మరీ ఇంతలా దిగజారాలా? | KSR Comment: CBN Lies Through Republic Day Governor Speech | Sakshi
Sakshi News home page

మరీ ఇంతలా దిగజారాలా?

Feb 3 2026 10:18 AM | Updated on Feb 3 2026 10:38 AM

KSR Comment: CBN Lies Through Republic Day Governor Speech

ఏపీలో కూటమి నేతల ప్రసంగాలకు వాస్తవిక పరిస్థితులకు మధ్య అస్సలు పోలికే ఉండటం లేదు. ఆఖరికి రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ చేత కూడా అబద్ధాలు వల్లెవేయించడం కూటమి నేతల దిగజారుడు తనానికి పరాకాష్టగా చెప్పుకోవాలి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్‌ చేసిన ప్రసంగంలో కొన్నేళ్లుగా రాష్ట్రానికి స్పష్టమైన దిశ లేకుండా పోయిందని చదివించారు. పెట్టుబడిదారుల్లో నమ్మకం క్షీణించిందని గత ప్రభుత్వంపై విమర్శలు చేయించారు. 

కూటమి ప్రభుత్వం అభివృద్ధి, పునరుద్ధరణ లక్ష్యంగా ఆవిష్కరణ, సంస్కరణలు, సమీక్షలు చేస్తోందని, వాటి ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని గవర్నర్తో పలికించారు. రాష్ట్రం కోలుకుంటోందని, మార్పు వైపు ప్రయాణం మొదలైందని, స్వర్ణాంధ్ర సాధనకు పది సూత్రాలను అమలు చేస్తున్నామని అనిపించారు. గవర్నర్ మాటలలో కొత్తదనం లేకపోవడం ఒక ఎత్తు అయితే.. గత ప్రభుత్వంపై బురదచల్లడం, కూటమి ప్రభుత్వం ఏదో చేస్తోందన్న భ్రమ కల్పించడానికి ఈ ప్రసంగాన్ని వాడుకోవడం ఇంకో ఎత్తు. సాధారణంగా గణతంత్ర, స్వాతంత్ర దినోత్సవాల వంటి జాతీయ ఉత్సవాలలో అధికార పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఎంత మేరకు అమలు చేసింది చెబుతూంటారు. గవర్నర్ ప్రసంగంలో ఆ భాగం ఉన్నట్లు మీడియాలో కనిపించలేదు. 

సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ చంద్రబాబు తరచు అసత్యాలను ప్రచారం చేస్తుంటారు. గవర్నర్‌తో కూడా ఆ మాట చెప్పించి ఉండకపోతే అది మంచి విషయమే.. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, ఏభై ఏళ్లకే పెన్షన్ తదితర హామీలు ఇప్పటికైతే గాలికి వదిలేసినట్టుగానే ఉంది. కూటమి ప్రభుత్వం తీసుకు వచ్చిన ఆవిష్కరణలు ఏమిటో, అభివృద్ది పునరుద్దరణ ఎక్కడ జరిగిందో ఎవరికి కనిపించదు. జగన్ ప్రభుత్వం తీసుకు వచ్చిన పలు వ్యవస్థలను నీరు కార్చడం, వాటి పేర్లు మార్చి తామే కనిపెట్టినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. గత ప్రభుత్వం చేపట్టిన ఓడరేవులు, మెడికల్ కాలేజీలు నిర్మాణం నిలిపి వేయడం అభివృద్ది ఎలా అవుతుంది? గవర్నర్ తన స్పీచ్‌లో రాష్ట్రంలో మార్పు మొదలైందని అనడంలో కూటమి ఉద్దేశం ఏమిటో కాని ఆ మార్పు ప్రజలకు అనుకూలమైనదా? వ్యతిరేకమైనదా? అన్నది సమీక్షించుకోవాలి. 

విశాఖపట్నంలో తమ సమీప బంధువు, లోక్‌సభ సభ్యుడు శ్రీభరత్‌కు చెందిన గీతం కాలేజీ ఆక్రమించిన 54 ఎకరాల ప్రభుత్వ భూమిని క్రమబద్దీకరించడానికి కార్పొరేషన్ చర్చ లేకుండా తీర్మానం చేయడం ఈ ప్రభుత్వం తీసుకువచ్చిన మార్పు కాబోలు. ఇందుకోసం ఫిరాయింపుల ద్వారా విశాఖ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవడం మరో మార్పుగా భావించాలి. ఈ భూమి విలువ సుమారు రూ.ఐదువేల కోట్లు అంటున్నారు. ప్రజలు ఏమైనా అనుకుంటారేమో అన్న చిన్నపాటి సంశయాన్ని కూడా వదిలేసి అధికారం అండగా బంధుప్రీతికి పాల్పడటం కూటమి తాలూకూ లేటెస్ట్‌ మార్పు. రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఈఎఎస్ శర్మ వంటి వారి అభ్యంతరాలను పెడచెవిన పెట్టడం మరో మార్పు. విశాఖలో ఒక మీడియా సంస్థకు కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కట్టబెట్టారని వార్తలు వచ్చాయి. ఇదే విశాఖలో వేలాది మంది నివసిస్తున్న దేవాలయ, ప్రభుత్వ  భూములను రెగ్యులైరైజ్ చేయకపోవడం గీతం కాలేజీ యాజమాన్యంతోపాటు కొందరు నేతలు,పలుకుబడి కలిగిన వ్యక్తులు కబ్జా చేసిన భూములను గత వైసీపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే, వాటిని ఆక్రమణదారులకే ధారాదత్తం చేయడానికి వెనుకాడకపోవడం ఏ రకమైన మార్పో? వైసీపీ పాలన సమయంలో విజయసాయిరెడ్డి బంధువులు భూమి కొనుగోలు చేసినా, అదంతా దందా అని ప్రచారం చేసిన ఎల్లో మీడియా, ఇప్పుడు ఈ కబ్జాలకు వంత పాడుతుండడం కూడా మార్పే. 

గవర్నర్‌ ప్రసంగం ద్వారా అమరావతి రాజధానితోనే అన్ని జరిగిపోతాయన్న భ్రమ కల్పించే యత్నం చేశారు. ఆ క్రమంలో మళ్లీ సుమారు లక్షన్నర ఎకరాల భూమిని సేకరించడానికి ప్రభుత్వం తలపెట్టడంపై అక్కడి ప్రజలు, ముఖ్యంగా రైతుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్న దానిపై మాత్రం భరోసా ఇచ్చినట్లు కనిపించలేదు. కేంద్రం ఏదో అమరావతిని అవకాశాల గని అని పేర్కొందని ఎల్లో మీడియా తెలిపింది. ఒకప్పుడు కాణి ప్రభుత్వ ఖర్చు లేకుండా సెల్ఫ్ ఫైనాన్స్ కాపిటల్ అని ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు అమరావతిని అప్పుల ఊబిలో దింపుతున్నారని పలువురు నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అది నిజమా? కాదా? అన్న దానిపై గవర్నర్‌తో వివరణ ఇప్పించి ఉంటే సబబుగా ఉండేది!. 

పేదరికం లేని సమాజం, ఉపాధి నైపుణ్యం, జనాభా నిర్వహణ, నీటి భద్రత, రైతులకు అగ్రిటెక్, ప్రపంచస్థాయి లాజిస్టిక్స్, వ్యయ నియంత్రణ, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్వచ్ఛాంధ్ర, సేఫ్ ఆంధ్ర, డీప్ టెక్ అండ్ స్మార్ట్‌ గవర్నెన్స్ అంటూ పడికట్టు పదాలను గవర్నర్ స్పీచ్ వాడారు. వీటితో ఏపీ స్వర్ణాంధ్రగా మారిపోతుందని ప్రజలను నమ్మమంటున్నారు. కాని ఇది నిత్యం చెప్పే అబద్దాలలో భాగమేనని ప్రజలకు తెలియదా! సమాన అవకాశాలు కల సమాజాన్ని నిర్మిస్తున్నామని గవర్నర్‌తో చెప్పించారంటే అంతకన్నా పెద్ద అసత్యం ఉంటుందా? 

ప్రభుత్వం నిర్మించవలసిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నారు. విశాఖలో అతి ఖరీదైన  ప్రభుత్వ భూములను పెద్ద, పెద్ద కంపెనీలకు వారు అడగకపోయినా 99 పైసలకే కట్టబెడుతున్నారు. ఇది అన్నిటికంటే అతి పెద్ద మార్పుగా ఏపీ  ప్రజలు చూస్తున్నారు. గతంలో ఇలాంటివి ఎన్నడూ జరగలేదు. వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి కేవలం అమరావతిలోనే వ్యయం చేస్తున్నారు. హామీలు అమలు చేయండంటే పీపీపీ అంటున్నారు. అప్పులు, అవస్థలు ప్రజలకు, ప్రభుత్వ సంపదను కొంతమంది బడాబాబులకు అప్పగిస్తున్నారు. 

రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న తీరుతో ఎంతటి అరాచక పరిస్థితులు నెలకొన్నాయో క్షీణించిన శాంతిభద్రతలు చెబుతాయి. చివరికి అనుచితమైన విద్వేషపూరిత రాతలన్న ఫ్లెక్సీలకు టీడీపీ గూండాలు కర్రలు పట్టుకుని కాపలా కాస్తుంటే, పోలీసులు భద్రత కల్పించడమే మహా మార్పు. పంతొమ్మిది నెలల్లో తెచ్చిన రూ.మూడు లక్షల కోట్లకుపైగా అప్పులతో రాష్ట్రం పరిస్థితి ప్రమాదకరంగా మారిందని ఆర్థికవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సేఫ్ గా ఉందని అనుకోవాలా? లేక అన్‌సేఫ్‌గా మారుతోందని  భయం కలుగుతుందా?

:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement