న్యూఢిల్లీ: గత ఏడాది నవంబర్ 10న ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటనపై జరుగుతున్న విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. ఈ పేలుడుకు బాధ్యులైన ఉగ్రవాద మాడ్యూల్.. కేవలం ఎర్రకోటకే పరిమితం కాకుండా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఒక ప్రముఖ కాఫీ చైన్ అవుట్‌లెట్లను లక్ష్యంగా చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
దేశంలోని ప్రధాన నగరాల్లో భారీ స్థాయిలో దాడులు నిర్వహించేందుకు ఈ నిందితులు పక్కా ప్రణాళికలు రచించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కుట్ర వెనుక ఉన్న ఉగ్రవాద ముఠా గత నాలుగేళ్లుగా అత్యంత రహస్యంగా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు సమాచారం. ఈ ‘వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్’ కార్యకలాపాలను అడ్డుకోవడంలో జమ్ముకశ్మీర్ పోలీసులు కీలక పాత్ర పోషించారు. వారు అందించిన పక్కా సమాచారంతో నవంబర్, డిసెంబర్ నెలల్లో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో జరగాల్సిన పలు దాడులను భద్రతా దళాలు విజయవంతంగా తిప్పికొట్టాయి. తద్వారా భారీ ప్రాణ నష్టం తప్పింది.
ఈ కేసులో ఇటీవల వెల్లడైన వివరాల ప్రకారం.. ముజమ్మిల్ గనాయ్, అదిల్ రాథర్ తదితర వైద్యులు కూడా ఈ మాడ్యూల్‌లో సభ్యులుగా ఉండటం గమనార్హం. వీరు పాకిస్తాన్ హ్యాండ్లర్లతో సంబంధాలు కొనసాగించేందుకు ‘ఘోస్ట్’ సిమ్ కార్డులు, ఎన్‌క్రిప్టెడ్ యాప్‌లను వినియోగించారు. దర్యాప్తు సంస్థలను తప్పుదోవ పట్టించడానికి ‘డ్యూయల్ ఫోన్’ పద్ధతిని పాటిస్తూ, సాధారణ అవసరాలకు ఒక ఫోన్, రహస్య కార్యకలాపాలకు మరో ఫోన్ వాడేవారని అధికారులు గుర్తించారు.
ఈ ఉగ్రవాద ముఠా వాడిన సాంకేతిక పద్ధతులను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం, అక్రమ సమాచార మార్పిడిని అరికట్టేందిశగా కీలక నిర్ణయం తీసుకుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ గత ఏడాది నవంబర్ 28న జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి యాప్‌లు ఖచ్చితంగా ఫోన్‌లోని యాక్టివ్ ఫిజికల్ సిమ్ కార్డుతో అనుసంధానమై ఉండాలి. ఉగ్రవాదులు వాడుతున్న గుర్తించలేని కమ్యూనికేషన్ పద్ధతులకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇది కూడా చదవండి: ‘హెచ్‌ఐవీ’కి ఏఐ సలహా.. ఆరోగ్యం విషమించి..


