యువ భారత్ 'సిక్సర్' | India won the Under 19 World Cup final against England by 100 runs | Sakshi
Sakshi News home page

యువ భారత్ 'సిక్సర్'

Feb 7 2026 4:05 AM | Updated on Feb 7 2026 4:05 AM

India won the Under 19 World Cup final against England by 100 runs

వైభవంగా విశ్వవిజేత

అండర్‌–19 ప్రపంచ కప్‌ గెలుచుకున్న భారత్‌

ఫైనల్లో ఇంగ్లండ్‌పై 100 పరుగులతో విజయం

వైభవ్‌ సూర్యవంశీ 80 బంతుల్లో 15 ఫోర్లు, 15 సిక్స్‌లతో 175

టీమిండియా యువ జట్టు ఖాతాలో ఆరో టైటిల్‌ 

అంతర్జాతీయ క్రికెట్‌ వేదికపై భారత కుర్రాళ్లు మళ్లీ అదరగొట్టారు. అద్భుత ఆటతో అండర్‌–19 ప్రపంచ కప్‌ను సొంతం చేసుకున్నారు. సంచలన బ్యాటర్‌ వైభవ్‌ సూర్యవంశీ మెరుపు సెంచరీతో పాటు కెప్టెన్ ఆయుశ్‌ మాత్రే రాణించడంతో భారత్‌ 100 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ యువ జట్టును ఓడించింది. భారత్‌ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగులు చేయగా, ఇంగ్లండ్‌ 40.2 ఓవర్లలో 311పరుగులకు  ఆలౌటైంది. 

ఫాల్క్‌నర్‌ సెంచరీ సాధించాడు. భారత్‌ అండర్‌–19 ప్రపంచ కప్‌ గెలుచుకోవడం ఇది ఆరో సారి కావడం విశేషం. ఈ టోర్నీలో ఆడిన ఏడు మ్యాచ్‌లలోనూ గెలిచిన భారత్‌ అజేయంగాముగించింది. గతంలో భారత్‌కు అండర్‌–19 వరల్డ్‌ కప్‌ అందించిన కెపె్టన్లు కైఫ్‌ (2000),  కోహ్లి (2008), ఉన్ముక్త్‌ చంద్‌ (2012), పృథ్వీ షా (2018), యశ్‌ ధుల్‌ (2022) సరసన ఆయుశ్‌ మాత్రే నిలిచాడు.  

స్థాయి ఎలాంటిదైనా, వేదిక ఏదైనా, ప్రత్యర్థి ఎవరైనా తనకు తెలిసింది మైదానంలో బ్యాట్‌తో విధ్వంసం సృష్టించడమే అని వైభవ్‌ సూర్యవంశీ మరోసారి నిరూపించాడు. ఈ పాలబుగ్గల కుర్రాడు సునామీ ఆటతో సరికొత్త రికార్డులను సృష్టిస్తూ దూసుకుపోయాడు. ఆ షాట్లలో పవర్, పదును, ఎక్కడా తడబాటు కనిపించకుండా పూర్తి సాధికారతతో ఆడిన వైనం నిజంగా అసాధారణం. 

విశేషణాలతో వర్ణించలేని గొప్ప ఇన్నింగ్స్‌ను వైభవ్‌ క్రికెట్‌ ప్రపంచానికి చూపించాడు. పాయింట్, కవర్స్, మిడ్‌ వికెట్, ఫైన్‌ లెగ్, లాంగాఫ్, లాంగాన్‌... ఇలా ప్రతీ దిశలో అత్యద్భుత షాట్లతో పరుగుల సునామీ సృష్టించిన వైభవ్‌ ఏకంగా 15 ఫోర్లు, 15 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.

బౌండరీల ద్వారానే 150 పరుగులు రాబట్టిన అతని ఆట ముందు అండర్‌–19 వరల్డ్‌ కప్‌ దాసోహమంటూ భారత యువ జట్టును ఆరోసారి విశ్వ విజేతను చేసింది. వైభవ్‌ మెరుపులతో 400పైగా పరుగులు చేసి సవాల్‌ విసిరిన భారత్‌ ముందు ఇంగ్లండ్‌ నిలవలేకపోయింది. కొంత పోరాడినా లక్ష్యానికి సుదూరంగానే ఆగిపోవడంతో భారత కుర్రాళ్లు ప్రపంచ చాంపియన్లుగా సగర్వంగా నిలిచారు.   

హరారే: ఐసీసీ అండర్‌–19 ప్రపంచకప్‌లో భారత్‌ మరోసారి విజేతగా నిలిచింది. మొత్తం 16 సార్లు టోర్నీని నిర్వహించగా... భారత్‌ టైటిల్‌ సాధించడం ఇది ఆరోసారి కావడం విశేషం. శుక్రవారం ఇక్కడ జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో భారత యువ జట్టు 100 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ అండర్‌–19 టీమ్‌ను ఓడించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగుల భారీ స్కోరు సాధించింది. 

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ వైభవ్‌ సూర్యవంశీ (80 బంతుల్లో 175; 15 ఫోర్లు, 15 సిక్స్‌లు) అసాధారణ సెంచరీతో చెలరేగగా,  కెప్టెన్ ఆయుశ్‌ మాత్రే (51 బంతుల్లో 53; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో అండగా నిలిచాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 90 బంతుల్లోనే 142 పరుగులు జోడించారు. అనంతరం ఇంగ్లండ్‌ 40.2 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌటైంది. 

కాలెబ్‌ ఫాల్క్‌నర్‌ (67 బంతుల్లో 115; 9 ఫోర్లు, 7 సిక్స్‌లు) శతకం నమోదు చేయగా, బెన్‌ డాకిన్స్‌ (56 బంతుల్లో 66; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. టోర్నీలో 7 ఇన్నింగ్స్‌లలో కలిపి ఏకంగా 169.49 స్ట్రయిక్‌రేట్‌తో మొత్తం 439 పరుగులు సాధించిన వైభవ్‌ సూర్యవంశీకే ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’ అవార్డు దక్కింది.  

రాణించిన కెప్టెన్ 
గత మ్యాచ్‌లో చెలరేగిన హైదరాబాదీ బ్యాటర్‌ ఆరోన్‌ జార్జ్‌ (9) ఫైనల్లో విఫలమైన అనంతరం వైభవ్, ఆయుశ్‌ కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు. ధాటిగా ఆడిన కెప్టెన్ 50 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తర్వాతి బంతికే అతను అవుట్‌ కాగా, 51 పరుగులు జత చేసిన వేదాంత్‌ త్రివేది (36 బంతుల్లో 32; 2 ఫోర్లు), విహాన్‌ మల్హోత్రా (36 బంతుల్లో 30; 2 ఫోర్లు) ఆరు పరుగుల వ్యవధిలో వెనుదిరిగారు. 

అభిజ్ఞాన్‌ కుందు (31 బంతుల్లో 40; 6 ఫోర్లు, 1 సిక్స్‌), చివర్లో కనిష్క్‌ చౌహాన్‌ (20 బంతుల్లో 37 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌) దూకుడు ప్రదర్శించడంతో స్కోరు 400 దాటింది. తొలి 25 ఓవర్లలో 250 పరుగులు చేసిన భారత్‌ తర్వాతి 25 ఓవర్లలో 161 పరుగులు సాధించింది.

ఫాల్క్ నర్‌ మినహా... 
భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌ బాగా తడబడింది. డాకిన్స్, బెన్‌ మాయెస్‌ (28 బంతుల్లో 45; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) రెండో వికెట్‌కు 74 పరుగులు జోడించి మెరుగైన స్థితిలో నిలిపినా ఆ తర్వాత జట్టు వరుసగా వికెట్లు కోల్పోయి 22 ఓవర్లలో 177/7 వద్ద ఓటమికి చేరువైంది. ఈ దశలో జేమ్స్‌ మింటో (28)తో కలిసి ఫాల్‌్కనర్‌ కొద్దిగా పోరాడాడు. భారీ షాట్లు ఆడిన ఫాల్‌్కనర్‌ అంబ్రిష్‌ ఓవర్లో 3 సిక్స్‌లు బాది 63 బంతుల్లో సెంచరీ సాధించాడు. అయితే తర్వాతి ఓవర్లోనే ఖిలాన్‌ చక్కటి క్యాచ్‌తో అతను చివరి వికెట్‌గా అవుట్‌ కావడంతో భారత్‌ సంబరాల్లో మునిగిపోయింది. 

విధ్వంసాన్ని సృష్టిస్తూ... 
తొలి మూడు బంతుల్లో పరుగు తీయలేదు, నాలుగో బంతికి ఫోర్‌తో స్కోర్‌ మొదలైంది. అవతలి వైపు తొలి వికెట్‌ పడే సమయానికి 13 బంతుల్లో 10 పరుగులే. అయితే ఈ కొద్దిసేపు మాత్రమే వైభవ్‌ కాస్త ప్రశాంతంగా కనిపించాడు. పాయింట్‌ దిశగా కొట్టిన మొదటి సిక్స్‌తో జోరు షురూ చేసిన అతను అనంతరం ఎక్కడా తగ్గలేదు. ఆ తర్వాతా ఇదే మోత కొనసాగుతూ మరో 14 సిక్సర్లు అతని ఖాతాలో చేరాయి! 

మింటో ఓవర్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టిన వైభవ్‌ 32 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీని చేరుకున్నాడు. ఆఫ్‌ స్పిన్నర్‌ ఫర్హాన్‌ ఓవర్లో 2 సిక్స్‌లు బాదిన అనంతరం అతని తర్వాతి ఓవర్లో వైభవ్‌ మరింత చెలరేగిపోయాడు. వరుసగా 6, 6, 4, 6తో బంతిని చితక్కొట్టాడు. ఆల్బర్ట్‌ ఓవర్లో ఆఫ్‌ సైడ్‌ దిశగా సింగిల్‌ తీయడంతో 55 బంతుల్లో వైభవ్‌ శతకం పూర్తయింది. ఆ వెంటనే గ్రీన్‌ ఓవర్లో కూడా మరో 2 సిక్స్‌లు కొట్టిన అనంతరం ఆల్బర్ట్‌ వేసిన ఇన్నింగ్స్‌ 23వ ఓవర్లో మరింత పండగ చేసుకున్నాడు. వైభవ్‌ వరుసగా 2, 4, 6, 6, 4, 4 బాదగా వైడ్‌తో కలిసి మొత్తం 27 పరుగులు వచ్చాయి. 

71 బంతుల్లో అతను 150 పరుగుల మార్క్‌ను చేరుకున్నాడు. అర్ధసెంచరీ నుంచి సెంచరీ చేరేందుకు 23 బంతులు తీసుకున్న అతనికి సెంచరీనుంచి 150కు చేరేందుకు 16 బంతులు సరిపోయాయి. మోర్గాన్‌ ఓవర్లో కూడా 2 సిక్స్‌లు, 2 ఫోర్లు కొట్టిన అతను డబుల్‌ సెంచరీ దిశగా నడిచాడు. అయితే పుల్‌–సూ్కప్‌ షాట్‌కు ప్రయత్నించి కీపర్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో వైభవ్‌ అసాధారణ ఇన్నింగ్స్‌ ముగిసింది.

175 సీనియర్‌ వరల్డ్‌ కప్, మహిళల వరల్డ్‌ కప్‌తో సహా ఏదైనా ఐసీసీ టోర్నీ ఫైనల్లో అత్యధిక స్కోరు (175) సాధించిన బ్యాటర్‌గా వైభవ్‌ నిలిచాడు.  

అండర్‌–19 స్థాయిలో వైభవ్‌ కొత్త రికార్డులిలా... 
1     భారత్‌ తరఫున వరల్డ్‌ కప్‌లో అత్యధిక స్కోరు 
   ఓవరాల్‌గా భారత్‌ తరఫున రెండో అత్యధిక స్కోరు (తొలి స్థానంలో అంబటి రాయుడు 177 నాటౌట్‌)  
15  ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు 
30  అత్యధిక బౌండరీలు  
150 బౌండరీల ద్వారా అత్యధిక పరుగులు  
5  ఐదో వేగవంతమైన సెంచరీ (55 బంతుల్లో) 
30  ప్రపంచకప్‌లో అత్యధిక సిక్స్‌లు 
439  ఒకే వరల్డ్‌ కప్‌లో భారత్‌ తరఫున చేసిన పరుగుల్లో శిఖర్‌ ధావన్‌ (505) తర్వాత రెండో స్థానం. 

స్కోరు వివరాలు  
భారత అండర్‌–19 ఇన్నింగ్స్‌: ఆరోన్‌ జార్జ్‌ (సి) మాయెస్‌ (బి) గ్రీన్‌ 9; వైభవ్‌ (సి) ర్యూ (బి) లమ్స్‌డెన్‌ 175; ఆయుశ్‌ (సి) మాయెస్‌ (బి) గ్రీన్‌ 53; వేదాంత్‌ (సి) మాయెస్‌ (బి) మింటో 32; విహాన్‌ (సి) డాకిన్స్‌ (బి) మింటో 30; అభిజ్ఞాన్‌ (సి) ఆల్బర్ట్‌ (బి) మోర్గాన్‌ 40; అంబ్రిష్‌ (బి) మింటో 18; కనిష్క్ (నాటౌట్‌) 37; ఖిలాన్‌ (సి) మూర్స్‌ (బి) మోర్గాన్‌ 3; హెనిల్‌ (రనౌట్‌) 5; దీపేశ్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 411. వికెట్ల పతనం: 1–20, 2–162, 3–251, 4–302, 5–308, 6–359, 7–367, 8–375, 9–393. బౌలింగ్‌: మోర్గాన్‌ 9–0–74–2, గ్రీన్‌ 5–0–49–2, లమ్స్‌డెన్‌ 8–0–81–1, మింటో 8–0–63–3, ఫర్హాన్‌ 10–0–77–0, ఆల్బర్ట్‌ 10–0–66–0.  

ఇంగ్లండ్‌ అండర్‌–19 ఇన్నింగ్స్‌: డాకిన్స్‌ (సి) ఖిలాన్‌ (బి) ఆయుశ్‌ 66; మూర్స్‌ (బి) అంబ్రిష్‌ 17; మాయెస్‌ (సి) హెనిల్‌ (బి) ఖిలాన్‌ 45; థామస్‌ ర్యూ (సి) ఆయుశ్‌ (బి) కనిష్క్ 31; ఫాల్క్‌నర్‌ (సి) ఖిలాన్‌ (బి) కనిష్క్ 115; ఆల్బర్ట్‌ (రనౌట్‌) 0; ఫర్హాన్‌ (సి) అభిజ్ఞాన్‌ (బి) దీపేశ్‌ 1; మోర్గాన్‌ (సి) అండ్‌ (బి) దీపేశ్‌ 0; మింటో (సి) (సబ్‌) ఇనాన్‌ (బి) అంబ్రిష్‌ 28; లమ్స్‌డెన్‌ (సి) వేదాంత్‌ (బి) అంబ్రిష్‌ 3; గ్రీన్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (40.2 ఓవర్లలో ఆలౌట్‌) 311. వికెట్ల పతనం: 1–19, 2–93, 3–142, 4–174, 5–174, 6–177, 7–177, 8–269, 9–281, 10–311. బౌలింగ్‌: అంబ్రిష్‌ 9–1–56–3, హెనిల్‌ 4–2–28–0, దీపేశ్‌ 6–0–64–2, ఖిలాన్‌ 8–0–66–1, కనిష్క్ 8.2–0–63–2, ఆయుశ్‌ 5–0–31–1. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement