టీ20 ప్రపంచకప్-2026లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ దాదాపుగా లేనట్టే. ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు సంబంధించి టికెట్ల అమ్మకాలను ఐసీసీ (ICC) తాత్కాలికంగా నిలిపివేసింది. షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరి 15న కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో భారత్-పాక్ జట్లు తలపడాల్సి ఉంది. కానీ రాజకీయ ఉద్రిక్తల కారణంగా భారత్‌తో మ్యాచ్‌ను బాయ్‌కట్ చేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది.
కానీ పాక్ క్రికెట్ బోర్డు నుంచి ఇప్పటికీ ఐసీసీకి ఎటువంటి అధికారిక సమాచారం అందలేదు. ఈ మ్యాచ్‌ను బాయ్‌కట్ చేస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కొవల్సి వస్తుందని ఐసీసీ హెచ్చరించినప్పటకి పాక్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా పీసీబీకి లేఖ రాసింది.
ఈ మ్యాచ్ రద్దయితే అన్ని విధాలగా తమ దేశం భారీగా నష్టపోతుందని ఆ లేఖలో శ్రీలంక క్రికెట్ పేర్కొంది. ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేశామని, బహిష్కరణ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని లంక బోర్డు కోరింది. అయినా కూడా పీసీబీ వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదు.
ఈ సందిగ్ధత వల్లే టికెట్లు విక్రయించిన తర్వాత ఒకవేళ మ్యాచ్ రద్దయితే, చట్టపరమైన ఇబ్బందులు ఎదురవుతాయని ఐసీసీ బుకింగ్స్‌ను నిలిపివేసింది. ప్రేమదాస స్టేడియంలో జరిగే ఇతర ఎనిమిది మ్యాచ్‌ల టికెట్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. భారత్-పాక్ మ్యాచ్ టికెట్లు మాత్రం బుకింగ్ పోర్టల్‌లో కనిపించడం లేదు. ఈ మెగా టోర్నీ శనివారం(ఫిబ్రవరి 7) నుంచి ప్రారంభం కానుంది.


