ఆ బామ్మకు ఏ కష్టం వచ్చిందో..! పాపం 89 ఏళ్ల వయసులో.. | 89-Year-Old Mumbai Dadi Sells Bracelets On Local Trains | Sakshi
Sakshi News home page

ఆ బామ్మకు ఏ కష్టం వచ్చిందో..! పాపం 89 ఏళ్ల వయసులో..

Feb 1 2026 3:45 PM | Updated on Feb 1 2026 5:35 PM

89-Year-Old Mumbai Dadi Sells Bracelets On Local Trains

కొన్ని ఘటనలు ఎంతో ఆలోచించేలా చేస్తాయి. కొత్త స్ఫూర్తిని నింపుతాయి. చిన్న చిన్న సమస్యలకే బెంబేలెత్తే మనం, ఇలాంటి బామ్మను చూసి ఎంతో ప్రేరణ పొందుతాం. కష్టం ఏదైతేనేం..దాన్ని అధిగమించేలా నవ్వుతూ మనపని మనం ఎలా చేసుకుంటూ పోవాలో ఈ బామ్మని చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. ఆత్మగౌరవం అనే మాటకు అసలైన అర్థంలా అనిపిస్తుంది ఈ బామ్మ జీవన విధానం..

ఆ బామ్మ పేరు 89 ఏళ్ల కమలాబెన్‌ మెహతా. ముంబై లోకల్‌ రైళ్లలో నిశబ్దంగా బ్రాస్‌లెట్‌లు అమ్ముతు ఉంటుందామె. ఆమెను చూడగానే ఈ వయసులో ఇంతలా ‍కష్టపడుతుందా అని ఆశ్చర్యం వేస్తుంది. అయితే ఆమె ఎవరి నుంచి సానుభూతిని, దాతృత్వాన్ని ఆశించకుండా కష్టపడుతున్న తీరు నిజంగా మనసుని కదిలిస్తుంది. చనిపోయేదాక ఆత్మగౌరవానికి భంగం కలగకుండా బతకడం అంటే ఇదే కదా అనిపిస్తుంది  ఆ బామ్మని చూస్తే. 

అందుకు సంబంధించిన పోస్ట్‌ని ఓ ప్రయాణికుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అతడు ఆమెతో మాటలు కలపగా తనపేరు కమలాబెన్‌ అని, తన వయసు 89 ఏళ్లని ఆ బామ్మ చెప్పిందని పోస్ట్‌లో పేర్కొన్నాడు. తన కుటుంబంతో కలిసి జీవించడానికి తన వంతుగా ఎంతో కొంత డబ్బులు ఇచ్చేందుకే ఈ పని చేస్తున్నట్లు తెలపింది. తాను ముంబైలోని నలసోపారాలో నివశిస్తున్నట్లు పేర్కొంది. 

ఆమెకు సాయం చేయాలని.. తన దగ్గరున్న బ్రాస్‌లెట్‌లు కొందామనుకున్నా.. అంత మొత్తం లేకపోవడంతో ఆ బామ్మ ఇంటి అడ్రస్‌ అడగగా, ఆమె అందుకు నిరాకరించింది. పైగా తన కుటుంబ తన వల్ల అవమానపాలు కాకూడదు అంటూ అక్కడ నుంచి మౌనంగా నిష్క్రమించిందని పోస్‌లో రాసుకొచ్చాడు సదరు ప్రయాణికుడు.  

నిజానికి ఆ వయసులో ఈ బామ్మ ఏ రకంగానైనా సంపాదించొచ్చు. కానీ తన ఆత్మగౌరవం కోసం శరీరం సహకరించి వృద్ధాప్యంలో కూడా అచంచలమైన పట్టుదలతో చేతితో తయారు చేసిన బ్రాస్‌లెట్లు అమ్ముతూ సంపాదించాలనుకోవడం నిజంగా ప్రశంసనీయం..స్ఫూర్తిదాయకం. చివరి క్షణం వరకు తలెత్తుకునే బతకాలి కానీ, చేయిచాచి కాదు అని చెంపపగిలేట్టు సమాధానమిచ్చే ఘటన ఇది. ఇంకెందుకు ఆలస్యం నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ వీడియోపై మీరు ఓలుక్కేయండి మరి.

 

(చదవండి: అరుదైన ఘనత సాధించిన తొలి మహిళ..! ఏకంగా ఐదు హిమాలయాలు..)

 

Advertisement
 
Advertisement
Advertisement