అమ్మ ఎందుకలా చేసిందో..! | Mother Ends Life Along with Two Children | Sakshi
Sakshi News home page

అమ్మ ఎందుకలా చేసిందో..!

Feb 2 2026 7:20 AM | Updated on Feb 2 2026 5:04 PM

 Mother Ends Life Along with Two Children

అంతుచిక్కని తల్లీపిల్లల ఆత్మహత్య కేసు  

సహచరులు, బంధువులను   విచారించిన పోలీసులు  

ఫోన్‌ డేటా వివరాలు తెలిస్తేనే దర్యాప్తు ముందుకు  

హైదరాబాద్: చర్లపల్లి రైల్వేస్టేషన్‌ సమీపంలో శనివారం తెల్లవారుజామున ఇంటర్‌ చదివే కుమారుడు, కూతురుతో కలిసి ఆ తల్లి రైలుకింద పడి బలవన్మరణం చేసుకుంది. ఈ కేసు విచారణ సందర్భంగా పోలీసులకు ఇప్పటి వరకు ఎటువంటి క్లూ లభించలేదు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ విజయశాంతిరెడ్డి బలవన్మరణం కేసు మిస్టరీ ఆదివారం రాత్రి వరకు వీడలేదు. ఈ ఘటనకు సంబంధించి సికింద్రాబాద్‌ రైల్వే పోలీసులు గంటల కొద్దీ ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి సెల్‌ఫోన్‌ సందేశాలలో పోలీసులకు రెండు అనుమానాస్పద సందేశాలు లభించాయి. ఈ రెండు సందేశాలను పంపించిన ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులను రైల్వే పోలీసు లు సికింద్రాబాద్‌ రప్పించి విచారించారు. 

ఒకరు సారీ మేడం ఇటువంటి తప్పు మరోమారు జరగదు అని, మరోకరు మేడం గుడ్‌మార్నింగ్‌‌ అని సందేశాలు పంపించారు. ఇవి రెండు సందేశాలు కార్యాలయ సమాచార నిమిత్తం పంపినవని పోలీసులు తమ విచారణలో ధృవీకరించుకున్నారు. సహచరులను పోలీసులు సంప్రదించినా విజయశాంతిరెడ్డి తన కార్యాలయంలో చురుకుగా ఉండే తీరును మాత్రమే పోలీసులకు వివరించారు. ఎప్పుడూ తను ఆందోళన చెందుతున్నట్టు కానీ... భయపడుతున్నట్టు కానీ కనిపించేది కాదని చెబుతున్నట్టు జీఆర్‌పీ ఇన్‌స్సెక్టర్‌ జీ.సాయీశ్వర్‌గౌడ్‌ తెలిపారు. ఇదిలా ఉండగా మృతురాలి పుట్టింటివారు, మెట్టింటికి చెందిన పలువురు సమీప బంధువులను కూడా పోలీసులు విచారించారు. 

వారి నుంచి కూడా పోలీసులు ఆశించిన సమాచారం అభించలేదు. సురేందర్‌రెడ్డి, విజయశాంతిరెడ్డి దంపతులది ఆదర్శవంతమైన జీవనమని  బంధువులు చెప్పినట్టు పోలీసులు పేర్కొంటున్నారు. వారికి కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు లేవని స్పష్టం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్న విజయశాంతిరెడ్డి పిల్లలతో పాటు ఆత్మహత్య చేసుకునేంతటి పరిస్థితులు ఏమై ఉంటాయన్న కోణంలో పోలీసులు దర్మాప్తు ముమ్మరం చేశారు. విజయశాంతిరెడ్డి మొబైల్‌ ఫోన్‌ను సైబర్‌ క్రైం పోలీసులకు పంపించినట్టు జీఆర్‌పీ పోలీసులు తెలిపారు. వారం రోజుల్లో ఈ వివరాలు వచ్చే అవకాశముంది. డేటా వస్తే దర్యాప్తు ముందుకు సాగే అవకాశం ఉన్నట్టు వారు చెప్పారు.  

 

 

Advertisement
 
Advertisement
Advertisement