రంగారెడ్డి జిల్లా: కూతురి పెళ్లి ఘనంగా చేసి మురిసిపోదాం అనుకున్న ఆ తండ్రి కల చెదిరిపోయింది. మరో 20 రోజుల్లో పెళ్లి ఉందనగా రోడ్డు ప్రమాదం పొట్టనపెట్టుకుంది. ఈ విషాదకర సంఘటన సోమవారం రాత్రి మండలంలో చోటు చేసుకుంది. సీఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్ల మండలం తంగడుపల్లి గ్రామానికి చెందిన రవీందర్‌గౌడ్ (42) ప్రైవేటు ఉద్యోగి. భార్య లలిత, కూతురు ఉంది. కొడుకు ఏడాదిన్నర క్రితం వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నాడు.
ప్రస్తుతం వీరు పటాన్‌చెరు మండలం ముత్తంగిలో నివాసం ఉంటున్నారు. ఇటీవలే రవీందర్‌గౌడ్ కూతురి వివాహం నిశ్చయం కాగా.. ఈనెల 22న పెళ్లి ఉంది. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం కూతురి వివాహ పనుల నిమితం తన ద్విచక్రవాహనంపై సిమెంటు బస్తా వేసుకొని సొంత గ్రామానికి బయలుదేరాడు. బైక్ ఎర్వగూడ గేటు వద్ద ఉండగా.. ఎదురుగా వికారాబాద్ వైపు నుంచి వస్తున్న కారు అతివేగం, అజాగ్రత్తగా వచ్చి బలంగా ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో రవీందర్ గౌడ్ తలకి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 20 రోజుల్లో పెళ్లి ఉందనగా ఇంటి పెద్ద మృతి చెందడంతో కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


