్రపంచకప్ గెలిచిన సందర్భంలో (2000) రితిందర్ సింగ్ సోధి ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్స్‌గా నిలిచాడు. శ్రీలంకతో జరిగిన ఆ మ్యాచ్‌లో సోధి అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటి భారత్ తొలిసారి వరల్డ్‌కప్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఆ మ్యాచ్‌లో సోధి తొలుత బౌలింగ్‌లో (10-0-26-0), ఆతర్వాత బ్యాటింగ్‌లో (39 నాటౌట్ (43)) రాణించాడు. ఈ ప్రపంచకప్ తర్వాత సోధి కొద్ది రోజులు లైమ్‌లైట్‌లో ఉన్నా, ఆతర్వాత కనుమరుగైపోయాడు.
ఆతర్వాత భారత్ రెండోసారి ప్రపంచకప్ గెలిచిన సందర్భంలో (2008) అజితేశ్ అర్గల్ ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్స్‌గా నిలిచాడు. సౌతాఫ్రికాతో జరిగిన ఆ మ్యాచ్‌లో అర్గల్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో (5-2-7-2) మెరిసి, భారత్ రెండో ప్రపంచకప్ సాధించడంలో తనవంతు పాత్ర పోషించాడు. రైట్ ఆర్మ్ మీడియం పేసర్ అయిన అర్గల్ ఆ ప్రపంచకప్ తర్వాత ఎక్కడా కనిపించలేదు. ఐపీఎల్‌లో ఓ అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోవడంతో ఆటగాడిగా కనుమరుగైపోయారు. అయితే ఆశ్చర్యకరంగా అతను అంపైరింగ్‌ను కెరీర్‌గా ఎంచుకొని, క్రికెట్‌తో బంధాన్ని కొనసాగిస్తున్నాడు.
భారత్ మూడోసారి ప్రపంచకప్ సాధించడంలో (2012) నాటి కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ అత్యంత కీలకపాత్ర పోషించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన నాటి ఫైనల్లో ఉన్ముక్త్ అద్భుతమైన సెంచరీ (111 నాటౌట్) చేసి భారత్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. ఫలితంగా అతనికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఆ సమయంలో ఉన్ముక్త్‌ను అందరూ భావి భారత తారగా అనుకున్నారు. అయితే ఆశర్చర్యకరంగా అతని కెరీర్ కూడా ముందుకు సాగలేదు. అవకాశాలు లభించినా అతను ఒడిసి పట్టుకోలేకపోయాడు. భారత్‌లో కాదని వేరే దేశానికి వెళ్లినా అతని ఫేట్ మారలేదు. దీంతో అతను క్రమంగా కనుమరుగైపోయాడు.
భారత్ నాలుగోసారి (2018) ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించడంలో మన్‌జోత్ కల్రా కీలకపాత్ర పోషించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన నాటి ఫైనల్స్‌లో కల్రా మెరుపు సెంచరీ (101 నాటౌట్) చేసి భారత్‌కు ఏకపక్ష విజయాన్ని అందించాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. పై ముగ్గురితో పోలిస్తే, కల్రా పరిస్థితి మరీ దారుణం. వరల్డ్‌కప్ ఫైనల్ తర్వాత ఇతను ఎక్కడా కనపడలేదు. లిస్ట్-ఏ, టీ20 ఫార్మాట్‌లో కేవలం ఒకటి అరా మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. వరల్డ్‌కప్ ఫైనల్లో సెంచరీ చేసి రాత్రికిరాత్రే హీరో ఇమేజ్ దక్కినా, ఎందుకో ఆ ఇమేజ్‌ను కొనసాగించలేకపోయాడు. ఢిల్లీకి చెందిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ మెరుపులా ఒక్కసారి మెరిసి ఆతర్వాత అదృశ్యమయ్యాడు.
భారత్ ఐదోసారి వరల్డ్‌కప్ గెలవడంలో రాజ్ బవా కీలకపాత్ర పోషించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన నాటి ఫైనల్లో బవా ఆల్‌రౌండర్‌గా (34 (54), 5-31) సత్తా చాటి ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్స్‌గా నిలిచాడు. ఆ ఫైనల్ తర్వాత బవాకు మంచి అవకాశాలే లభించినా, పెద్దగా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఐపీఎల్‌లో అడపాదడపా ప్రదర్శనలతో నెట్టుకొస్తున్నాడు. ఇతను శాశ్వతంగా కనుమరుగుకాకపోయినప్పటికీ.. ఇంచుమించు అంచున ఉన్నాడు.
పై ఐదుగురు వరల్డ్‌కప్ ఫైనల్స్ హీరోల పరిస్థితి చూశాక వైభవ్ ఎమవుతాడోనని టీమిండియా అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన మరో ఆసక్తికర విషయం ఉంది. ప్లేయర్ ఆఫ ద ఫైనల్స్‌గా నిలిచిన ఆటగాళ్ల కెరీర్‌లు బాగా లేకపోయినా, ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచిన వాళ్ల కెరీర్‌లు మాత్రం అద్భుతంగా ఉన్నాయి.
తాజా వరల్డ్‌కప్‌లో వైభవ్ ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్స్‌తో పాటు ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా కూడా నిలిచాడు. దీంతో వైభవ్ కెరీర్‌కు వచ్చిన ఢోకా ఏమీ లేదని ఫ్యాన్స్ ఊరట పొందుతున్నారు. అండర్-19 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు (వైభవ్ సహా) ఐదుగురు (యువరాజ్ సింగ్, శిఖర్ ధవన్, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్)ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచారు. వీరంతా కెరీర్‌లో అత్యున్నతి సాధించారు. వైభవ్ కూడా వీరి బాటలోనే నడవాలని ఆశిద్దాం.


