సాక్షి, విజయవాడ/అన్నమయ్య: రైల్వేకోడూరు ఎమ్మెల్యే తనను లైంగికంగా వేధించాడని ఆధారాలతో సహా బాధితురాలు బయటకు వస్తే.. ఆ వ్యవహారాన్ని మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నం చేస్తోంది అధికార పార్టీ జనసేన. ఏకంగా అసెంబ్లీ నుంచే అరవ శ్రీధర్ వీడియో కాల్స్ చేసినట్లు విషయాన్ని ఆమె బయటపెట్టింది. అయినా కూడా ‘చర్యలుండవ్’ అంటూ బహిరంగంగా చెబుతూ.. ఇటు కమిటీ పేరిట కాలయాపన చేస్తోందా పార్టీ.
కీచక ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై చర్యలకు జనసేన ఏమాత్రం సుముఖంగా లేనట్లు కనిపిస్తోంది. వేధింపులను బాధితురాలు నేరుగా సీఎం, డిప్యూటీ సీఎం, డీజీపీల దృష్టికి తీసుకెళ్లిన ప్రయోజనం లేకుండా పోయింది. దళిత మహిళ రోడ్డెక్కినా.. హోం మంత్రి అనిత స్పందించడం లేదు. ప్రభుత్వ ఒత్తిళ్లతో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు స్వీకరించడం లేదు. వారం గడుస్తున్నా ఎలాంటి చర్యల్లేవ్. అందుకే ఆమె నేరుగా హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది. మరోవైపు..
ఎమ్మెల్యే అరవశ్రీధర్ గలీజు వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నా.. జనసేన చర్యలు తీసుకోవడం లేదు. పవన్ కల్యాణ్ ఈ అంశంపై స్పందించకుండా ముఖం చాటేస్తున్నారు. పైగా బాధితురాలిని బెదిరించిన జనసేన నేత నాగేంద్రతోనే కమిటీ వేయించారు. ఈ కమిటీలో శివశంకర్, రమాదేవి, వరుణలు ఉన్నారు. వీళ్లు ఓ హోటల్‌లో దిగారు. శ్రీధర్ వాళ్ల ముందు హాజరయ్యారు. ఇవాళ, రేపు అరవ శ్రీధర్‌ను విచారిస్తారట. ఆ వీడియోలు అసలువో.. నకిలీవో నిర్ధారించుకుంటున్నారట. అంతేగానీ అరవ శ్రీధర్ తప్పేం లేదని మాత్రం ఆ పార్టీ ప్రకటించలేకపోతోంది.
అరవశ్రీధర్, జనసేనలోని అతని అనుచరులు ఇప్పటికీ బాధితురాలిని బెదిరిస్తూ తిరుగుతున్నారు. జంగిల్ రాజ్‌లో ఇప్పటికే మహిళలకు భద్రత కరువైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వరుసలో.. ఓ కామాంధుడైన ఎమ్మెల్యేను ప్రభుత్వ పెద్దలు కాపాడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.



