సాక్షి, హైదరాబాద్: తన భార్య చాలా ధైర్యవంతురాలని, ఎందుకు బలవస్మరణానికి పాల్పడిందో అర్థం కావడం లేదని స్టాఫ్ట్‌వేర్ ఇంజినీర్ విజయశాంతి రెడ్డి భర్త సురేందర్ రెడ్డి అన్నారు. తమ ఇద్దరి పిల్లలతో కలిసి భార్య ఆత్మహత్య చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని ఆయన చెప్పారు. బోడుప్పల్‌లోని తమ నివాసంలో మంగళవారం ఆయన సాక్షి టీవీతో మాట్లాడారు. ఒంటరితనంగా అనిపిస్తున్నట్టు తన భార్య ఎప్పుడూ చెప్పలేదన్నారు. తమ కుటుంబంలో ఎటువంటి సమస్యలు లేవని, ఆమె పనిచేసే చోట కూడా ఇబ్బందులు లేవని వెల్లడించారు. అసలు ఆమెకు ఒంటరితనం ఫీలయ్యేంత సమయం లేదని.. ఉద్యోగం, కుటుంబంతోనే సరిపోయేదని చెప్పారు. సెలవు రోజుల్లో పిల్లలకు దగ్గరకు వెళ్లేదని.. ఒక వారం అబ్బాయి దగ్గరకు, మరో వారం అమ్మాయి దగ్గరికి వెళ్లేదన్నారు. ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే తనతో చెప్పాల్సిందని, ఏదోలా పరిష్కరించుకునే వాళ్లమని అన్నారు.
''అసలు ఏం జరిగిందో నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. ఇలా ఎందుకు చేశారో తెలియడం లేదు. మైండ్ మొత్తం బ్లాకే ఉంది. మా మధ్య ఎటువంటి దాపరికాలు లేవు. అన్ని విషయాలు షేర్ చేసుకుంటాం. కుటుంబ సభ్యులందరితోనూ బాగానే మాట్లాడుతుంది. ఒంటరిగా ఉండేంత సందర్బాలు లేవు. జనవరి 29 నాడు నాతో చివరిసారిగా ఫోన్‌లో మాట్లాడినప్పుడు కూడా నార్మల్‌గానే మాట్లాడింది. పిల్లల భవిష్యత్తు గురించి ఇద్దరం మాట్లాడుకున్నాం. పిల్లలు నాకంటే వాళ్ల అమ్మతో బాగా క్లోజ్‌గా ఉంటారు. వాళ్ల అమ్మ ఏది చెబితే అది తూచా తప్పకుండా పాటిస్తారు. అమ్మ చెబితే.. వద్దని అననే అనరు. అమ్మ మీద ప్రేమతోనే ఆమెతో పాటు వెళ్లారు.
అంతా మంచిగనే ఉన్నాం. ఫ్యామిలీ అంతా ఓకే. 19 ఏళ్ల మా వైవాహిక జీవితం సాఫీగా సాగుతోంది. 14 నెలల క్రితం నేను దుబాయ్ వెళ్లాను. ఇండియాకు తిరిగొచ్చేమని నాతో ఎప్పుడూ చెప్పలేదు. నీ ఆరోగ్యం జాగ్రత్త, ఇక్కడ అంతా నేను చూసుకుంటాను అని చెప్పేది. నా భార్య అంటే నాకు దేవతతో సమానం. నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకునేది. మా పిల్లలకు వాళ్ల అమ్మతో ఎటాచ్‌మెంట్ ఎక్కువ, ఆమె లేకుండా ఉండలేరు. ప్రతి విషయం వాళ్ల అమ్మతో షేర్ చేసుకునేవారు. నేను లేకపోతే పిల్లల భవిష్యత్తు ఏమవుతుందని అనుకుందో ఏమో. మా అత్తయ్య వాళ్లతోనూ ఆమె ఏమీ చెప్పలేదు. ఇంట్లో బయటికి వెళుతున్నప్పడు.. 'ఈరోజు ఆఫీసు ఉండదు కదా' అని అత్తయ్య అడిగితే, పార్టీకి వెళుతున్నట్టు చెప్పింది. నార్మల్‌గానే ఉన్నట్టు కనబడడంతో ఎటువంటి అనుమానం కలగలేదు. నాకు తెలిసి ఆఫీసులో కూడా ఎటువంటి ఇబ్బందులు లేవ''ని సురేందర్ రెడ్డి చెప్పారు.
పార్కింగ్ స్లిప్ వెనకాల సూసైడ్ నోట్
అన్ని కోణాల్లోనూ దర్యాప్తు
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ విజయశాంతిరెడ్డి తన ఇద్దరు పిల్లలు చైతన్యారెడ్డి (18), విశాల్ రెడ్డి (17)తో కలిసి శనివారం తెల్లవారుజామున చర్లపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే ఆమె ఎందుకిలా చేశారనేది మిస్టరీగా మారింది. కుటుంబం, కెరీర్‌లోనూ ఎటువంటి ఇబ్బందులు లేవని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మానసికంగా కూడా ఆమె చాలా ధైర్యవంతురాలని, అలాంటి ఆమె ఎందుకు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మరోవైపు సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు సాగిస్తున్నారు. విజయశాంతిరెడ్డి సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌లో ఏమైనా సమాచారం దొరుకుతుందేమోనని ప్రయత్నిస్తున్నారు.


