‘మీ చిలుక పలుకులు చూసి యువతరం ఛీ కొడుతోంది’ | BRS Leader KTR Slams Telangana Govt | Sakshi
Sakshi News home page

‘మీ చిలుక పలుకులు చూసి యువతరం ఛీ కొడుతోంది’

Feb 3 2026 12:06 PM | Updated on Feb 3 2026 4:14 PM

BRS Leader KTR Slams Telangana Govt

హైదరాబాద్‌: మరో గ్యారెంటీ నుంచి  సీఎం రేవంత్‌ రెడ్డి నిసిగ్గుగా ముఖం చాటేసిందని, దీనిపై తెలంగాణ నిరుద్యోగుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోందన్నారు బీఆర్‌ఎస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలిస్తామని అడ్డదారిలో గద్దెనెక్కిన రేవంత్‌.. తీరా అది ఐదేళ్ల హామీ అని, పీసీసీ  చీఫ్‌తో సీఎం పలికిస్తున్న చిలుక పలుకులు చూసి యువతరం ఛీ కొడుతోందని ట్వీట్‌ చేశారు కేటీఆర్‌. 

‘ తొలి సంవత్సరమే రెండు లక్షల నియామకాలు చేపట్టకపోతే ప్రభుత్వాన్ని దించేయండని ఢిల్లీ నుంచి వచ్చి మరీ చెప్పిపోయిన ప్రియాంక మాట అమలై ఉంటే.. ఈ దగాకోరు సర్కారు కుప్పకూలి ఇప్పటికే ఏడాది పూర్తయ్యేది. కేసీఆర్హయాంలో చివరి దశలో ఉన్న 65 వేల ఉద్యోగాలకు నియామక పత్రాలిచ్చి ఫోటోలకు ఫోజు కొట్టిన సీఎం.. ఆ తరువాత మొత్తానికే చేతులెత్తేయడంతోనే తెలంగాణలో “రిక్రూట్ మెంట్ జీరో”గా మారిపోయింది. అప్పటికే లక్షా 65 వేల ఉద్యోగాలను భర్తీచేసిన బీఆర్ఎస్ ప్రభుత్వంపై పనిగట్టుకుని రేవంత్ చల్లిన బురద అంతా అబద్ధాలతో అందలం ఎక్కడానికేనని అందరికీ అర్థమైపోయింది. పట్టుమని పదివేల కొత్త ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్లు ఇవ్వని చేతకాని దద్దమ్మ పాలన చూసి నిరుద్యోగులే కాదు, వారి తల్లిదండ్రులు కూడా దుమ్మెత్తి పోస్తున్నారు.

జాబ్ క్యాలెండర్‌కు పాతరేసి,  వరుస కుంభకోణాలతో రేవంత్ సర్కారు జేబులు నింపుకుంటున్న తీరును నిత్యం తెలంగాణ సమాజం గమనిస్తూనే ఉంది. రెండు లక్షల ఉద్యోగాల హామీపై నాలుక మడతేసినంత మాత్రాన నాలుగు కోట్ల ప్రజలు ఊరుకుంటారని, ముఖ్యమంత్రి చేసిన మోసాన్ని మరిచిపోతారని అనుకుంటే అది  పొరపాటే. తెలంగాణ నిరుద్యోగులను నమ్మించి నయవంచన చేసినందుకు ముఖ్యమంత్రి ముక్కునేలకు రాసి క్షమాపణలు చెప్పినా, పొర్లుదండాలు పెట్టినా క్షమించే ప్రసక్తే లేదు. 

మేధావుల ముసుగు వేసుకుని మాయమాటలతో మభ్యపెట్టిన గొంతులన్నీ గత రెండేళ్లనుంచి మూగబోయినంత మాత్రాన మీరు చేసిన పాపం ఊరికేపోదు.మెగా డీఎస్సీ పేరిట దగా, నిరుద్యోగ భృతి పేరిట చేసిన ద్రోహానికి గుణపాఠం చెప్పేందుకు ఆదిలాబాద్ నుంచి అశోక్ నగర్ చౌరస్తా వరకూ ప్రతి నిరుద్యోగి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికే మూడు దఫాలుగా రైతుబంధు ఎగ్గొట్టి 70 లక్షల మంది అన్నదాతల పొట్టకొట్టారు. కేసీఆర్ గారి పాలనలో  ఆత్మగౌరవంతో బతికిన రైతన్నను మళ్లీ అప్పులపాలు చేసి తీరని ద్రోహం చేశారు.

KTR: 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ? జాబ్ క్యాలెండర్ కు పాతర

సీఎం సీటుపై కూర్చున్న మరుక్షణంలోనే ప్రతి మహిళకు రూ. 2500 ఇస్తానని చెప్పిన మాటకు రెండేళ్లయినా ఒక్కరికీ దిక్కులేకపోవడంతో ఆడబిడ్డలు కోపంతో రగిలిపోతున్నారు. ఆరు గ్యారెంటీలన్నీ అక్షరాలా గారడీలేనని, 420 హామీలన్నీ నయవంచన మాత్రమేనని తన నిజస్వరూపాన్ని బయటపెట్టిన రేవంత్ సర్కారుకు నిరుద్యోగుల ఉసురు తగలడం ఖాయం. చైతన్యానికి ప్రతీకైన తెలంగాణ యువత సంఘటిత శక్తిలో ఉన్న బలం ఏంటో, వారు బిగించే పిడికిళ్లు కాంగ్రెస్  పునాదులను ఎలా పెకిలిస్తాయో త్వరలోనే చూస్తాం’ అని కేటీఆర్‌ తెలిపారు.

 

Advertisement
 
Advertisement
Advertisement