చైనాలో ఇప్పుడు వింత పరిస్థితి నెలకొంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా పేరుగాంచిన చైనా ఇప్పుడు జనాభా క్షీణతతో సతమతమవుతోంది. ప్రభుత్వం ఎన్ని ఆఫర్లు ప్రకటించినా అక్కడి యువత పిల్లలను కనేందుకు సుముఖంగా లేరు. చైనాలో ప్రస్తుతం ‘హ్యూమన్ బేబీస్’ కంటే ‘ఫర్ బేబీస్’ (బొచ్చు ఉన్న పెంపుడు జంతువులు) సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. తల్లిదండ్రులుగా మారడం కంటే కుక్కలు, పిల్లులను పెంచుకోవడమే మేలని అక్కడి యువత భావిస్తోంది.
రికార్డు స్థాయిలో పడిపోయిన జనన రేటు
గత కొన్నేళ్లుగా చైనాలో జననాల సంఖ్య భారీగా తగ్గుతోంది. 2023 నాటికే చైనా జనాభా 1.405 బిలియన్ల((140.5 కోట్లు)కు పడిపోయింది. 2015లో 16.55 మిలియన్లు((1,65,50,000)గా ఉన్న జననాలు, గతేడాదికి కేవలం 7.92 మిలియన్ల((79,20,000)కు పరిమితమయ్యాయి. దశాబ్దం క్రితంతో పోలిస్తే ఇది సగం మాత్రమే. పెళ్లిళ్ల రేటు కూడా 20 శాతం వరకు తగ్గడం అధికారులను కలవరపెడుతోంది. 1979లో అమలు చేసిన ‘ఒక్కరు ముద్దు’ విధానం ప్రభావం ఇప్పుడు దేశ భవిష్యత్తుపై తీవ్రంగా కనిపిస్తోంది.
పిల్లల కంటే పెంపుడు జంతువులే బెస్ట్ అంటూ..
చైనాలోని యువత ప్రస్తుతం పిల్లల కంటే పెంపుడు జంతువుల వైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణం అక్కడి ఆర్థిక పరిస్థితులు. చైనాలో పెరిగిపోతున్న జీవన వ్యయం, విపరీతమైన పోటీతత్వం కలిగిన వాతావరణంలో పిల్లలను పెంచడం భారమని వారు భావిస్తున్నారు. ‘పెంపుడు జంతువులు మనకు ఆనందాన్ని ఇస్తాయి. పిల్లల పెంపకం అనేది చాలా అలసిపోయే పని’ అని బీజింగ్‌కు చెందిన గ్వో జిన్యి అనే యువతి అభిప్రాయపడ్డారు. పెంపుడు జంతువులకు పిల్లల లాగా విద్యాభ్యాసం, పోటీ పరీక్షల టెన్షన్ ఉండదని ఆమె తెలిపింది.
కెరీర్‌పై ఆందోళన
చైనా యువతలో ముఖ్యంగా మహిళల్లో కెరీర్ పట్ల ఆందోళనలు పెరిగాయి. పిల్లలు పుడితే తమ ఉద్యోగాలు ఎక్కడ పోతాయో అన్న భయం వారిని వెంటాడుతోంది. చైనాలో 35 ఏళ్ల తర్వాత ఉద్యోగ నియామకాల్లో వివక్ష అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. పిల్లలను పెంచుతూ కెరీర్‌లో రాణించడం అసాధ్యమని భావిస్తున్న మహిళలు, తమ సమయాన్ని, ప్రేమను పెంపుడు జంతువులకే పంచుతున్నారు.
ప్రభుత్వ ప్రోత్సాహకాలు.. ఫలితం సున్నా
జనాభాను పెంచడానికి చైనా ప్రభుత్వం ముగ్గురు పిల్లల వరకు అనుమతి ఇచ్చింది. పిల్లల పెంపకం కోసం పన్ను రాయితీలు, నగదు సబ్సిడీలు కూడా ప్రకటించింది. మరోవైపు గర్భనిరోధక సాధనాలపై పన్నులను పెంచి వినూత్న ప్రయోగాలు చేస్తోంది. అయితే ఈ ఆఫర్లు యువతను ఆకట్టుకోలేకపోతున్నాయి. ప్రభుత్వ సబ్సిడీల కంటే పిల్లల పెంపకానికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువగా ఉండటమే దీనికి ప్రధాన కారణం.
మారుతున్న కుటుంబ విలువలు
ఒకప్పుడు చైనాలో తల్లిదండ్రులే పిల్లల భవిష్యత్తును నిర్ణయించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. యువత తమ జీవితంపై పూర్తి స్వేచ్ఛ కావాలని కోరుకుంటున్నారు. సాంప్రదాయ కుటుంబ వ్యవస్థ కంటే వ్యక్తిగత ఆనందానికే ప్రాముఖ్యత ఇస్తున్నారు. పెంపుడు జంతువులను కేవలం జంతువులుగా కాకుండా, తమ కుటుంబ సభ్యులుగా చూస్తూ, వాటికి కూడా మనుషుల లాగే దుస్తులు, ఆహారం సమకూరుస్తున్నారు.
పెరిగిన పెంపుడు జంతువుల జనాభా
గోల్డ్‌మన్ సాచ్స్ నివేదిక ప్రకారం చైనాలో 4 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల కంటే పెంపుడు జంతువుల సంఖ్యే ఎక్కువగా ఉంది. 2030 నాటికి చైనాలో సుమారు 70 మిలియన్ల పెంపుడు జంతువులు ఉంటాయని అంచనా. అదే సమయంలో పసిపిల్లల సంఖ్య 40 మిలియన్లకు పడిపోవచ్చు. 2017లో ఉన్న పరిస్థితికి ఇది పూర్తిగా వ్యతిరేకం. నాటి రోజుల్లో పిల్లలే పెంపుడు జంతువుల కంటే రెట్టింపు సంఖ్యలో ఉండేవారు.
బాధ్యతాయుతమైన నిర్ణయం?
చైనా యువత పిల్లలను వద్దు అనుకోవడం బాధ్యతారాహిత్యం కాదని, అది ఒక రకమైన ‘బాధ్యతాయుతమైన నిర్ణయం’ అని విశ్లేషకులు భావిస్తున్నారు. పిల్లలకు మెరుగైన జీవితాన్ని, తగినంత సమయాన్ని ఇవ్వలేనప్పుడు వారిని కనడం కంటే, ఒక కుక్కనో, పిల్లినో పెంచుకోవడం ఉత్తమమని వారు భావిస్తున్నారు. పెంపుడు జంతువులను పెంచి పోషించడాన్నివారు ‘నొప్పి లేని మాతృత్వం’ అని అంటున్నారు.
ఇది కూడా చదవండి: పాదచారుల ప్రాణాలకు గ్యారెంటీ ఏది?


