లక్నో: పోలీసులు జరుపుతున్న ఎన్‌కౌంటర్లపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు పలువురు నిందితుల కాళ్లపై కాల్పులు జరిపి, వాటిని ఎన్‌కౌంటర్లుగా చిత్రీకరించే ధోరణిపై అలహాబాద్ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. నిందితుల కాళ్లపై కాల్పులు జరపవచ్చని పోలీసు అధికారులకు ఏవైనా మౌఖిక లేదా లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేశారా? అని రాష్ట్ర డీజీపీ, హోం సెక్రటరీని కోర్టు ప్రశ్నించింది. ఈ తరహా ఘటనలపై పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని యూపీ ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకోవడానికో లేదా నిందితులకు బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో శిక్షగా వారి కాళ్లపై కాల్పులు జరుపుతున్నట్లు కనిపిస్తున్నదని ధర్మాసనం పేర్కొంది. చట్టాన్ని పరిరక్షించాల్సిన వారే ఇలాంటి చర్యలకు పాల్పడటం గమనార్హమని వ్యాఖ్యానించింది. శిక్షించే అధికారం కేవలం న్యాయస్థానాలకే ఉంటుందని, పోలీసులకు కాదని కోర్టు స్పష్టం చేసింది. ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో కార్యనిర్వాహక, శాసన, న్యాయ వ్యవస్థల విధులు స్పష్టంగా నిర్వచించారని కోర్టు గుర్తుచేసింది. న్యాయ వ్యవస్థ పరిధిలోకి పోలీసులు చొరబడటం ఎంతమాత్రం సహించబోమని, ఇది రాజ్యాంగ విరుద్ధమని కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది.
చిన్నపాటి నేరాలకూ తూటాలేనా?
దొంగతనం లాంటి చిన్నపాటి నేరాల్లో కూడా పోలీసులు విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ, వాటిని ఎన్‌కౌంటర్లుగా సృష్టిస్తున్నారని న్యాయమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. వివిధ ఎన్‌కౌంటర్లలో గాయపడిన ముగ్గురు నిందితుల బెయిల్ పిటిషన్లను విచారించే సందర్భంలో ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ఈ ఘటనల్లో ఏ ఒక్క పోలీసు అధికారికి కూడా గాయం కాలేదనే విషయాన్ని కోర్టు ప్రస్తావించింది.
ఇది కూడా చదవండి: ఢిల్లీ పేలుడు దర్యాప్తు: వణికించేలా ఉగ్ర ప్రణాళికలు?


