breaking news
Cherlapally Railway Station
-
వంద సీసీ కెమెరాల వడబోత
సికింద్రాబాద్: నాలుగు రోజులుగా రైల్వే పోలీసుల ఉరుకులు పరుగులు... పలువురి విచారణలు పూర్తిచేసినప్పటికీ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ పిన్నింటి విజయశాంతిరెడ్డి బలవన్మరణం ఘటన మిస్టరీ వీడలేదు. ఆమె ఎనిమిదేళ్లుగా నివసిస్తున్న కాలనీ, పనిచే స్తున్న కార్యాలయం, పిల్లలు చదువుతున్న విద్యా సంస్థల్లో సుమారు 200 మందిని కలిసి జీఆర్పీ పోలీసులు విచారించారు. తల్లీ పిల్లలను ఢీ కొట్టిన రైలు లోకోపైలట్‌ను కూడా విచారించారు. ఎక్కడా ఘటనకు సంబంధించిన వివరాలు రాలేదు.ఘటనకు కొద్దిరోజుల ముందు నుంచి ఆమె కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు రాబట్టే ప్రయత్నం చేసినప్పటికీ ఆశించిన సమాచారం రాబట్టలేక పోయారు. ఘటన రోజు ఆమె ఇంటి దగ్గరి నుంచి ఇరువురు పిల్లల కళాశాలలు తిరిగి చర్లపల్లి రైల్వేస్టేషన్ చేరుకునే వరకు 100 సీసీ కెమెరా పుటేజీలను తెప్పించి పరిశీలించారు. వాటన్నింటిలోనూ తల్లి వెళ్లడం.. ఇరువురు పిల్లలను తోడుకుని రావడం మినహా మరెవ్వ రితోనూ కలిసిన దాఖలాలు కనిపించలేదు.ఆ ఒక్క రోజుపైనే దృష్టంతా....గత నెల 27న కూతురు చైతన్యరెడ్డిని విజయశాంతిరెడ్డి (Vijayashanti Reddy) పటాన్చెరు హాస్టల్ నుంచి ఔటింగ్ తీసుకొచ్చారు. ఐఐటీ ప్రవేశ పరీక్ష రాసిన అనంతరం 29న తిరిగి హాస్టల్లో డ్రాప్ చేసి వచ్చారు. 30న రాత్రి 8 గంటల ప్రాంతంలో కుమారుడిని వెంట తీసుకుని మళ్లీ ఔటింగ్ కావాలని చైతన్యరెడ్డి హాస్టల్‌కు వెళ్లారు. ఒక్క రోజులోనే మళ్లీ ఔటింగ్ ఎందుకని హాస్టల్ నిర్వాహకులు ప్రశ్నించగా.. బంధువు చనిపోయారని చెప్పారు. ఆ తరువాత ఇద్దరు పిల్లలతో కలిసి విజయ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.కొద్ది రోజులు ముందే బలవన్మరణం నిర్ణయం తీసుకుని ఉంటే కూతురిని ఐఐటీ పరీక్ష (IIT Exam) అనంతరం తిరిగి హాస్టల్లో డ్రాప్ చేసేవారు కాదని పోలీసులు భావిస్తున్నారు. ఒక్కరోజులోనే పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలన్న నిర్ణయం వెనుక కారణాలు ఏంటన్న విషయాలు విచారణలో తేలడం లేదు. కుటుంబ సమస్యలు, ఆస్తి తగాదాల కోణంలోనూ బలమైన అంశాలేవీ కానరావడం లేదు.అందుకే పిల్లలు ఆమె వెంట వెళ్లారు: విజయశాంతిరెడ్డి భర్తఆత్మహత్యల సమయంలో భర్త సురేందర్‌రెడ్డి (Surendar Reddy) దుబాయ్‌లో ఉన్నందున ఆయన పాత్ర ఉండక పోవచ్చని భావిస్తున్నారు. అయినప్పటికీ దశదిన కర్మ అనంతరం సురేందర్‌రెడ్డి ద్వారా కొన్ని సందేహాలను నివృత్తి చేసుకునేందుకు పోలీసులు సమాయత్తం అవుతున్నారు. ఒకటి, రెండు రోజుల్లో ఆమె మొబైల్, ల్యాప్‌టాప్‌కు సంబంధించిన ఫోరెన్సిక్ నివేదిక అందితే ఏదైనా క్లూ దొరుకుతుందని భావిస్తున్నారు. జీఆర్పీ ఇన్స్పెక్టర్ సాయీశ్వర్‌గౌడ్ నేతృత్వంలోని బృందం గురువారం చెంగిచెర్లలోని విజయశాంతి నివాసంలో సోదాలు చేసేందుకు వెళ్లనుంది. -
అందుకే పిల్లలు వెళ్లారు: విజయశాంతి రెడ్డి భర్త
సాక్షి, హైదరాబాద్: తన భార్య చాలా ధైర్యవంతురాలని, ఎందుకు బలవస్మరణానికి పాల్పడిందో అర్థం కావడం లేదని స్టాఫ్ట్వేర్ ఇంజినీర్ విజయశాంతి రెడ్డి భర్త సురేందర్ రెడ్డి అన్నారు. తమ ఇద్దరి పిల్లలతో కలిసి భార్య ఆత్మహత్య చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని ఆయన చెప్పారు. బోడుప్పల్‌లోని తమ నివాసంలో మంగళవారం ఆయన సాక్షి టీవీతో మాట్లాడారు. ఒంటరితనంగా అనిపిస్తున్నట్టు తన భార్య ఎప్పుడూ చెప్పలేదన్నారు. తమ కుటుంబంలో ఎటువంటి సమస్యలు లేవని, ఆమె పనిచేసే చోట కూడా ఇబ్బందులు లేవని వెల్లడించారు. అసలు ఆమెకు ఒంటరితనం ఫీలయ్యేంత సమయం లేదని.. ఉద్యోగం, కుటుంబంతోనే సరిపోయేదని చెప్పారు. సెలవు రోజుల్లో పిల్లలకు దగ్గరకు వెళ్లేదని.. ఒక వారం అబ్బాయి దగ్గరకు, మరో వారం అమ్మాయి దగ్గరికి వెళ్లేదన్నారు. ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే తనతో చెప్పాల్సిందని, ఏదోలా పరిష్కరించుకునే వాళ్లమని అన్నారు. ''అసలు ఏం జరిగిందో నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. ఇలా ఎందుకు చేశారో తెలియడం లేదు. మైండ్ మొత్తం బ్లాకే ఉంది. మా మధ్య ఎటువంటి దాపరికాలు లేవు. అన్ని విషయాలు షేర్ చేసుకుంటాం. కుటుంబ సభ్యులందరితోనూ బాగానే మాట్లాడుతుంది. ఒంటరిగా ఉండేంత సందర్బాలు లేవు. జనవరి 29 నాడు నాతో చివరిసారిగా ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా నార్మల్‌గానే మాట్లాడింది. పిల్లల భవిష్యత్తు గురించి ఇద్దరం మాట్లాడుకున్నాం. పిల్లలు నాకంటే వాళ్ల అమ్మతో బాగా క్లోజ్‌గా ఉంటారు. వాళ్ల అమ్మ ఏది చెబితే అది తూచా తప్పకుండా పాటిస్తారు. అమ్మ చెబితే.. వద్దని అననే అనరు. అమ్మ మీద ప్రేమతోనే ఆమెతో పాటు వెళ్లారు.అంతా మంచిగనే ఉన్నాం. ఫ్యామిలీ అంతా ఓకే. 19 ఏళ్ల మా వైవాహిక జీవితం సాఫీగా సాగుతోంది. 14 నెలల క్రితం నేను దుబాయ్ వెళ్లాను. ఇండియాకు తిరిగొచ్చేమని నాతో ఎప్పుడూ చెప్పలేదు. నీ ఆరోగ్యం జాగ్రత్త, ఇక్కడ అంతా నేను చూసుకుంటాను అని చెప్పేది. నా భార్య అంటే నాకు దేవతతో సమానం. నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకునేది. మా పిల్లలకు వాళ్ల అమ్మతో ఎటాచ్మెంట్ ఎక్కువ, ఆమె లేకుండా ఉండలేరు. ప్రతి విషయం వాళ్ల అమ్మతో షేర్ చేసుకునేవారు. నేను లేకపోతే పిల్లల భవిష్యత్తు ఏమవుతుందని అనుకుందో ఏమో. మా అత్తయ్య వాళ్లతోనూ ఆమె ఏమీ చెప్పలేదు. ఇంట్లో బయటికి వెళుతున్నప్పడు.. 'ఈరోజు ఆఫీసు ఉండదు కదా' అని అత్తయ్య అడిగితే, పార్టీకి వెళుతున్నట్టు చెప్పింది. నార్మల్‌గానే ఉన్నట్టు కనబడడంతో ఎటువంటి అనుమానం కలగలేదు. నాకు తెలిసి ఆఫీసులో కూడా ఎటువంటి ఇబ్బందులు లేవ''ని సురేందర్ రెడ్డి చెప్పారు. పార్కింగ్ స్లిప్ వెనకాల సూసైడ్ నోట్అన్ని కోణాల్లోనూ దర్యాప్తుసాఫ్ట్వేర్ ఇంజినీర్ విజయశాంతిరెడ్డి తన ఇద్దరు పిల్లలు చైతన్యారెడ్డి (18), విశాల్ రెడ్డి (17)తో కలిసి శనివారం తెల్లవారుజామున చర్లపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే ఆమె ఎందుకిలా చేశారనేది మిస్టరీగా మారింది. కుటుంబం, కెరీర్లోనూ ఎటువంటి ఇబ్బందులు లేవని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మానసికంగా కూడా ఆమె చాలా ధైర్యవంతురాలని, అలాంటి ఆమె ఎందుకు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మరోవైపు సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు సాగిస్తున్నారు. విజయశాంతిరెడ్డి సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌లో ఏమైనా సమాచారం దొరుకుతుందేమోనని ప్రయత్నిస్తున్నారు. -
మొబైల్, ల్యాప్‌టాప్‌ల పైనే ఆశలన్నీ!
ఆమె.. ఆత్మహత్య చేసుకునేంత బలహీనురాలు కాదు.. ఆర్థిక సమస్యలు లేవు. కుటుంబ సమస్యలూ లేవు. ఐటీ కంపెనీలో 15 మందికి దిశానిర్దేశం చేసే స్థాయి ఆమెది.. మరి ఎందుకు పిల్లలతో సహా బలవన్మరణానికి పాల్పడింది? అనేది సికింద్రాబాద్ రైల్వే పోలీసుల మెదళ్లను తొలుస్తున్న మిలియన్ డాలర్ల ప్రశ్న ఇది.చర్లపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో జరిగిన బలవన్మరణాల మిస్టరీ క్లూ ఇంతవరకు లభించలేదు. సాఫ్ట్వేర్ ఇంజినీర్ విజయారెడ్డి (37), ఆమె ఇద్దరు పిల్లలు చైతన్యారెడ్డి∙(18), విశాల్‌రెడ్డి (17)లు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. విజయశాంతిరెడ్డి తల్లి మొదలు ఇరువైపులా కుటుంబ సభ్యులు ఒకవైపు, ఆమె పనిచేస్తున్న కంపెనీ ఉద్యోగులు మరోవైపు.. చివరకు ఆమె పిల్లలు చదువుతున్న కళాశాలల్లోని కరస్పాండెంట్లు, క్లాస్ టీచర్లను ఇంకోవైపు.. పోలీసులు ఎవరిని విచారించినా ఒకే మాట. 'విజయశాంతిరెడ్డి స్ట్రాంగ్ విమెన్'. కారులో లభించిన సూసైడ్ నోట్ ఆధారంగా ఆమె ఆత్మహత్య నిర్ణయం సొంతంగానే తీసుకున్నట్టు నిర్థారణ అవుతున్నప్పటికీ కారణం ఏంటన్న కోణంలో చేస్తున్న దర్యాప్తుకు తెరపడడం లేదు. దుబాయి నుంచి వచ్చి భార్య పిల్లల అంత్యక్రియలకు హాజరైన భర్త సురేందర్‌రెడ్డి కూడా అదే విషయం చెబుతున్నారు. భర్త సురేందర్‌రెడ్డిని మరికొన్ని ప్రశ్నలు అడిగి తమ సందేహాలు నివృత్తి చేసుకోవాలని పోలీసులు భావించినప్పటికీ దశదిన కర్మ తరువాత మాత్రమే కలిసి వివరాలు రాబట్టాలని వారు భావిస్తున్నారు. ‘డిప్రెషన్ ’ దిశగా దర్యాప్తు ఒంటరి తనంతోనే డిప్రెషన్‌కులోనై ఆత్మహత్య నిర్ణయం తీసుకుంని ఉంటుందా అనే కోణంలోదర్యాప్తు చేస్తున్నా ఆధారాలు లభించడం లేదు. తన కూతురు ఎప్పుడూ ఒంటరితనంతో బాధపడిన సందర్భాలు లేవని మృతురాలి తల్లి పోలీసులకు తెలిపింది. వారంలో రెండు రోజులు మాత్రమే ఆఫీసుకు వెళ్లేదని, మిగతా ఐదు రోజులు ఇంటి దగ్గర నుంచే పనిచేసేదని తెలిపింది. ఆమె ముఖంలో డిప్రెషన్ వంటి ఆనవాళ్లు కనిపించలేదని పేర్కొంది. సైబర్ నిపుణులపైనే ఆశ విజయశాంతిరెడ్డి (Vijayashanti Reddy) వాడిన ఫోన్,ల్యాప్‌టాప్ పైనే పోలీసులు ఆశలు పెట్టుకున్నారు. అందుకే ఆ రెండింటినీ సైబర్ క్రైం విభాగానికి పంపించారు. అందులోని వివరాలు బయటపడితే మాత్రమే కేసు దర్యాప్తు ముందుకు సాగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఈ వివరాలు ఒకటి, రెండు రోజుల్లోవచ్చే అవకాశముంది. చదవండి: పార్కింగ్ స్లిప్ వెనకాల సూసైడ్ నోట్ -
పార్కింగ్ స్లిప్ వెనకాల సూసైడ్ నోట్
సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ విజయశాంతిరెడ్డి బలన్మవరణం కేసులో వాస్తవాలు తెలుసుకునేందుకు సికింద్రాబాద్ రైల్వే పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు సాగిస్తున్నారు. తన పిల్లలిద్దరితో కలిసి శనివారం తెల్లవారుజామున చర్లపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు కింద పడి ఆమె బలన్మవరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. అయితే ఆమె ఎందుకు ఇలాంటి ఘాతుకానికి పాల్పడ్డారనే దాని గురించి ఇంకా వెల్లడి కాలేదు. దీంతో విజయశాంతిరెడ్డి మొబైల్ ఫోన్‌ను సైబర్ క్రైం పోలీసులకు పంపించారు. అందులోని సమాచారం బయటకు వస్తే కారణం తెలిసే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు.ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని రైల్వే డీఎస్పీ జావిద్ సోమవారం సాక్షి టీవీతో చెప్పారు. ''ఇలాంటి ఘటన జరగటం బాధాకరం. విజయశాంతి రెడ్డి తన ఇద్దరు పిల్లలని తీసుకుని జనవరి 30 అర్ధరాత్రి చర్లపల్లి రైల్వేస్టేషన్‌కు వచ్చారు. స్టేషన్‌కు వచ్చిన తర్వాత కొంతసేపు అటు ఇటు తిరిగారు. కుటుంబ సభ్యులతో గొడవలు ఏమి లేవనీ తెలుస్తుంది. ఏదో బలమైన కారణంతోనే ఆమె బలన్మవరణానికి పాల్పడి ఉంటారు. పార్కింగ్ స్లిప్ వెనకాల రాసిన సూసైడ్ నోట్ ఆమె కారులో మాకు దొరికింది. 28వ తేదీన విజయశాంతి రెడ్డి- సురేందర్ రెడ్డిల పెళ్లి రోజు అని తెలిసింది. 31 తేదీ సురేందర్ రెడ్డి పుట్టిన రోజు అని తెలిసింది. మరింత లోతుగా విచారణ చేస్తున్నామ''ని రైల్వే డీఎస్పీ జావిద్ తెలిపారు.ప్లీజ్.. చనిపోవద్దు మంచి ఉద్యోగం, కుటుంబం ఉన్న విజయశాంతి రెడ్డి (Vijayashanti Reddy) ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డారనే దానిపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. తనతో పాటు పిల్లల ప్రాణాలు తీయడాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు. చదువుని, ఉద్యోగం చేస్తున్న ఆమె ఇలా చేయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని వాదిస్తున్నారు. ఎన్ని సమస్యలు వచ్చినా తట్టుకుని నిలబడాలని, కనీసం పిల్లల కోసమైనా ఆలోచించాల్సిందని అంటున్నారు. అయితే ఒంటరితనం కారణంగా ఆమె ఎంతో బాధ అనుభవించి ఉండొచ్చని, ఎవరికి చెప్పుకోలేక ఇలాంటి నిర్ణయానికి ఉండొచ్చని కొంతమంది పేర్కొన్నారు. ఏదేమైనా బతికి సాధించాలని, చావుతో సమస్యలు పరిష్కారం కావని నెటిజనులు కామెంట్ చేస్తున్నారు.సూసైడ్‌నోట్ ఏం రాశారంటే..? -
అమ్మ ఎందుకలా చేసిందో..!
హైదరాబాద్: చర్లపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో శనివారం తెల్లవారుజామున ఇంటర్ చదివే కుమారుడు, కూతురుతో కలిసి ఆ తల్లి రైలుకింద పడి బలవన్మరణం చేసుకుంది. ఈ కేసు విచారణ సందర్భంగా పోలీసులకు ఇప్పటి వరకు ఎటువంటి క్లూ లభించలేదు. సాఫ్ట్వేర్ ఇంజినీర్ విజయశాంతిరెడ్డి బలవన్మరణం కేసు మిస్టరీ ఆదివారం రాత్రి వరకు వీడలేదు. ఈ ఘటనకు సంబంధించి సికింద్రాబాద్ రైల్వే పోలీసులు గంటల కొద్దీ ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి సెల్‌ఫోన్ సందేశాలలో పోలీసులకు రెండు అనుమానాస్పద సందేశాలు లభించాయి. ఈ రెండు సందేశాలను పంపించిన ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులను రైల్వే పోలీసు లు సికింద్రాబాద్ రప్పించి విచారించారు. ఒకరు సారీ మేడం ఇటువంటి తప్పు మరోమారు జరగదు అని, మరోకరు మేడం గుడ్‌మార్నింగ్ అని సందేశాలు పంపించారు. ఇవి రెండు సందేశాలు కార్యాలయ సమాచార నిమిత్తం పంపినవని పోలీసులు తమ విచారణలో ధృవీకరించుకున్నారు. సహచరులను పోలీసులు సంప్రదించినా విజయశాంతిరెడ్డి తన కార్యాలయంలో చురుకుగా ఉండే తీరును మాత్రమే పోలీసులకు వివరించారు. ఎప్పుడూ తను ఆందోళన చెందుతున్నట్టు కానీ... భయపడుతున్నట్టు కానీ కనిపించేది కాదని చెబుతున్నట్టు జీఆర్పీ ఇన్స్సెక్టర్ జీ.సాయీశ్వర్‌గౌడ్ తెలిపారు. ఇదిలా ఉండగా మృతురాలి పుట్టింటివారు, మెట్టింటికి చెందిన పలువురు సమీప బంధువులను కూడా పోలీసులు విచారించారు. వారి నుంచి కూడా పోలీసులు ఆశించిన సమాచారం అభించలేదు. సురేందర్‌రెడ్డి, విజయశాంతిరెడ్డి దంపతులది ఆదర్శవంతమైన జీవనమని బంధువులు చెప్పినట్టు పోలీసులు పేర్కొంటున్నారు. వారికి కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు లేవని స్పష్టం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్న విజయశాంతిరెడ్డి పిల్లలతో పాటు ఆత్మహత్య చేసుకునేంతటి పరిస్థితులు ఏమై ఉంటాయన్న కోణంలో పోలీసులు దర్మాప్తు ముమ్మరం చేశారు. విజయశాంతిరెడ్డి మొబైల్ ఫోన్‌ను సైబర్ క్రైం పోలీసులకు పంపించినట్టు జీఆర్పీ పోలీసులు తెలిపారు. వారం రోజుల్లో ఈ వివరాలు వచ్చే అవకాశముంది. డేటా వస్తే దర్యాప్తు ముందుకు సాగే అవకాశం ఉన్నట్టు వారు చెప్పారు. -
ఒకరినొకరు హత్తుకొని.. రైలుకు ఎదురెళ్లి..
సికింద్రాబాద్/బోడుప్పల్: కన్న తల్లి, కడుపున పుట్టిన ఇద్దరు పిల్లలు సహా ఒకరినొకరు హత్తుకుని వేగంగా వస్తున్న రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రాంతంలో కలకలం సృష్టించింది. శనివారం తెల్లవారు జామున చర్లపల్లి–ఘట్కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య ఎంఎంటీఎస్ డౌన్ లైన్లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన తల్లి, ఇంటర్ చదువుతున్న పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవడం వెనుకగల కారణాలు ఇంకా తెలియరాలేదు. జీఆర్పీ ఇన్స్పెక్టర్ బి.సాయీశ్వర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.... బోడుప్పల్ సమీపంలోని చెంగిచర్ల హరితవనం కాలనీలో పిన్నింటి సురేందర్ రెడ్డి కుటుంబం ఎనిమిదేళ్లుగా నివసిస్తోంది. సురేందర్ రెడ్డి దుబాయిలోని ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడే ఉంటున్న ఆయన ఏటా రెండు మూడు సార్లు భార్యా పిల్లల వద్దకు వచ్చి వెళ్తుంటాడు. యాదాద్రి భువనగిరి జిల్లా గొల్లపల్లికి చెందిన సురేందర్ రెడ్డి బోడుప్పల్ హరితవనంలో సొంత ఇంటిని నిర్మించుకున్నాడు. అందులో నివసిస్తున్న తన భార్య పిన్నింటి విజయ అలియాస్ విజయశాంతి రెడ్డి (38) హైటెక్ సిటీలోని ఒక ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గ్రూప్ లీడర్‌గా ఉద్యోగం చేస్తోంది. కుమార్తె చైతన్య రెడ్డి(18) పటాన్ చెరులోని నారాయణ కాలేజీలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా, కుమారుడు విశాల్ రెడ్డి(17) అన్నోజిగూడలోని నారాయణ కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. వారిద్దరూ హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు. ఇంట్లో పూజలు నిర్వహించి...భర్త దుబాయ్‌లో, పిల్లలు హాస్టల్లో ఉంటుండగా హరితవనంలోని సొంత ఇంటి మొదటి అంతస్తులో సురేందర్ రెడ్డి తల్లితో కలిసి విజయశాంతి రెడ్డి (Vijayashanti Reddy) నివాసం ఉంటున్నారు. తన కుమార్తె చైతన్య రెడ్డికి జేఈఈ మెయిన్స్ పరీక్షలు ఉండడంతో గురువారం ఇంటికి తీసుకొచ్చింది. శుక్రవారం సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికి చేరుకున్న విజయశాంతి రెడ్డి ఫ్రెష్ అయి దేవుడికి పూజలు చేసింది. అదే రోజు కొద్ది సేపటి తర్వాత తమ బంధువులు చనిపోయారని చెప్పి కాలేజీ నుంచి కుమారుడు విశాల్ రెడ్డిని కూడా తీసుకువచ్చింది. అనంతరం రాత్రి తన తల్లి పుష్పకు తమ ఆఫీసులో ఫంక్షన్ ఉందని, తనతోపాటు పిల్లలను కూడా తీసుకువెళ్తున్నట్లు చెప్పి వెళ్లిపోయింది. రాత్రి 11 గంటలకు కారు ఘట్కేసర్ రైల్వేస్టేషన్ పార్కింగ్‌కు చేరుకుంది. కొద్ది సమయం కారులోనే గడిపిన ముగ్గురు ఆ తర్వాత రైల్వేస్టేççషన్‌లోకి ప్రవేశించారు. రైలుకు ఎదురుగా పరుగు...శనివారం తెల్లవారు జామున 12.40 గంటల ప్రాంతంలో తల్లి ఇరువురు పిల్లలు ఒకరినొకరు గట్టిగా హత్తుకుని పట్టాలపై ప్రత్యక్షమయ్యారు. వారిని గుర్తించిన గూడ్స్ రైలు పైలట్ సుషౌన్ మహతో పలుమార్లు హారన్ చేసినా వారు పక్కకు తప్పుకోకపోగా రైలుకు ఎదురుగా పరుగు తీశారు. రైలు ఢీ కొట్టిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. లోకోపైలట్ వాకీటాకీ ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రైల్వే పట్టాల మధ్యలో తీవ్రగాయాలతో మృతి చెందిన మూడు మృతదేహాలను గుర్తించారు. మృతులు బోడుప్పల్ హరితవనం కాలనీకి చెందిన పిన్నింటి విజయ అలియాస్ విజయశాంతి రెడ్డి, కూతురు చైతన్య రెడ్డి, కుమారుడు విశాల్ రెడ్డిగా గుర్తించి మృతదేహాలను గాంధీ మార్చురీకి తరలించారు. గూడ్స్ రైలు లోకో పైలట్ సమాచారం ప్రకారం ఇది ఉద్దేశపూర్వకంగా చేసుకున్న ఆత్మహత్య ఘటనగా పోలీసులు నిర్ధారించారు. కుటుంబ కలహాలు లేవు: భర్త సురేందర్ రెడ్డితమ కాపురంలో ఎటువంటి కలహాలు లేవని విజయశాంతి రెడ్డి భర్త సురేందర్ రెడ్డి రైల్వే పోలీసులకు తెలిపాడు. ఆత్మహత్య ఘటన అనంతరం పోలీసులు మొబైల్ ఫోన్ ద్వారా సురేందర్ రెడ్డిని సంప్రదించారు. అప్పటికే తనకు సమాచారం అందిందని తాను దుబాయ్ నుంచి ఇండియాకు బయలుదేరానని చెప్పాడు. తమ కుటుంబంలో కలహాలు, ఆర్థిక సమస్యలు ఏవీ లేవని తన భార్యా పిల్లలు ఇంత దారుణానికి ఎందుకు పాల్పడ్డారో అర్థం కావడం లేదని ఆయన పోలీసులకు తెలిపాడు. మరోవైపు తన చెల్లికి ఎలాంటి సమస్యలు లేవు అని అన్న చిరంజీవి రెడ్డి వెల్లడించారు. తన బావ, తన చెల్లిది అనోన్యో దాంపత్యమని తెలిపాడు. ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలు లేవన్నాడు.సారీ మేడం... ఇంకోసారి తప్పు చేయను విజయశాంతి రెడ్డి హైటెక్ సిటీలోని ఒక కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి. అందులో పనిచేస్తున్న 15 మందికి గ్రూప్ లీడర్‌గా పనిచేస్తున్నట్టు పోలీసులు గుర్తించి ఆమె మొబైల్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. తన మొబైల్ ఫోన్లో ఒక నంబర్ నుంచి సారీ మేడం ఇంకోసారి తప్పు చేయను అని ఒక మెసేజ్, గుడ్ మార్నింగ్ మేడం అని మరో మెసేజ్ ఉన్నట్టు పోలీసులు గుర్తించి వారిని పీఎస్‌కు రప్పించి విచారించే ఏర్పాట్లు చేస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజీలు గుర్తింపు...కారు పార్కింగ్ ఫీజు చెల్లించాలని సిబ్బంది కోరగా స్టేషన్ లోపలికి వెళ్లి వెంటనే వస్తామని చెప్పి హడావుడిగా విజయశాంతి రెడ్డి తన ఇద్దరు పిల్లలతో స్టేషన్ లోపలికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. రైల్వే స్టేషన్లోకి వెళ్లిన వారు టికెట్ బుకింగ్ కౌంటర్ల వద్ద చాలా సేపు వేచి ఉన్నట్లుగా సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. టికెట్లు తీసుకునేందుకు ప్రయత్నించిన వారు తర్వాత టికెట్లు తీసుకోకుండానే ప్లాట్ ఫారం వైపు వెళ్లిపోయినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. నాతో పాటు పిల్లలు కూడా... చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద విజయశాంతి పార్కు చేసిన కారులో పోలీసులు ఓ సూసైడ్ నోటు ఉన్నట్టు గుర్తించినట్టు తెలిసింది. కారు గేర్ బాక్సు పక్కనే ఒక చిన్న పేపరులో ఆమె చేతిరాతతో రాసినట్లుగా ఉన్న నోట్ లభించింది. ఆ నోట్లో ‘అమ్మా.... నేను బతకడానికి చాలా ప్రయత్నం చేశాను.. నా వల్ల సాధ్యం కావడం లేదు. అందుకే చనిపోవాలని నిర్ణయించుకున్నా... నాతో పాటే నా పిల్లలను కూడా తీసుకుపోతున్నా’ అని ఆ నోట్లో రాసి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే కారు తాళాలు ఆమె కుమారుడి ప్యాంటు జేబులో పోలీసులకు లభించాయి. గాంధీ మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించిన పోలీసులు మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
అభివృద్ధి చర్యలు కావాలి, పేర్ల మార్పిడితో ఒరిగేదేమిటి?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో మాట్లాడుతూ తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు తొలగించి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు, అలాగే 55 సంవత్స రాల నుంచి ఉన్న బల్కంపేట ‘గాంధీ ప్రకృతి వైద్యశాల’కు మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య పేరు పెట్టడానికి శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించారు. వైశ్యులకు ప్రాధాన్యం తగ్గకుండా కొత్తగా చర్లపల్లిలో నిర్మించిన రైల్వే టెర్మినల్‌కు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ‘అమరజీవి పొట్టి శ్రీరాములు టెర్మినల్’గా నామకరణం చేయాలని ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వానికి పంపుతున్నట్టు ప్రకటించారు.అమరజీవి పొట్టి శ్రీరాములు వైశ్యుల ప్రతినిధి కాదు. ఆయనను కులం గాటికి కట్టకూడదు. ఆయన విశ్వమానవుడు. ప్రకృతి వైద్యం అంటే గాంధీ అనీ, గాంధీ అంటే ప్రకృతి వైద్యం అనే భావన చాలామంది మదిలో ఉంది. అటువంటి జాతిపిత పేరు తీసి రోశయ్య పేరు పెట్టడం సముచితం కాదు. 55 సంవత్సరాల కిందట ఏర్పాటు చేసిన గాంధీ నేచర్ క్యూర్ హాస్పిటల్, కళాశాల ఏమాత్రం పురోగతి లేకుండా ఉంది. అప్పుడు మొదలుపెట్టిన బిఎన్‌వైఎస్ కోర్సు తప్ప కొత్తగా పెట్టిన డిప్లొమా, పీజీ కోర్సులు ఏవీ లేవు. ఈ ఆస్పత్రి ఎప్పుడూ పేషంట్స్ తాకిడితో రద్దీగా ఉంటుంది. అయితే తొంభై శాతం డాక్టర్లు, సహాయ సిబ్బంది పదవీ విరమణ చేయడంతో ఔట్ సోర్సింగ్ స్టాఫ్‌తో ఆస్పత్రి నడుస్తోంది. సిబ్బంది నియామకం, పరిశోధనను పోత్సహించడం, పీజీ కోర్సును ఏర్పాటు చేయడం వంటి అభివృద్ధికరమైన చర్యలు తీసుకోవాల్సింది పోయి... పేర్ల మార్పు వ్యవహారాన్ని తెర మీదకు తీసుకు రావడం సరైనదేనా అనేది ప్రభుత్వం ఆలోచించాలి. చదవండి: సునీతా త్వరలో ఇండియాకు వస్తారు.. సమోసా పార్టీ కూడా!గాంధీ నేచర్ క్యూర్ ఆస్పత్రికి తోడు జిల్లా స్థాయి ప్రకృతి వైద్యశాలలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వం ఈ యాంత్రిక ప్రపంచంలో ప్రజలకు సహజ (ప్రకృతి) వైద్యాన్ని అందుబాటులోకి తెస్తుందని ఆశించడం అత్యాశ కాబోదు. ప్రస్తుతం పేర్ల మార్పిడి తతంగాన్ని అలా వదిలేసి కొత్తగా చేపట్టే ప్రాజెక్టులకూ, సంస్థలకూ ఇప్పుడు నామకరణం చేయాలనుకున్న పేర్లను పెట్టవచ్చు. – డా.యం. అఖిల మిత్ర, ప్రకృతి వైద్యులు -
సంక్రాంతి రద్దీ.. ప్రయాణికులకు చుక్కలే!
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి రద్దీ మొదలైంది. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో నగర వాసులు సొంత ఊళ్లకు తరలివెళ్తున్నారు. నగరం నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే అన్ని రెగ్యులర్ రైళ్లలో రిజర్వేషన్లు పూర్తిగా నిలిచిపోయి రిగ్రేట్ దశకు చేరాయి. కొత్తగా అందుబాటులోకి వచ్చిన చర్లపల్లి టెర్మినల్ నుంచి కాకినాడ, తిరుపతి, విశాఖ, విజయవాడ తదితర ప్రాంతాలకు కొన్ని ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. లక్షలాది మంది నగరవాసులు సొంత ఊళ్లకు తరలి వెళ్తుండగా.. అరకొరగా ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లు ఏ మాత్రం ప్రయాణికుల డిమాండ్లను భర్తీ చేయడం లేదు. మరోవైపు అన్ని ప్రత్యేక రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడుస్తూ ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు అతికష్టంగా బెర్తులు సంపాదించి రైలెక్కినా గంటల తరబడి పట్టాలపైనే పడిగాపులు కాయాల్సి వస్తోంది. సికింద్రాబాద్ నుంచి సాయంత్రం 6 గంటలకు బయలుదేరితే మరుసటి రోజు మధ్యాహ్నం 12 దాటినా విశాఖకు చేరుకోలేకపోయామని కూకట్‌పల్లికి చెందిన కృష్ణారావు విస్మయం వ్యక్తం చేశారు. మరోవైపు నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి శబరిమలకు నడిచే రైళ్లు కూడా అయ్యప్ప భక్తులకు నరకం చూపుతున్నాయి. రెండు రోజులు గడిచినా హైదరాబాద్ నుంచి శబరిమలకు, తిరిగి అక్కడి నుంచి ఇక్కడికి చేరుకోలేకపోతున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చార్జీలు కూడా ‘ప్రత్యేకమే’.. ⇒నగరం నుంచి ప్రతి రోజు సుమారు వందకు పైగా రెగ్యులర్ రైళ్లు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తాయి. సుమారు 2.5 లక్షల మంది ప్రయాణం చేస్తారు. ప్రస్తుతం రోజుకు మరో 50 వేల మంది అదనంగా బయలుదేరే అవకాశం ఉంది. ఈ డిమాండ్ మేరకు అదనపు రైళ్లు లేవు. కొన్ని రైళ్లలో బెర్తులు, అదనపు బోగీలు ఏర్పాటు చేశారు. డిమాండ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు మాత్రం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. కానీ ఈ రైళ్లలో చార్జీలు కూడా ఎక్కువే. సాధారణ చార్జీలపై 25 శాతం వరకు అదనపు చార్జీలు విధిస్తారు. అయినప్పటికీ మరో గత్యంతరం లేక ప్రత్యేక రైళ్లను ఆశ్రయించే ప్రయాణికులకు రైళ్లలో పడిగాపులు తప్పడం లేదు. ⇒ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పట్టాలపై రైళ్ల ఒత్తిడి పెరిగిందని, దీంతో సకాలంలో సిగ్నల్స్ లభించకపోవడం వల్ల జాప్యం చోటుచేసుకుంటోందని అధికారులు చెబుతున్నారు. కానీ ఈ ఆలస్యం ప్రయాణికుల పండగ సంతోషాన్ని ఆవిరి చేస్తోంది. కనిష్టంగా 3 నుంచి గరిష్టంగా 12 గంటల వరకు కొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. గతంలో ఇలాంటి ఫిర్యాదులు పెద్ద ఎత్తున వెల్లువెత్తినప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. సంక్రాంతి సందర్భంగా బయలుదేరిన ప్రయాణికులు భోగి పండగ రోజు కూడా సొంత ఊళ్లకు చేరుకోలేకపోయారు. ప్రస్తుతం మరోసారి అదే పరిస్థితి నెలకొందని పేర్కొంటున్నారు. ఆర్టీసీ సైతం అదే బాటలో.. ఆర్టీసీ సైతం ప్రత్యేక బస్సుల పేరిట 50 శాతం అదనపు దోపిడీకి దిగింది. ఏపీతో పాటు, తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో కూడా 25 శాతం నుంచి 50 శాతం వరకు అదనపు వసూళ్లకు పాల్పడుతోంది. చివరకు దివ్యాంగుల పాస్‌లను అనుమతించకుండా ఇష్టారాజ్యంగా చార్జీలు విధిస్తున్నారని ప్రయాణికులు చెబుతున్నారు. సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకొని సుమారు 6 వేలకు పైగా అదనపు బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. రెండు రోజులుగా ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఎల్బీనగర్, ఉప్పల్, హయత్‌నగర్, ఎంజీబీఎస్, జేబీఎస్ తదితర ప్రాంగణాలుప్రయాణికులతో సందడిగా మారాయి.ప్రైవేట్ బస్సుల దోపిడీ.. సంక్రాంతి రద్దీని సొమ్ము చేసుకొనేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ అడ్డగోలుగా దారి దోపిడీకి పాల్పడుతున్నాయి. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి విశాఖకు లగ్జరీ రూ.1800 వరకు ఉంటుంది. ఇప్పుడు ఆ చార్జీ రూ.3000 వరకు చేరింది. అలాగే ఏసీ బస్సుల్లో రూ.2500 నుంచి ఏకంగా రూ.5000 వరకు పెరిగినట్లు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటిల్లిపాదీ కలిసి వెళితే చార్జీల కోసమే రూ.వేలల్లో ఖర్చు చేయాల్సి వస్తోందని ఏఎస్రావు నగర్‌కు చెందిన మల్లికార్జున్‌రావు చెప్పారు. అలాగే.. హైదరాబాద్ నుంచి కాకినాడ, విజయవాడ, తిరుపతి తదితర ప్రాంతాలకు సైతం ప్రైవేట్ బస్సుల దోపిడీ విమాన చార్జీలను తలపిస్తోంది.సాక్షి ఎఫెక్ట్.. బస్సులు సీజ్‌అధిక ఛార్జీలు వసూళ్లు చేస్తున్నప్రైవేట్ వాహనాల దందాపై సాక్షి వరుస కథనాలు ఇచ్చింది. దీంతో అధికారులు రంగంలోకి దిగారు. ఎల్బీనగర్ లో ప్రైవేట్ వాహనాలపై ఆర్టిఏ అధికారుల కొరడా జులిపించారు. సంక్రాంతికి అధిక బస్సు చార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ వాహనాలపై ఆర్టిఏ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలోని టీం అడ్డుకుంది. దాదాపు 20 బస్సులపై కేసు నమోదు చేశారు. ఇక.. పెద్ద అంబర్ పేట్ వద్ద నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 10 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఆర్టీఏ అధికారుల సీజ్ చేశారు. మరోవైపు.. రాజేంద్రనగర్ ఆరాంఘడ్ చౌరస్తా వద్ద రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారుల ఈ ఉదయం 4 గంటల నుంచే తనిఖీ చేపట్టారు. చెన్నై, తిరువంతపురం, పాండిచ్చేరి, మంగళూరు, మైసూరు, కన్యాకుమారి నుండి హైదరాబాద్ వస్తున్న బస్సులను తనిఖీలు చేస్తున్నారు . ఈ క్రమంలో నిబంధనలకు తూట్లు పొడుస్తున్నట్రావెల్స్‌పై కేసులు నమోదు చేస్తున్నారు. 11 బస్సుల పై కేసు నమోదు అయినట్లు సమాచారం. -
రెండంతస్తుల్లో చర్లపల్లి రైల్వేస్టేషన్ నిర్మాణం
సాక్షి, హైదరాబాద్: చర్లపల్లి రైల్వేస్టేషన్ ఆధునికీకరణపై దక్షిణమధ్య రైల్వే మరో ముందడుగు వేసింది. ఎయిర్‌పోర్టు తరహాలో చర్లపల్లి రైల్వేస్టేషన్ పునర్నిర్మాణానికి తాజాగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రైల్వేస్టేషన్ల ఆధునికీకరణలో భాగంగా విమానాశ్రయం తరహాలో తిరుపతి, సికింద్రాబాద్ స్టేషన్ల పునర్ అభివృద్ధికి చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. తిరుపతి స్టేషన్ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్ స్టేషన్‌కు ఒకట్రెండు రోజుల్లో టెండర్లు ఖరారు కానున్నాయి. ఈ క్రమంలోనే గ్రేటర్ హైదరాబాద్‌లో 4వ టర్మినల్‌గా ఇప్పటికే విస్తరణ పనులు చేపట్టిన చర్లపల్లి స్టేషన్‌ను సైతం ఎయిర్‌పోర్టు తరహాలో అభివృద్ధి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 2023 జూన్ నాటికి చర్లపల్లి స్టేషన్‌ను వినియోగంలోకి తెచ్చేందుకు పనుల్లో వేగం పెంచినట్లు సికింద్రాబాద్ డివిజనల్ రైల్వేమేనేజర్ అభయ్‌కుమార్ గుప్తా తెలిపా రు. అన్ని సదుపాయాలతో వినియోగంలోకి రానున్న చర్లపల్లి స్టేషన్ నుంచి కాజీపేట్, విజయవాడ రూట్లో వెళ్లే రైళ్లను నడుపనున్నట్లు పేర్కొన్నారు. సేవలు ఇలా.... చర్లపల్లి స్టేషన్‌ను రెండంతస్తుల్లో పునర్ నిర్మించనున్నారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో ప్రయాణికుల విశ్రాంతి గదులు, హోటళ్లు, రైల్వే అధికారుల కార్యాలయాలు తదితర సదుపాయాలు ఉంటాయి. విమానాశ్రయంలో లాగా ప్రయాణికులు ప్రవేశద్వారం నుంచి నేరుగా ప్లాట్‌ఫామ్‌కు చేరుకొనేలా మొదటి అంతస్తు ఉంటుంది. మొదటి విడతలో మొత్తం 8 లైన్లతో ప్లాట్‌ఫాంలను విస్తరిస్తారు. దశలవారీగా ప్లాట్‌ఫామ్‌ల సంఖ్య పెరగనుంది. అన్ని ప్లాట్‌ఫాంలకు చేరుకొనేలా ఎస్కలేటర్లు, లిఫ్టులు ఏర్పాటు చేస్తారు. “రైళ్ల నిర్వహణకు పిట్లైన్లు, ఇక్కడి నుంచి రైళ్లను నడిపేందుకు ప్రత్యేక మార్గాలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. చర్లపల్లి నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు అనుగుణంగా అప్రోచ్ రోడ్ల నిర్మాణం కూడా తుది దిశకు వచ్చింది’ అని డీఆర్ఎం వివరించారు. ఎయిర్‌పోర్టు తరహాలో స్టేషన్ పునర్ అభివృద్ధికి ఇటీవల నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు సికింద్రాబాద్ స్టేషన్ పునర్ అభివృద్ధి కోసం ఒకట్రెండు రోజుల్లో టెండర్ల ప్రక్రియ పూర్తవుతుందన్నారు. ఈ ఏడాది అక్టోబర్ నుంచి పనులను ప్రారంభించనున్నట్లు చెప్పారు. చర్లపల్లి నుంచే వందేభారత్... సెమీ హైస్పీడ్‌గా పేరొందిన వందేభారత్ రైళ్లను చర్లపల్లి నుంచే నడపనున్నారు. ప్రయాణికుల డిమాండ్, రద్దీ ఎక్కువగా ఉన్న మార్గాల్లో వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. చర్లపల్లి నుంచి విశాఖ, ముంబై తదితర మార్గాల్లో వందేభారత్ నడపాలని భావిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. రైల్వేలోని అన్ని జోన్లకు దశలవారీగా వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వేశాఖ చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే.


