ఇంటర్ చదివే ఇద్దరు పిల్లలతో సహా ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య
చర్లపల్లి–ఘట్‌కేసర్ స్టేషన్ల మధ్య ఘటన
రైల్వే ట్రాక్‌పై మృతదేహాలు
ఆత్మహత్యకు తెలియరాని కారణాలు
బతకడానికి ప్రయత్నించా... సాధ్యం కావడంలేదు
పార్క్ చేసిన కారులో ఓ సూసైడ్ నోటు గుర్తించిన రైల్వే పోలీసులు
సికింద్రాబాద్/బోడుప్పల్: కన్న తల్లి, కడుపున పుట్టిన ఇద్దరు పిల్లలు సహా ఒకరినొకరు హత్తుకుని వేగంగా వస్తున్న రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రాంతంలో కలకలం సృష్టించింది. శనివారం తెల్లవారు జామున చర్లపల్లి–ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య ఎంఎంటీఎస్ డౌన్ లైన్‌లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన తల్లి, ఇంటర్ చదువుతున్న పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవడం వెనుకగల కారణాలు ఇంకా తెలియరాలేదు.
జీఆర్‌పీ ఇన్‌స్పెక్టర్ బి.సాయీశ్వర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.... బోడుప్పల్ సమీపంలోని చెంగిచర్ల హరితవనం కాలనీలో పిన్నింటి సురేందర్ రెడ్డి కుటుంబం ఎనిమిదేళ్లుగా నివసిస్తోంది. సురేందర్ రెడ్డి దుబాయిలోని ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడే ఉంటున్న ఆయన ఏటా రెండు మూడు సార్లు భార్యా పిల్లల వద్దకు వచ్చి వెళ్తుంటాడు.
యాదాద్రి భువనగిరి జిల్లా గొల్లపల్లికి చెందిన సురేందర్ రెడ్డి బోడుప్పల్ హరితవనంలో సొంత ఇంటిని నిర్మించుకున్నాడు.అందులో నివసిస్తున్న తన భార్య పిన్నింటి విజయ అలియాస్ విజయశాంతి రెడ్డి (38) హైటెక్ సిటీలోని ఒక ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గ్రూప్ లీడర్‌గా ఉద్యోగం చేస్తోంది. కుమార్తె చైతన్య రెడ్డి(18) పటాన్ చెరులోని నారాయణ కాలేజీలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా, కుమారుడు విశాల్ రెడ్డి(17) అన్నోజిగూడలోని నారాయణ కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. వారిద్దరూ హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్నారు.
ఇంట్లో పూజలు నిర్వహించి...
భర్త దుబాయ్‌లో, పిల్లలు హాస్టల్‌లో ఉంటుండగా హరితవనంలోని సొంత ఇంటి మొదటి అంతస్తులో సురేందర్ రెడ్డి తల్లితో కలిసి విజయశాంతి రెడ్డి నివాసం ఉంటున్నారు. తన కుమార్తె చైతన్య రెడ్డికి జేఈఈ మెయిన్స్ పరీక్షలు ఉండడంతో గురువారం ఇంటికి తీసుకొచ్చింది. శుక్రవారం సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికి చేరుకున్న విజయశాంతి రెడ్డి ఫ్రెష్ అయి దేవుడికి పూజలు చేసింది.
అదే రోజు కొద్ది సేపటి తర్వాత తమ బంధువులు చనిపోయారని చెప్పి కాలేజీ నుంచి కుమారుడు విశాల్ రెడ్డిని కూడా తీసుకువచ్చింది. అనంతరం రాత్రి తన తల్లి పుష్పకు తమ ఆఫీసులో ఫంక్షన్ ఉందని, తనతోపాటు పిల్లలను కూడా తీసుకువెళ్తున్నట్లు చెప్పి వెళ్లిపోయింది. రాత్రి 11 గంటలకు కారు ఘట్‌కేసర్ రైల్వేస్టేషన్ పార్కింగ్‌కు చేరుకుంది. కొద్ది సమయం కారులోనే గడిపిన ముగ్గురు ఆ తర్వాత రైల్వేస్టేççషన్‌లోకి ప్రవేశించారు.
రైలుకు ఎదురుగా పరుగు...
శనివారం తెల్లవారు జామున 12.40 గంటల ప్రాంతంలో తల్లి ఇరువురు పిల్లలు ఒకరినొకరు గట్టిగా హత్తుకుని పట్టాలపై ప్రత్యక్షమయ్యారు. వారిని గుర్తించిన గూడ్స్ రైలు పైలట్ సుషౌన్ మహతో పలుమార్లు హారన్ చేసినా వారు పక్కకు తప్పుకోకపోగా రైలుకు ఎదురుగా పరుగు తీశారు. రైలు ఢీ కొట్టిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు.
లోకోపైలట్ వాకీటాకీ ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రైల్వే పట్టాల మధ్యలో తీవ్రగాయాలతో మృతి చెందిన మూడు మృతదేహాలను గుర్తించారు. మృతులు బోడుప్పల్ హరితవనం కాలనీకి చెందిన పిన్నింటి విజయ అలియాస్ విజయశాంతి రెడ్డి, కూతురు చైతన్య రెడ్డి, కుమారుడు విశాల్ రెడ్డిగా గుర్తించి మృతదేహాలను గాంధీ మార్చురీకి తరలించారు. గూడ్స్ రైలు లోకో పైలట్ సమాచారం ప్రకారం ఇది ఉద్దేశపూర్వకంగా చేసుకున్న ఆత్మహత్య ఘటనగా పోలీసులు నిర్ధారించారు.
కుటుంబ కలహాలు లేవు: భర్త సురేందర్ రెడ్డి
తమ కాపురంలో ఎటువంటి కలహాలు లేవని విజయశాంతి రెడ్డి భర్త సురేందర్ రెడ్డి రైల్వే పోలీసులకు తెలిపాడు. ఆత్మహత్య ఘటన అనంతరం పోలీసులు మొబైల్ ఫోన్ ద్వారా సురేందర్ రెడ్డిని సంప్రదించారు. అప్పటికే తనకు సమాచారం అందిందని తాను దుబాయ్ నుంచి ఇండియాకు బయలుదేరానని చెప్పాడు.
తమ కుటుంబంలో కలహాలు, ఆర్థిక సమస్యలు ఏవీ లేవని తన భార్యా పిల్లలు ఇంత దారుణానికి ఎందుకు పాల్పడ్డారో అర్థం కావడం లేదని ఆయన పోలీసులకు తెలిపాడు. మరోవైపు తన చెల్లికి ఎలాంటి సమస్యలు లేవు అని అన్న చిరంజీవి రెడ్డి వెల్లడించారు. తన బావ, తన చెల్లిది అనోన్యో దాంపత్యమని తెలిపాడు. ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలు లేవన్నాడు.
సారీ మేడం... ఇంకోసారి తప్పు చేయను
విజయశాంతి రెడ్డి హైటెక్ సిటీలోని ఒక కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి. అందులో పనిచేస్తున్న 15 మందికి గ్రూప్ లీడర్‌గా పనిచేస్తున్నట్టు పోలీసులు గుర్తించి ఆమె మొబైల్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. తన మొబైల్ ఫోన్‌లో ఒక నంబర్ నుంచి సారీ మేడం ఇంకోసారి తప్పు చేయను అని ఒక మెసేజ్, గుడ్ మార్నింగ్ మేడం అని మరో మెసేజ్ ఉన్నట్టు పోలీసులు గుర్తించి వారిని పీఎస్‌కు రప్పించి విచారించే ఏర్పాట్లు చేస్తున్నారు.
సీసీ కెమెరా ఫుటేజీలు గుర్తింపు...
కారు పార్కింగ్ ఫీజు చెల్లించాలని సిబ్బంది కోరగా స్టేషన్ లోపలికి వెళ్లి వెంటనే వస్తామని చెప్పి హడావుడిగా విజయశాంతి రెడ్డి తన ఇద్దరు పిల్లలతో స్టేషన్ లోపలికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. రైల్వే స్టేషన్లోకి వెళ్లిన వారు టికెట్ బుకింగ్ కౌంటర్ల వద్ద చాలా సేపు వేచి ఉన్నట్లుగా సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. టికెట్లు తీసుకునేందుకు ప్రయత్నించిన వారు తర్వాత టికెట్లు తీసుకోకుండానే ప్లాట్ ఫారం వైపు వెళ్లిపోయినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయింది.
నాతో పాటు పిల్లలు కూడా...
చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద విజయశాంతి పార్కు చేసిన కారులో పోలీసులు ఓ సూసైడ్ నోటు ఉన్నట్టు గుర్తించినట్టు తెలిసింది. కారు గేర్ బాక్సు పక్కనే ఒక చిన్న పేపరులో ఆమె చేతిరాతతో రాసినట్లుగా ఉన్న నోట్ లభించింది. ఆ నోట్లో ‘అమ్మా.... నేను బతకడానికి చాలా ప్రయత్నం చేశాను.. నా వల్ల సాధ్యం కావడం లేదు. అందుకే చనిపోవాలని నిర్ణయించుకున్నా... నాతో పాటే నా పిల్లలను కూడా తీసుకుపోతున్నా’అని ఆ నోట్లో రాసి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే కారు తాళాలు ఆమె కుమారుడి ప్యాంటు జేబులో పోలీసులకు లభించాయి. గాంధీ మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించిన పోలీసులు మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు.


