ప్లాటిపస్ అనే జంతువు ప్రపంచంలోనే అత్యంత విచిత్రమైన జంతువుల్లో ఒకటి. ఇది గుడ్లు పెడుతుంది, తన పిల్లల కోసం పాలు ఉత్పత్తి చేస్తుంది, నీటిలో విద్యుత్ సంకేతాలను గుర్తించగలదు. ఆశ్చర్యంగా అనిపిస్తుందా? అంతే కాదు, అల్ట్రావయలెట్ కాంతిలో ఇది వెలుగుతుంది కూడా!
ప్లాటిపస్‌లు ఆస్ట్రేలియాలోని తూర్పు ప్రాంతాల్లో ఉన్న నదులు, వాగుల్లో నివసిస్తాయి. వీటిలో అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఇవి విషం కలిగిన స్తన్యజంతువులు కావడం. సాధారణంగా మనం విషం అంటే పాములు, తేళ్లను గుర్తుకు తెచ్చుకుంటాం. కానీ మగ ప్లాటిపస్ కూడా విషాన్ని కలిగి ఉంటుంది.
మగ ప్లాటిపస్‌ల వెనుక కాళ్ల దగ్గర పదునైన ముళ్లు ఉంటాయి. ఆడవాటితో జతకట్టే కాలంలో, ఈ ముళ్లు విష గ్రంథులతో కలుస్తాయి. అప్పుడు అవి చాలా శక్తివంతమైన విషాన్ని విడుదల చేస్తాయి.
శాస్త్రవేత్తలు ఈ విషంలో కనీసం 19 రకాల ప్రత్యేక రసాయనాలు (పెప్టైడ్లు) ఉన్నాయని కనుగొన్నారు. కొన్ని రసాయనాలైతే ప్రపంచంలో మరే జంతువులోనూ లేవు. ఈ విషం మనుషులకు ప్రాణాంతకం కాదు. కానీ చాలా తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. ప్లాటిపస్ విషానికి గురైనవారు ‘ఎముక విరిగిన దానికంటే కంటే ఎక్కువ నొప్పి’ అని చెబుతారు. కొన్నిసార్లు ఆ నొప్పి వారాల పాటు లేదా నెలల పాటు కొనసాగుతుంది. దీనికి ఇప్పటివరకు ప్రత్యేక విరుగుడు మందు (యాంటీ వెనమ్) లేదు. ఈ విషం భవిష్యత్తులో మనుషులకు ఉపయోగపడే అవకాశం కూడా ఉంది. శాస్త్రవేత్తలు దీని ద్వారా కొత్త నొప్పి నివారణ మందులు, డయాబెటిస్ మందుల తయారీకి సంబంధించిన పరిశోధనలు చేస్తున్నారు.
ఇదీ చదవండి: హైఎండ్ కార్లు,చాపర్ రైడ్స్ : ఎందుకు సీజే రాయ్ ఆత్మహత్య?


