వడోదర: అయ్యో... ఢిల్లీ! నాలుగోసారి ఫైనల్ చేరినా... మళ్లీ రన్నరప్ గానే ముగించింది. ముంబై (2023, 2025), బెంగళూరు (2024, 2026) జట్లకు రెండేసి సార్లు టైటిల్‌ను అప్పగించింది.
గురువారం జరిగిన డబ్ల్యూపీఎల్ ఫైనల్లో ఆర్‌సీబీ 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై జయభేరి మోగించింది. విజేత ఆర్‌సీబీ జట్టుకు రూ. 6 కోట్లు... రన్నరప్ ఢిల్లీ జట్టుకు రూ. 3 కోట్లు ప్రైజ్‌మనీ లభించింది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోరు చేసింది.
తర్వాత బెంగళూరు కఠినమైన లక్ష్యాన్ని సైతం 19.4 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 204 పరుగులతో ఛేదించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కెప్టెన్ స్మృతి మంధాన (41 బంతుల్లో 87; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు), జార్జియా (54 బంతుల్లో 79; 14 ఫోర్లు) దంచేశారు.


